అప్పడుగానీ మానలేక పోయాను!
కనువిప్పు
ఎన్టీయార్ హీరోగా నటించిన ‘సాహసవంతుడు’ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.
‘‘సిగరెట్ కాలుస్తున్నావా?’’ అని హీరో అడుగుతాడు.
‘‘కాదు...సిగరెట్టే నన్ను కాలుస్తోంది’’ అని అవతలి నుంచి జవాబు.
ఒక దశలో నా పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఫ్రెండ్స్ దగ్గర ‘సరదాగా’ నేర్చుకున్న సిగరెటు...ఆ తరువాత ‘సీరియస్‌గా’ నన్ను కాల్చే ప్రయత్నం చేసింది.
మొదట్లో రోజుకు ఒక సిగరెట్ మాత్రమే తాగేవాడిని. ఆ తరువాత మూడు....ఆ తరువాత ఆరు...ఇలా పెరుగుతూ పోయింది. ఒకసారి సిగరెట్టు తాగుతూ నాన్నకు దొరికి పోయాను.
‘‘మన ఇంట్లో ఇప్పటి వరకు ఎవరికీ పొగతాగే అలవాటు లేదు. ఎక్కడ నేర్చుకున్నావు ఈ అలవాటు?’’ అని నాన్న బాగా తిట్టారు.
‘‘ఇకపై తాగను నాన్నా’’ అని తప్పించుకున్నాను. నాన్నకు తెలియకుండా దొంగచాటుగా తాగేవాడిని. పరీక్షల టైమ్‌లో టెన్షన్ పడి సిగరెట్లు విపరీతంగా తాగేవాడిని. ఒకరోజు రాత్రి విపరీతమై దగ్గు. మరుసటి రోజు హాస్పిటల్‌లో చూపించారు నాన్న. నేను విపరీతంగా సిగరెట్లు తాగుతున్నాననే విషయాన్ని డాక్టర్ గారు గ్రహించారు. కౌన్సెలింగ్ మొదలు పెట్టారు. పొగ తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడి చిన్న వయసులోనే చనిపోయిన కొందరు యువకుల గురించి చెప్పారు.
‘‘నిన్ను సిగరెట్లు మానిపించడానికి ఇదంతా చెప్పడం లేదు. వాస్తవాలు చెప్పాను. ఆ తరువాత నీ ఇష్టం’’ అన్నారు డాక్టర్‌గారు.
అప్పటి నుంచి తెల్లటి సిగరెట్‌ను చూస్తే నల్లటి యమపాశాన్ని చూసినట్లుగా ఉండేది. ఎప్పుడూ పొరపాటున కూడా సిగరెట్ ముట్టలేదు.
- డి.అర్జున్, తాడేపల్లిగూడెం