Dialog
-
హోటల్ పుష్పక్
ఇండియన్ సినిమా చరిత్రలో ఒక ఒక గొప్ప ప్రయోగం అనిపించుకున్న ఓ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లేని ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... అతడు చాలాకాలంగా నిరుద్యోగంలోనే బతుకుతున్నాడు. ఆనంద భవన్ అనే పాతబడ్డ అపార్ట్మెంట్లో చిన్న పెంట్‌హౌస్‌లో ఉంటాడతను. తినడానికి కాదు కదా, కనీసం టీ తాగడానికి కూడా అతని దగ్గర డబ్బుల్లేవు. ‘వేకెన్సీ’ అన్న బోర్డున్న ప్రతిచోటకీ కాలినడకనే వెళ్లి వస్తున్నాడు. ఎక్కడా ఉద్యోగం దొరకడం లేదు. ఒకరోజు రాత్రివరకూ రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు. చీకట్లో రోడ్డు పక్కన, మురికి కాలువ దగ్గర ఒక మనిషి బాగా తాగి పడిపోయి కనిపించాడతనికి. ఆ మనిషి ఖరీదైన బట్టలు వేసుకొని ఉన్నాడు. స్పృహ లేదు. అతడు ఆ మనిషిని పూర్తిగా పరిశీలించి, ఆ మనిషి జేబులో ఉన్న ఓ ఫైవ్‌స్టార్ హోటల్లోని గది తాళంచెవిని తీసుకున్నాడు. తాగి పడిపోయిన ఆ వ్యక్తిని ఎత్తుకొని తీసుకెళ్లి ఆనంద భవన్‌లోని తన గదిలో కట్టిపడేశాడు. అతడు ఆ తాళంచెవిని మార్చి మార్చి చూసుకున్నాడు. ఈరోజున్న అతడి ఆర్థిక పరిస్థితికి అలాంటి ఒక హోటల్లోకి అడుగు కూడా పెట్టలేడు. అలాంటిది అదే హోటల్లో లగ్జరీ స్వీట్లో ఉండబోతున్నాడు ఇప్పుడు. పుష్పక్ హోటల్. స్వీట్ నంబర్ 3039. తాగి రోడ్డుమీద పడిపోయిన వ్యక్తి గత కొద్దికాలంగా ఇక్కడే ఉంటున్నాడు. అతడు ఆ తాళంచెవిని తీసుకొని స్వీట్‌లోకి అడుగుపెట్టాడు. ఇక్కడి వాతావరణం అంతా అతడికి కొత్తగా ఉంది. చుట్టూ తిరిగి చూశాడు. చాలారోజులుగా ఖాళీ కడుపుతో ఉన్నవాడు, ఇవ్వాళ మాత్రం కావాల్సింది తెప్పించుకొని తిన్నాడు. బాత్‌టబ్‌లో స్నానం చేశాడు. కొద్దిసేపటికి బాల్కనీకి వచ్చి పరిసరాలను గమనించాడు. బాల్కనీ నుంచి చూస్తే ఆమె కనిపించింది. చాలా రోజుల తర్వాత ఆమెను చూశాడతను. చెయ్యి ఊపాడు. కాసేపు ఇద్దరూ సైగలతోనే మాట్లాడుకున్నారు. అంతకుముందు ఆమెనతను రెండుసార్లు చూశాడుగాని ఇలా ఇద్దరూ ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఆ తర్వాత అతను తిరిగొచ్చి పడగ్గది మొత్తం వెతికితే చాలా డబ్బులు దొరికాయి. అవన్నీ ఒక దగ్గర దాచిపెట్టుకున్నాడు. కొత్త బట్టలు వేస్కొని, చాలాకాలంగా మురికిపట్టి ఒంటిమీదనే ఉన్న బట్టలను మంచం కిందకి విసిరిపారేశాడు. అతని వ్యవహారం మొత్తం మారిపోయింది. స్టయిల్ కళ్లద్దాలు పెట్టుకొని తనని తాను చూసుకొని మురిసిపోయాడు. ఆనంద భవన్‌కు వెళ్లి తాను కిడ్నాప్ చేసిన వ్యక్తిని చూసొస్తున్నాడు. ఈ హోటల్లో సకల వసతులతో సుఖంగా ఉంటున్నాడు. అతడు పరిచయం చేసుకున్న అమ్మాయి ఒక పెద్ద మెజీషియన్ కూతురు. ఆ హోటల్లో ఆయన తన ప్రదర్శనలిస్తున్నాడు. ఆ ఈవెంట్లోనే ఒక విషయంలో ఆమె అతణ్ని తప్పుగా అర్థం చేస్కొని చీ కొట్టింది. కోపంతో అతడి చెంప మీద గట్టిగా కొట్టింది. అతడు ఆ రాత్రంతా ఆమె తనను ఎందుకు కొట్టిందా అని ఆలోచిస్తూ నిద్ర కూడా పోలేదు. ఇదే సమయానికి ఆ హోటల్లో ఒక ప్రొఫెషనల్ కిల్లర్ దిగాడు. కొద్దిరోజులుగా ఇక్కడే ఉంటున్న ఓ వ్యక్తిని హత్య చేయమంటూ ఆ కిల్లర్‌కు సుపారీ అందింది. ప్రొఫెషనల్ కిల్లర్ చంపాల్సిన వ్యక్తి 3039లో ఉంటున్నాడు. ఆమె అదే రోజు, అదే ఈవెంట్లో తన తప్పు తెలుసుకుంది. అతణ్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు తనని తాను తిట్టుకుంది. అతడు ఎదురైతే ‘సారీ’ చెప్పాలని ఎదురుచూస్తోంది.3039లో ఉన్న వ్యక్తి ఎదురైతే అతణ్ని చంపాలని ప్రొఫెషనల్ కిల్లర్ ఎదురుచూస్తున్నాడు. చిన్న టీ స్టాలు నడుపుకుంటూ జీవితాన్ని మొదలుపెట్టి, పుష్పక్ అంతటి ఫైవ్‌స్టార్ హోటల్‌ను నిర్మించిన వ్యక్తి చివరిసారిగా తన హోటల్‌ను ఆసాంతం చూసుకొని కన్నుమూశాడు. ప్రొఫెషనల్ కిల్లర్‌కు అవకాశం దొరికింది, 3039 వ్యక్తిని చంపడానికి. ఆమెకూ ఒక అవకాశం దొరికింది, అతణ్ని కలిసి ‘సారీ’ చెప్పడానికి. ఆమె అతనికి ఎదురుపడి అతని చెయ్యందుకొని కళ్లతోనే సారీ చెప్పేసింది. రోజులు గడుస్తున్నాయి. ఇద్దరికీ మళ్లీ మళ్లీ కలిసే అవకాశాలు తక్కువే అయినా, ఇద్దరూ ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు. ప్రేమలో పడిపోయారు. 3039 వ్యక్తిని చంపడానికి ప్రొఫెషనల్ కిల్లర్ అన్ని ప్లాన్స్ గీసుకుంటున్నాడు. రిహార్సల్స్ చేస్తున్నాడు. మంచు కత్తిని కూడా తయారుచేసుకున్నాడు. అతడికి ఆమె మరింత దగ్గరవుతోంది. ఇద్దరూ కలిసి సినిమాలకు వెళుతున్నారు. షికార్లు తిరుగుతున్నారు. అతడామెకు ఖరీదైన బహుమతులు కొనిపెడుతున్నాడు. ఎంత ఖర్చుపెడుతున్నా అతని దగ్గర డబ్బులు మాత్రం అయిపోవడం లేదు. తాను ఆనంద భవన్లో ఉండే, టీ తాగడానికి కూడా డబ్బుల్లేని ఒక నిరుద్యోగ యువకుడినని అతడు మరచిపోయాడు. ప్రొఫెషనల్ కిల్లర్ అతణ్ని చంపడానికి అతని వెనకే చాటుగా వెంబడిస్తున్నాడు. అతడు దీన్ని పసిగట్టాడు. తననెవరో గమనిస్తున్నారని తెలుసుకొని జాగ్రత్తగా ఉంటున్నాడు. ఆ ప్రొఫెషనల్ కిల్లర్ ఎటువైపు వెళుతున్నాడో గమనించి, తనూ వెనకాలే వెళ్లి చూశాడు. అప్పుడు తెలిసింది అతనికి, 3039లో ఉంటున్న వ్యక్తిని చంపడానికి ఒక పెద్ద ప్లాన్ నడుస్తోందని. ఒంటరిగా రోడ్డు మీద నిలబడి చాలాసేపు చుట్టూ ప్రపంచాన్ని చూశాడతను. తాను ఎవరి జీవితాన్నో బతుకుతున్నాడని అర్థమయ్యాక తన మీదే తనకు అసహ్యమేసింది. ఈ డబ్బులో బతకడం అతని వల్ల కాలేదు. హోటల్లో మంచం కిందికి విసిరేసిన తన బట్టలు తీసి వేసుకున్నాడు. దాచిపెట్టుకున్న డబ్బులన్నీ యథాస్థానంలో పెట్టేశాడు. ఆనంద భవన్‌కు వెళ్లి రాత్రివరకూ ఎదురుచూసి తాను కిడ్నాప్ చేసిన మనిషిని ఎత్తుకెళ్లి ఏ రోడ్డు మీదైతే ఆ మనిషి తాగి పడిపోయి కనిపించాడో, అదే రోడ్డు మీద వదిలేశాడు. హోటల్లో తను ప్రేమించిన అమ్మాయి మేజిక్ షోలో బిజీగా ఉంది. ఆమెకు తన గురించి అంతా చెప్తూ ఒక ఉత్తరం రాసి, ఆమెకు కనిపించేలా ఓ టేబుల్ మీద పెట్టి బయటకు వచ్చాడతను. ఆ ఉత్తరం చదివి ఆమె ఎలా స్పందిస్తుందా అని ఎదురుచూస్తూ హోటల్ బయటే నిలబడ్డాడు. షో అయిపోయాక ఆమె వాళ్ల నాన్నతో కలిసి కారులో వెళుతూ అతణ్ని చూసింది. చేతిలో ఒక పువ్వు పట్టుకొని అతనికి ఇవ్వడానికి ఆమె చుట్టూ చూస్తోంది. అతణ్ని గమనించింది. కారు దిగే అవకాశం లేదు. అప్పటికప్పుడు ఓ కాగితమ్మీద తన ఇంటి అడ్రస్ రాసి ఆ పువ్వుతో పాటు కాగితాన్ని రోడ్డు మీద పడేసింది. అతను ఆ పువ్వు తీసుకున్నాడు. కాగితాన్ని అందుకునే లోపే ఆ కాగితం గాల్లో ఎగురుతూ ఎగురుతూ ఒక పెద్ద మురికికాలువలో పడి కొట్టుకుపోయింది. దూరంగా ఆమె కారులో వెళ్లిపోతూంటే అతడు నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డాడు. -
మాట తప్పితే మనిషే కాదు!
తూర్పుగోదావరి: ‘చిన్నప్పడు మా అమ్మ నాకో మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్ చేసి మాట తప్పితే you're not called a man అని. ఎప్పటికీ మాట తప్పలేదు. మరిచిపోలేదు. నా జీవితంలోనే అతిపెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజొకటి వచ్చింది. ఎంత కష్టమైనా ఆ మాటా నేను తప్పలేదు. Because, i am a man.. we are living in a Society... ప్రతి ఒక్కరికీ భయం, బాధ్యత ఉండాలి.’ ఇవీ కొత్తగా వస్తున్న ‘భరత్ అనే నేను’ చిత్రంలో హీరో మహేష్‌బాబు చెప్పిన డైలాగ్‌లు. మంగళవారం విడుదలైన ఈ టీజర్ సోషల్ మీడియా’లో వైరల్ అవుతోంది. ఇచ్చిన మాటకు కచ్చితంగా కట్టుబడి ఉండాలనే సందేశం ఇందులో ఉండడమే ఆ క్రేజ్ కి కారణం. ఇష్టానుసారంగా హామీలిచ్చేసి, తర్వాత మొహం చాటేసే నేతలకు ఈ టీజర్ ఓ కనువిప్పు అని, ఇలా హామీ ఇచ్చి మాటమార్చిన నేతలే మన ముందున్నారంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. హోదా విషయంలో కూడా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మాట మార్చారని, ఆయన తీరుపై సోషల్ మీడియాలో సైటెర్లు వెల్లువెత్తుతున్నాయి. ‘భరత్ అనే నేను’ టీజర్‌ను షేర్ చేస్తున్న నెటిజన్లు.. మాట తప్పితే మనిషే కాదన్న టీజర్‌లోని డైలాగ్‌ను ప్రధానంగా ఎక్కుపెడుతున్నారు. -
డై..లాగి కొడితే...
సినిమా : శివాజి రచయిత: శ్రీ రామకృష్ణ దర్శకత్వం: శంకర్ ఆమెరికా నుంచి ఇండియాకొచ్చిన శివాజీ (రజనీకాంత్) పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఆస్పత్రి కట్టాలనుకుంటాడు. కానీ, అందుకు అనుమతులు ఇచ్చేందుకు అధికారులందరూ లంచం డిమాండ్ చేస్తుంటారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని శివాజి వాళ్లపై పోరాటం చేస్తుంటాడు. ఆ క్రమంలో తన పలుకుబడితో రాజకీయాలనే శాసిస్తున్న ఆదిశేషుతో (సుమన్) ఎలాగైనా ఆస్పత్రి కడతానంటూ ఛాలెంజ్ చేస్తాడు. ఆదిశేషు దగ్గర రెండు వందల కోట్ల బ్లాక్ మనీ ఉందని తెలుసుకున్న శివాజి వంద కోట్లు డిమాండ్ చేస్తాడు. వంద కోట్లు తీసుకొచ్చి శివాజికి అప్పగిస్తాడు ఆదిశేషు. ఆ డబ్బు తీసుకెళుతుండగా ఆదిశేషు అనుచరులు శివాజీని అడ్డుకుని చుట్టు ముడతారు. వారిలో ఒకడు ‘పిచ్చోడిలా ఒంటరిగా వచ్చి ఇరుక్కుపోయావురా అని’ శివాజీని అంటాడు. నాన్నా.. పందులే గుంపుగా వస్తాయ్.. సింహం సింగిల్‌గా వస్తుంది అని స్టైల్‌గా, కూల్‌గా కౌంటర్ ఇస్తాడు శివాజి. ఈ డైలాగ్ అందరికీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. -
రావత్... వెండితెర రావణ్!
ఉత్తమ విలన్ కొన్ని సంఘటనలు ‘చిత్రం’గా జరుగుతాయి. సూచనప్రాయంగా కూడా చెప్పకుండా జరుగుతాయి. ‘ప్రదీప్ రావత్ ఎవరు?’ అంటే బాలీవుడ్ ప్రేక్షకులు కాస్తో కూస్తో ఆలోచించవచ్చుగానీ...మన తెలుగు వాళ్లు మాత్రం టకీమని చెబుతారు. వీలైతే అతని డైలాగును ఒకసారి ఇలా గుర్తుతెచ్చుకుంటారు. ‘ఒక్క ముక్క చెప్పి ఉండాలి. చెప్పలే. అంటే...లెక్కలే! నేనంటే లెక్కలేని వాన్ని నా లెక్కలో ఉంచడం ఇష్టం లేదు’ రాజమౌళి ‘సై’ సినిమాకు ఒక విలన్ కావాలి. ఆషామాషీ విలన్ కాదు. గట్టి విలన్ కావాలి. సినిమా విజయానికి విలనే కీలకం! అందుకే రాజమౌళి విలన్ల వేటలో ఉన్నాడు. ఎందరినో... స్క్రీన్‌టెస్ట్, అడిషన్ టెస్టులు చేస్తున్నాడు. కానీ ఎవరూ నచ్చడం లేదు. దీంతో ‘నాకో మాంచి విలన్ కావాలి’ అంటూ తన అసిస్టెంట్‌ను ముంబైకి పంపించాడు. ఆ అసిస్టెంట్ ఎక్కడెక్కడ తిరిగాడోగానీ ఆరోజు అమీర్‌ఖాన్ ‘లగాన్’ సినిమా చూద్దామని డిసైడైపోయాడు. అతను అలా డిసైడై ఉండకపోతే....ప్రదీప్ రావత్ ఎవరో మనకు తెలిసి ఉండేది కాదు. మనకు ఒక ఉత్తమ విలన్ తెర మీద పరిచయమయ్యేవాడు కాదు! ‘లగాన్’ సినిమాకు కృతజ్ఞతలు. ‘లగాన్’లో దేవా అనే సర్దార్ పాత్ర పోషించాడు రావత్. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ పట్టణంలోని యు.సి.ఒ. బ్యాంకులో కొంత కాలం పని చేసిన ప్రదీప్ రామ్‌సింగ్ రావత్ ‘మహాభారత్’ టీవీ సీరియల్లో అశ్వత్థామ పాత్రతో నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత ‘యుగ్’ టీవీ సీరియల్లో బ్రిటీష్ ఇన్స్పెక్టర్గా, ‘సర్ఫ్రోష్’ సినిమాలో ‘సుల్తాన్’గా నటించాడు. మళ్లీ ‘లగాన్’ దగ్గరకు వద్దాం. ‘లగాన్’లో దేవా దూకుడు రాజమౌళి అసిస్టెంట్‌కు బాగా నచ్చింది. ‘నేను వెదుకుతున్న విలన్ ఇతడే’ అనుకున్నాడు. రావత్‌ను సంప్రదించాడు. సౌత్ సినిమాలలో నటించడానికి విముఖంగా లేడుగానీ తనలో చిన్న సందేహం... ‘‘నాకు తెలుగు ఒక్క ముక్క కూడా రాదు. భాష రాకపోతే బొమ్మలా నటించాల్సిందే...’’ అయితే ఈ సందేహాన్ని పక్కన పెట్టి అడిషన్ టెస్ట్‌కు హాజరయ్యాడు. ఓకే అనిపించుకున్నాడు. అలా తెలుగు వెండితెరపై బిక్షు యాదవ్‌గా అలరించాడు. నోటిలో పెద్ద చుట్ట. ముక్కుకు రింగు. కాటుక కళ్లు. పే...ద్ద మీసాలు. నాలుక మడతెట్టి వార్నింగ్ ఇచ్చే మ్యానరిజం... చూసీ చూడగానే తెలుగు ప్రేక్షకలోకానికి చేరవయ్యాడు రావత్. ఆ తరువాత... ‘భద్ర’లో వీరయ్య, ‘అందరివాడు’లో సత్తి బిహారి, ‘ఛత్రపతి’లో రాస్ బిహారి, ‘దేశముదురు’లో తంబిదురై, ‘యోగి’లో నరసింహ పహిల్వాన్, ‘జగడం’లో మాణిక్యం... ఇలా ఎన్నో పేర్లతో ఉత్తమ విలన్‌గా స్థిరపడ్డాడు రావత్. ఇక ‘గజినీ’ సినిమాలో రావత్ చెడ్డ విలనిజానికి మంచి పేరు వచ్చింది. రామ్-లక్షణ్గా సౌత్‌లో, ధర్మాత్మగా నార్త్‌లో ఆయన విలనిజానికి బోలెడు ‘చెడ్డ’ పేరు వచ్చింది. ‘‘బాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా నటించకపోవడానికి కారణం ఏమిటి?’’ అనే ప్రశ్నకు- ‘‘అవకాశాలు రాకపోవడమే’’ అని చెప్పే రావత్ తనకు అవకాశం ఇచ్చిన తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో ‘ఉత్తమ విలన్’గా గట్టి పేరు సంపాదించుకున్నాడు. ‘లగాన్’లో దేవ పాత్ర ముఖేష్ రుషి చేయాల్సింది. అయితే డేట్స్ సమస్య వల్ల ఆ పాత్రను ముఖేష్ వదులుకోవాల్సి వచ్చింది. ఆ అవకాశం రావత్‌కు వచ్చింది. ‘లగాన్’లో సర్దార్జీ పాత్ర ముఖేష్ చేసి ఉంటే....రావత్ ‘లగాన్’లో నటించేవాడు కాదు. ‘లగాన్’లో నటించకపోతే...రాజమౌళి దృష్టిలో పడి ఉండేవాడు కాదు. రాజమౌళి దృష్టిలో పడి ఉండకపోతే... సౌత్‌లో స్టార్ విలన్‌గా పేరుతెచ్చుకొని ఉండేవాడు కాదు... ఎంత చిత్రం! -
అప్పడుగానీ మానలేక పోయాను!
కనువిప్పు ఎన్టీయార్ హీరోగా నటించిన ‘సాహసవంతుడు’ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ‘‘సిగరెట్ కాలుస్తున్నావా?’’ అని హీరో అడుగుతాడు. ‘‘కాదు...సిగరెట్టే నన్ను కాలుస్తోంది’’ అని అవతలి నుంచి జవాబు. ఒక దశలో నా పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఫ్రెండ్స్ దగ్గర ‘సరదాగా’ నేర్చుకున్న సిగరెటు...ఆ తరువాత ‘సీరియస్‌గా’ నన్ను కాల్చే ప్రయత్నం చేసింది. మొదట్లో రోజుకు ఒక సిగరెట్ మాత్రమే తాగేవాడిని. ఆ తరువాత మూడు....ఆ తరువాత ఆరు...ఇలా పెరుగుతూ పోయింది. ఒకసారి సిగరెట్టు తాగుతూ నాన్నకు దొరికి పోయాను. ‘‘మన ఇంట్లో ఇప్పటి వరకు ఎవరికీ పొగతాగే అలవాటు లేదు. ఎక్కడ నేర్చుకున్నావు ఈ అలవాటు?’’ అని నాన్న బాగా తిట్టారు. ‘‘ఇకపై తాగను నాన్నా’’ అని తప్పించుకున్నాను. నాన్నకు తెలియకుండా దొంగచాటుగా తాగేవాడిని. పరీక్షల టైమ్‌లో టెన్షన్ పడి సిగరెట్లు విపరీతంగా తాగేవాడిని. ఒకరోజు రాత్రి విపరీతమై దగ్గు. మరుసటి రోజు హాస్పిటల్లో చూపించారు నాన్న. నేను విపరీతంగా సిగరెట్లు తాగుతున్నాననే విషయాన్ని డాక్టర్ గారు గ్రహించారు. కౌన్సెలింగ్ మొదలు పెట్టారు. పొగ తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడి చిన్న వయసులోనే చనిపోయిన కొందరు యువకుల గురించి చెప్పారు. ‘‘నిన్ను సిగరెట్లు మానిపించడానికి ఇదంతా చెప్పడం లేదు. వాస్తవాలు చెప్పాను. ఆ తరువాత నీ ఇష్టం’’ అన్నారు డాక్టర్‌గారు. అప్పటి నుంచి తెల్లటి సిగరెట్‌ను చూస్తే నల్లటి యమపాశాన్ని చూసినట్లుగా ఉండేది. ఎప్పుడూ పొరపాటున కూడా సిగరెట్ ముట్టలేదు. - డి.అర్జున్, తాడేపల్లిగూడెం