ఇండియన్ సినిమా చరిత్రలో ఒక ఒక గొప్ప ప్రయోగం అనిపించుకున్న ఓ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లేని ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం...
అతడు చాలాకాలంగా నిరుద్యోగంలోనే బతుకుతున్నాడు. ఆనంద భవన్ అనే పాతబడ్డ అపార్ట్‌మెంట్‌లో చిన్న పెంట్‌హౌస్‌లో ఉంటాడతను. తినడానికి కాదు కదా, కనీసం టీ తాగడానికి కూడా అతని దగ్గర డబ్బుల్లేవు. ‘వేకెన్సీ’ అన్న బోర్డున్న ప్రతిచోటకీ కాలినడకనే వెళ్లి వస్తున్నాడు. ఎక్కడా ఉద్యోగం దొరకడం లేదు. ఒకరోజు రాత్రివరకూ రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు. చీకట్లో రోడ్డు పక్కన, మురికి కాలువ దగ్గర ఒక మనిషి బాగా తాగి పడిపోయి కనిపించాడతనికి. ఆ మనిషి ఖరీదైన బట్టలు వేసుకొని ఉన్నాడు. స్పృహ లేదు. అతడు ఆ మనిషిని పూర్తిగా పరిశీలించి, ఆ మనిషి జేబులో ఉన్న ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లోని గది తాళంచెవిని తీసుకున్నాడు. తాగి పడిపోయిన ఆ వ్యక్తిని ఎత్తుకొని తీసుకెళ్లి ఆనంద భవన్‌లోని తన గదిలో కట్టిపడేశాడు. అతడు ఆ తాళంచెవిని మార్చి మార్చి చూసుకున్నాడు. ఈరోజున్న అతడి ఆర్థిక పరిస్థితికి అలాంటి ఒక హోటల్లోకి అడుగు కూడా పెట్టలేడు. అలాంటిది అదే హోటల్లో లగ్జరీ స్వీట్‌లో ఉండబోతున్నాడు ఇప్పుడు.
పుష్పక్ హోటల్. స్వీట్ నంబర్ 3039. తాగి రోడ్డుమీద పడిపోయిన వ్యక్తి గత కొద్దికాలంగా ఇక్కడే ఉంటున్నాడు. అతడు ఆ తాళంచెవిని తీసుకొని స్వీట్‌లోకి అడుగుపెట్టాడు. ఇక్కడి వాతావరణం అంతా అతడికి కొత్తగా ఉంది. చుట్టూ తిరిగి చూశాడు. చాలారోజులుగా ఖాళీ కడుపుతో ఉన్నవాడు, ఇవ్వాళ మాత్రం కావాల్సింది తెప్పించుకొని తిన్నాడు. బాత్‌టబ్‌లో స్నానం చేశాడు. కొద్దిసేపటికి బాల్కనీకి వచ్చి పరిసరాలను గమనించాడు. బాల్కనీ నుంచి చూస్తే ఆమె కనిపించింది. చాలా రోజుల తర్వాత ఆమెను చూశాడతను. చెయ్యి ఊపాడు. కాసేపు ఇద్దరూ సైగలతోనే మాట్లాడుకున్నారు. అంతకుముందు ఆమెనతను రెండుసార్లు చూశాడుగాని ఇలా ఇద్దరూ ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఆ తర్వాత అతను తిరిగొచ్చి పడగ్గది మొత్తం వెతికితే చాలా డబ్బులు దొరికాయి. అవన్నీ ఒక దగ్గర దాచిపెట్టుకున్నాడు. కొత్త బట్టలు వేస్కొని, చాలాకాలంగా మురికిపట్టి ఒంటిమీదనే ఉన్న బట్టలను మంచం కిందకి విసిరిపారేశాడు. అతని వ్యవహారం మొత్తం మారిపోయింది. స్టయిల్ కళ్లద్దాలు పెట్టుకొని తనని తాను చూసుకొని మురిసిపోయాడు. ఆనంద భవన్‌కు వెళ్లి తాను కిడ్నాప్ చేసిన వ్యక్తిని చూసొస్తున్నాడు. ఈ హోటల్లో సకల వసతులతో సుఖంగా ఉంటున్నాడు. అతడు పరిచయం చేసుకున్న అమ్మాయి ఒక పెద్ద మెజీషియన్ కూతురు. ఆ హోటల్లో ఆయన తన ప్రదర్శనలిస్తున్నాడు. ఆ ఈవెంట్‌లోనే ఒక విషయంలో ఆమె అతణ్ని తప్పుగా అర్థం చేస్కొని చీ కొట్టింది. కోపంతో అతడి చెంప మీద గట్టిగా కొట్టింది.
అతడు ఆ రాత్రంతా ఆమె తనను ఎందుకు కొట్టిందా అని ఆలోచిస్తూ నిద్ర కూడా పోలేదు. ఇదే సమయానికి ఆ హోటల్లో ఒక ప్రొఫెషనల్ కిల్లర్ దిగాడు. కొద్దిరోజులుగా ఇక్కడే ఉంటున్న ఓ వ్యక్తిని హత్య చేయమంటూ ఆ కిల్లర్‌కు సుపారీ అందింది. ప్రొఫెషనల్ కిల్లర్ చంపాల్సిన వ్యక్తి 3039లో ఉంటున్నాడు. ఆమె అదే రోజు, అదే ఈవెంట్‌లో తన తప్పు తెలుసుకుంది. అతణ్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు తనని తాను తిట్టుకుంది. అతడు ఎదురైతే ‘సారీ’ చెప్పాలని ఎదురుచూస్తోంది.3039లో ఉన్న వ్యక్తి ఎదురైతే అతణ్ని చంపాలని ప్రొఫెషనల్ కిల్లర్ ఎదురుచూస్తున్నాడు. చిన్న టీ స్టాలు నడుపుకుంటూ జీవితాన్ని మొదలుపెట్టి, పుష్పక్ అంతటి ఫైవ్‌స్టార్ హోటల్‌ను నిర్మించిన వ్యక్తి చివరిసారిగా తన హోటల్‌ను ఆసాంతం చూసుకొని కన్నుమూశాడు. ప్రొఫెషనల్ కిల్లర్‌కు అవకాశం దొరికింది, 3039 వ్యక్తిని చంపడానికి. ఆమెకూ ఒక అవకాశం దొరికింది, అతణ్ని కలిసి ‘సారీ’ చెప్పడానికి. ఆమె అతనికి ఎదురుపడి అతని చెయ్యందుకొని కళ్లతోనే సారీ చెప్పేసింది. రోజులు గడుస్తున్నాయి. ఇద్దరికీ మళ్లీ మళ్లీ కలిసే అవకాశాలు తక్కువే అయినా, ఇద్దరూ ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు. ప్రేమలో పడిపోయారు.
3039 వ్యక్తిని చంపడానికి ప్రొఫెషనల్ కిల్లర్ అన్ని ప్లాన్స్ గీసుకుంటున్నాడు. రిహార్సల్స్ చేస్తున్నాడు. మంచు కత్తిని కూడా తయారుచేసుకున్నాడు. అతడికి ఆమె మరింత దగ్గరవుతోంది. ఇద్దరూ కలిసి సినిమాలకు వెళుతున్నారు. షికార్లు తిరుగుతున్నారు. అతడామెకు ఖరీదైన బహుమతులు కొనిపెడుతున్నాడు. ఎంత ఖర్చుపెడుతున్నా అతని దగ్గర డబ్బులు మాత్రం అయిపోవడం లేదు. తాను ఆనంద భవన్‌లో ఉండే, టీ తాగడానికి కూడా డబ్బుల్లేని ఒక నిరుద్యోగ యువకుడినని అతడు మరచిపోయాడు. ప్రొఫెషనల్ కిల్లర్ అతణ్ని చంపడానికి అతని వెనకే చాటుగా వెంబడిస్తున్నాడు. అతడు దీన్ని పసిగట్టాడు. తననెవరో గమనిస్తున్నారని తెలుసుకొని జాగ్రత్తగా ఉంటున్నాడు. ఆ ప్రొఫెషనల్ కిల్లర్ ఎటువైపు వెళుతున్నాడో గమనించి, తనూ వెనకాలే వెళ్లి చూశాడు. అప్పుడు తెలిసింది అతనికి, 3039లో ఉంటున్న వ్యక్తిని చంపడానికి ఒక పెద్ద ప్లాన్ నడుస్తోందని. ఒంటరిగా రోడ్డు మీద నిలబడి చాలాసేపు చుట్టూ ప్రపంచాన్ని చూశాడతను. తాను ఎవరి జీవితాన్నో బతుకుతున్నాడని అర్థమయ్యాక తన మీదే తనకు అసహ్యమేసింది. ఈ డబ్బులో బతకడం అతని వల్ల కాలేదు. హోటల్‌లో మంచం కిందికి విసిరేసిన తన బట్టలు తీసి వేసుకున్నాడు. దాచిపెట్టుకున్న డబ్బులన్నీ యథాస్థానంలో పెట్టేశాడు. ఆనంద భవన్‌కు వెళ్లి రాత్రివరకూ ఎదురుచూసి తాను కిడ్నాప్ చేసిన మనిషిని ఎత్తుకెళ్లి ఏ రోడ్డు మీదైతే ఆ మనిషి తాగి పడిపోయి కనిపించాడో, అదే రోడ్డు మీద వదిలేశాడు. హోటల్లో తను ప్రేమించిన అమ్మాయి మేజిక్ షోలో బిజీగా ఉంది. ఆమెకు తన గురించి అంతా చెప్తూ ఒక ఉత్తరం రాసి, ఆమెకు కనిపించేలా ఓ టేబుల్ మీద పెట్టి బయటకు వచ్చాడతను. ఆ ఉత్తరం చదివి ఆమె ఎలా స్పందిస్తుందా అని ఎదురుచూస్తూ హోటల్ బయటే నిలబడ్డాడు.
షో అయిపోయాక ఆమె వాళ్ల నాన్నతో కలిసి కారులో వెళుతూ అతణ్ని చూసింది. చేతిలో ఒక పువ్వు పట్టుకొని అతనికి ఇవ్వడానికి ఆమె చుట్టూ చూస్తోంది. అతణ్ని గమనించింది. కారు దిగే అవకాశం లేదు. అప్పటికప్పుడు ఓ కాగితమ్మీద తన ఇంటి అడ్రస్ రాసి ఆ పువ్వుతో పాటు కాగితాన్ని రోడ్డు మీద పడేసింది. అతను ఆ పువ్వు తీసుకున్నాడు. కాగితాన్ని అందుకునే లోపే ఆ కాగితం గాల్లో ఎగురుతూ ఎగురుతూ ఒక పెద్ద మురికికాలువలో పడి కొట్టుకుపోయింది. దూరంగా ఆమె కారులో వెళ్లిపోతూంటే అతడు నిస్సహాయంగా చూస్తూ నిలబడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment