మూడు తరాలుగా తిరుగులేని టైటిల్
రంగురంగుల సినీ ప్రపంచం టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ ఎక్కడైనా వింతలూ విశేషాలకు కొదవే వుండదు. సినిమాల టైటిల్స్ కొన్నింటికి కాలంతో పని ఉండదు. ఎప్పుడైనా చలామణి అవుతాయి. ఒకే సినిమా టైటిల్ మూడు తరాలుగా పరిశ్రమలో ప్రయాణం చేస్తోంది. అప్పటికి ఇప్పటికీ ఆ టైటిల్కు అంతటి పవర్ ఉంది. అదే 'చిక్కడు దొరకడు'. 1967లో జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో నిర్మించిన 'చిక్కడు దొరకడు'లో ఎన్టీఆర్ ద్విపాత్రభినయం చేశారు. ఇందులో ఎన్టీఆర్ -జయలలిత జంటగా నటించారు. ఆ తరువాత వీరిద్దరూ ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ తర్వాత 1988లో హాస్య బ్రహ్మ రేలంగి నరసింహారావు దర్శకత్వంలో రూపొందించిన 'చిక్కడు దొరకడు'లో రాజేంద్రప్రసాద్- రజని జంటగా నటించారు.
అదే 'చిక్కడు దొరకడు' పేరుతో ఇప్పుడు నిర్మిస్తున్న చిత్రంలో లవర్ బాయ్ సిద్దార్ద్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మధ్య సరైన విజయాల్లేక డీలాపడిన సిద్ధార్ధ్ తెలుగు-తమిళ భాషల్లో నిర్మించిన ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న 'జిగర్తండా' అనే సినిమాను తెలుగులో చిక్కడు దొరకడుగా రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమాలో సిద్దార్ద్ దర్శకుడి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. సినిమా దర్శకుడు అవ్వడం కోసం మదురై వెళ్లిన సిద్ధార్థ్‌కు అక్కడ ఇడ్లీలు అమ్ముకునే అమ్మాయి లక్ష్మీ మీనన్ పరిచయం అవుతుంది. ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మన సిద్ధార్ధ అసలు వచ్చిన విషయం మరచిపోయి హీరోయిజం చూపిస్తాడు. ఇదే ప్రధాన కథ. ప్రేమ - యాక్షన్ - డ్రామా సమ్మిళితంగా వస్తున్న ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని దర్శకుడు కార్తీక్ సుబ్బురాజ్ చెబుతున్నారు.
- శిసూర్య