గురు బ్రహ్మ.. గురు విష్ణు.. అని శ్లోకం ఉంది నిజమేగానీ సినిమా వాళ్లు దానికి కాస్త ఎక్స్‌టెన్షన్ కొట్టి లెంగ్త్ పెంచి గురు హీరో గురు హీరోయిన్ గురు క్యారెక్టర్ ఆర్టిస్ట్ నమః అని కూడా అనుకున్నారు. స్కూళ్లు, కాలేజీలు లేని సమాజం ఎలా లేదో టీచర్ల, లెక్చరర్ల పాత్రలు లేని సినిమాలు కూడా లేవు. ఆ మిస్సమ్మల, పంతులమ్మల, మాస్టారుల రీ విజిట్.. నేడు టీచర్స్ డే సందర్భంగా.
‘మిస్సమ్మ’లో సావిత్రి కేవలం స్కూల్లో పిల్లలకే టీచర్ కాదు. ఆ సినిమాలోని ప్రతి పాత్రకూ టీచరే. కొంచెం నాన్ సీరియస్‌గా ఉన్న ఎన్.టి.ఆర్‌కు లక్ష్యం ఏర్పరిచిన ఆమే టీచర్. దొంగ బిచ్చగాడు రేలంగిని ఆ దారి వదిలించిన ఆమే టీచర్. తెలిసీ తెలియని వయసులో ఉన్న జమునకు మంచి చెడు తెలియజేసిన ఆమే టీచర్. కంత్రీ విలన్ రమణా రెడ్డికి బడితె పూజ చేయడం తెలిసిన ఆమే టీచర్. ‘మిస్సమ్మ’లో సావిత్రిని చూసి చిన్నపిల్లల్లా ప్రతి ఒక్కరూ భయపడేవారే. ఆఖరుకు ఎస్.వి. రంగారావు, బుష్యేంద్రమణిలతో సహా. సినిమాల్లో టీచర్ పాత్రకు గట్టిగా ఫౌండేషన్ వేసిన పాత్ర అది.
కానీ ఆశ్చర్యంగా ‘బడి పంతులు’లో ఎన్.టి.ఆర్ పాత్ర అమిత మెత్తన. నెమ్మది, కరుణ, దయ తప్ప ఆ పాత్రకు ఏమీ తెలియదు. పిల్లలు దేవుళ్లు కాబట్టి ఆ పాత్రలోని దైవత్వాన్ని గ్రహించి ఆదరించారు. కానీ కడుపున పుట్టిన సంతానం అవమానం చేసి వేదన మిగిల్చింది. ఆ పంతులును బడి ఎక్కించి నిలబెట్టింది. అయితే మంచితనమే చివరికి గెలుస్తుంది. శిష్యుడు ఫెయిల్ కావచ్చు గాని విలువలకు నిలబడ్డ గురువు ఓడిపోయినట్టు చరిత్రలో లేదు.
అయితే ఇంట్లో తల్లిదండ్రుల మాట వినని మొండి ఘటాలు కూడా స్కూల్లో ఒక మాస్టారు ముందు మోళీ వేసినట్టుగా తలాడిస్తారనడానికి తార్కాణంగా ‘కోడె నాగు’ సినిమా వచ్చింది. ఆ సినిమాలో పరమ మొండి ఘటమైన శోభన్ బాబు తన టీచర్ అయిన ఆత్రేయ మాట మాత్రమే వింటాడు. కానీ ఈ శిష్యుడి సంస్కరణలో ఆ గురువు ప్రాణ త్యాగం చేస్తాడు. ఆ గురువుకు నివాళిగా శిష్యుడూ ఆత్మార్పణం చేస్తాడు. గుండెలు పిండే ఈ కథ గురుశిష్యుల అనుబంధాన్ని అజరామరం చేసింది. ‘స్కూలు’, ‘కాన్వెంటు’ అనే మాటలు వాడుకలో పెరుగుతున్న వేళ ఆడవాళ్లు టీచింగ్ ప్రొఫెషన్‌లోకి ఎక్కువగా వస్తున్న వేళ ‘పంతులమ్మ’ అనే సినిమా రావడం విడ్డూరం కాదు.
భార్య చనిపోగా, చిన్న పిల్లాడితో అవస్థలు పడుతున్న రంగనాథ్ దగ్గర పంతులమ్మ ఉద్యోగానికి వచ్చిన లక్ష్మి ఆ పిల్లాడికి తల్లిలా మారి గాడి తప్పిన ఆ ఇంటికి ఇల్లాలిగా కూడా మారే ఆ కథ పెద్ద హిట్ అయ్యింది. అయితే ‘పూజ’లో మేనమామ కూతురైన కన్నడ మంజులను పెళ్లి చేసుకుందామనుకున్న లెక్చరర్ రామకృష్ణ ఇష్టం లేని వాణిశ్రీని చేసుకుని ఆమెను భార్యగా స్వీకరించలేక క్షోభ పడటం, చివరకు ఆ జంట ఏకం కావడం ఆ వృత్తిలో ఉండేవారికి ఎదురయ్యే ‘పరీక్షాకాలం’గా జనం చూశారు. ఇదే సమయంలో వచ్చిన మరో ముఖ్యమైన సినిమా ‘బలిపీఠం’. ఇందులో కులమతాల వివక్ష దూరం కావాలని భావించే స్కూల్ టీచర్ శోభన్‌బాబు తనకంటే పైకులం స్త్రీ శారదను వివాహం ఆడి సంఘంలో ఎంతటి హెచ్చుతగ్గుల వ్యవస్థ ఉన్నదో తెలుసుకుంటాడు. యూనిఫామ్ వేసి పిల్లలందరినీ సమానం చేసే క్లాస్‌రూమ్ ఇంట్లో.. బజారులో ఎంత అసమానంగా ఉంటుందో ఈ సినిమాలో తెలుస్తుంది.
అటు పిమ్మట వచ్చిన ‘విశ్వరూపం’ విద్యార్థి శక్తి తలుచుకుంటే సంఘ నిర్మాణం, దేశ నిర్మాణంలో ఎంత చురుకైన పాత్ర పోషించగలదో చూపించింది. అయితే అందుకు వారిని ఉత్తేజపరచగల గురువు అవసరం. అలాంటి గురువుగా ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో గొప్పగా కనిపిస్తారు. కానీ అన్ని సినిమాల్లోనూ ఎన్.టి.ఆర్‌లు ఉండరు. కొన్నింటిలో చంద్రమోహన్‌లు ఉంటారు. ‘మూడుముళ్లు’ సినిమాలో చంటిబిడ్డతో పల్లెటూళ్లో పాఠాలు చెప్పడానికి వచ్చిన టీచర్ చంద్రమోహన్ అదే ఊళ్లో ఆకతాయిగా తిరుగుతున్న రాధిక మనసు దోచుకుంటాడు.
చంద్రమోహన్ సంస్కారాన్ని చూసిన రాధిక ఎలాగైనా సరే అతణ్ణి పెళ్లి చేసుకొని అతని బిడ్డకు తల్లిలా మారాలనుకుంటుంది. ఆమెను అనేకసార్లు ఫెయిల్ చేసిన చంద్రమోహన్ చివరకు పాస్ చేసి అక్కున చేర్చుకుంటాడు. టి.కృష్ణ వచ్చాక సినిమాల్లో బాధ్యతతో ఉండాల్సిన టీచర్ల పాత్రలు ఎక్కువగా చూపించారు. ‘వందేమాతరం’లో స్కూల్ టీచర్‌గా రాజశేఖర్, ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ సినిమాల్లో టీచర్‌గా, లెక్చరర్‌గా విజయశాంతి ప్రేక్షకులను క్లాస్‌రూమ్‌లో కూర్చోబెట్టారు. ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో’... ప్రతి ప్రేక్షకుడు బాధ్యత ఉన్న టీచర్‌గా సంస్కరణకు దిగకపోతే భవిష్యత్తు అంధకార బంధురం అని చెప్పారు.
‘శుభలేఖ’లో సుమలత లెక్చరర్. సంతలో పశువును అమ్మినట్టు వరుణ్ణి అతడి తల్లిదండ్రులు అమ్మే వరకట్న దురాచారాన్ని నిర్మూలించడానికి ఆమె గళం ఎత్తుతుంది. కైకాల సత్యనారాయణను ఎదిరిస్తుంది. ఫలితంగా ఉద్యోగం పోగొట్టుకుంటుంది. అయితే ఏం... ఆఖరుకు చిరంజీవిలాంటి ఉత్తముణ్ణి భర్తగా పొందుతుంది. ఈ సినిమాలో కె.విశ్వనాథ్ మూడు విషయాలు చెప్పారు. స్త్రీలు బాగా చదువుకోవాలి. ఉద్యోగం చేయాలి. అమ్మకానికి అబ్బాయిని తెచ్చుకోకుండా ఆత్మగౌరవంతో పెళ్లి బంధంలోకి వెళ్లాలి. లెక్చరర్ పాత్రలు మాస్ హీరోలను కూడా ఆకట్టుకున్నాయి.
అందుకే వెంకటేశ్ ‘సుందరకాండ’, చిరంజీవి ‘మాస్టర్’, బాలకృష్ణ ‘సింçహా’ చేశారు. స్టూడెంట్స్‌ను ‘యాంటీ కరెప్షన్ ఫోర్స్’గా మార్చి, అవినీతి అధికారులకు ఏకంగా మరణశిక్ష విధిస్తూ సంచలనం సృష్టించింది కేవలం ఒక ప్రొఫెసర్ అంటే అది ఆ వృత్తి గొప్పతనం అనుకోవాలి. ‘ఠాగూర్’ సినిమాలో చిరంజీవి ఈ పని చేస్తారు. అయితే ఉపాధ్యాయుడంటే విద్యార్థి బాగు మాత్రమే కోరేవాడు కాదు ఊరు బాగు కూడా కోరేవాడు అని రాజేంద్రప్రసాద్ ‘ఓనమాలు’ చెప్పింది. ఇందులో టీచరైన రాజేంద్రప్రసాద్ సొంత ఊరు వదిలిపెట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఊరికి రావాలని మాతృభూమికి సేవ చేయాలని పిలుపు ఇస్తారు. మార్గదర్శి లేని ఊరు దివిటీ లేని చీకటి దారి అని సందేశం ఇస్తారు.
కొత్తతరం హీరోలు కూడా లెక్చరర్లుగా, ట్యూటర్‌లుగా కనపడటానికి వెనకాడటం లేదు. ‘గీత గోవిందం’లో విజయ్ దేవరకొండ ఒక మంచి లెక్చరర్‌గా కనపడతాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి అబ్దుల్ కలామ్ నుంచి స్ఫూర్తి పొందేవారు ఎందరో ఉంటారు. వారు చెప్పిన మంచే ఒక హీరోనో హీరోయినో చెప్తే వెంటనే తాకే యువతరం శాతం ఎక్కువగా ఉంటుంది. స్టూడియోనే క్లాస్‌రూమ్‌గా కెమెరానే బ్లాక్‌బోర్డుగా సాగే ఈ స్ఫూర్తివంతమైన పాఠాలు కొనసాగాలని కోరుకుందాం.
– కె.
‘మిస్సమ్మ’లో సావిత్రి
‘బడిపంతులు’లో ఎన్టీఆర్, అంజలి
‘సుందరకాండ’లో వెంకటేశ్, ‘ఓనమాలు’లో రాజేంద్రప్రసాద్, ‘విశ్వరూపం’లో ఎన్టీఆర్
విజయశాంతి
శ్రీవిద్య, శోభన్‌బాబు
‘మూడు ముళ్లు’లో రాధిక, చంద్రమోహన్
∙చంద్రమోహన్, విజయశాంతి, చరణ్‌రాజ్
‘ఠాగూర్’లో చిరంజీవి, ‘గీత గోవిందం’లో విజయ్ దేవరకొండ
Comments
Please login to add a commentAdd a comment