shobhan babu
-
హీరోగా మాత్రమే చేస్తానంటూ.. ఆ హిట్ పాత్రలను రిజెక్ట్ చేసిన శోభన్ బాబు
ఒక్కో హీరో కెరీర్లో ఒక్కో సినిమా ఉంటుంది... కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా. జనం మనసు దోచి, బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన సినిమా. కాలం మారినా... మరపురాని సినిమా. ఆంధ్రుల అందాల నటుడిగా, ఇద్దరు హీరోయిన్ల ముద్దుల ప్రియుడిగా చరిత్ర సష్టించిన హీరో శోభన్ బాబు కెరీర్లో అలాంటి ఓ స్పెషల్ సినిమా 'సోగ్గాడు'. అది ఎంత స్పెషల్ అంటే, 'వెండితెర సోగ్గాడు' అంటే శోభన్ బాబే అనేటంతగా స్పెషల్. ఈ సినిమా ఆయనకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. అలా ఎన్నో వైవిధ్య చిత్రాల్లో నటించిన దివంగత నటుడు శోభన్ బాబు. ఒకానొక సమయంలో తన దగ్గరికి వచ్చిన కథల్ని కూడా ఆయన తిరస్కరించారని మీకు తెలుసా..? అందుకు కారణం కూడా ఆయన గతంలో ఇలా చెప్పారు. 'అభిమానులు, ప్రేక్షకులు నన్ను హీరోగా మాత్రమే చూశారు.. అదే స్థాయిలో వారి గుండెల్లో నన్ను పెట్టుకున్నారు. నా కెరీర్ మొత్తం హీరోగానే ముగిసిపోవాలి. మరో పాత్రలో నటించాలని లేదు.' అన్నారు. దీంతో ఆయన సహాయ, కీలక పాత్రల్లో నటించేందుకు ముందుకు రాలేదు. కానీ ఆయన తిరస్కరించిన పాత్రలు ఏవో ఒకసారి చూద్దాం. మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో 2005లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'అతడు'. ఈ సినిమాలోని సత్యనారాయణ మూర్తి (నాజర్) పాత్ర ముందుగా శోభన్ బాబు దగ్గరకే వెళ్లింది. ఈ పాత్ర మీరే చేయాలంటూ నిర్మాత మురళీ మోహన్ కోరారు. అందుకు రెమ్యునరేషన్‌గా బ్లాంక్ చెక్‌నే ఇచ్చారు మురళీ మోహన్.. కానీ శోభన్ బాబు నో చెప్పడం విశేషం. పవన్ కల్యాణ్ 'సుస్వాగతం' సినిమాలో రఘువరన్ పోషించిన పాత్ర మొదట శోభన్ బాబు దగ్గరికి వెళ్లింది. అందుకు భీమినేని శ్రీనివాసరావు సంప్రదించగా అప్పుడు కూడా శోభన్‌బాబు నో చెప్పారు. తెలుగు సినిమా చరిత్రంలో అన్నమయ్య చిరస్థాయిలో ఉంటుంది. నాగార్జున ప్రధాన పాత్రలో రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రం 1997లో విడుదల అయింది. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషనల్ హిట్‌ను అందుకుంది. ఇందులో శ్రీ వేంకటేశ్వరస్వామి పాత్రను పోషించమని చిత్ర యూనిట్ కోరగా అప్పుడు కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారు. అలా ఫైనల్‌గా ఆ పాత్ర సుమన్ వద్దకు వెళ్లింది. అందులో ఆయన కూడా ఒదిగిపోయాడు. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ నటించిన 'బ్లాక్' తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు ఆర్.బి. చౌదరి. అందులో శోభన్ బాబు అయితే బాగా సెట్ అవుతారని ఆయన కోరారు. అందకు కూడా నో చెప్పారు శోభన్ బాబు. అలా ఎన్నో హిట్ కొట్టిన సినిమాలు ఆయన వద్దకు వచ్చాయి. కానీ వాటిని తిరస్కరించిన శోభన్ బాబు ఎట్టకేలకు ఓ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోడి రామకృష్ణ దర్శకుడిగా నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ రూపొందించాలనుకున్న మల్టీస్టారర్ చిత్రాన్ని ఆయన ఓకే చేశారు. అందులో శోభన్ బాబు,కృష్ణ, జగపతి బాబు కలిసి నటించాలనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. -
స్టైలిష్ లుక్‌లో ఒకప్పటి టాలీవుడ్ హీరో.. గుర్తుపట్టండి చూద్దాం?
టాలీవుడ్లో చాలామంది హీరోలున్నారు. వాళ్లలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అయితే అందగాడు అనే మాట వస్తే మాత్రం దాదాపు ప్రతిఒక్కరూ చెప్పేమాట ఒక్కరి పేరు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ.. సినిమాల రూపంలో ఆయన సజీవంగా ఉండిపోయారు. ప్రస్తుతం ఏఐ ట్రెండ్ నేపథ్యంలో ఆయన వీడియో ఒకటి వైరల్ అయిపోయింది. మరి ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) పైన ఫొటోలో, దిగువన వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు శోభన్ బాబు. అవును తెలుగు సినిమాల్లో అందగాడు అనగానే గుర్తొచ్చేది ఈయనే. 1959లో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఈయన 1996 వరకు దాదాపు 230కి పైగా సినిమాల్లో హీరోగా, నటుడిగా చాలా అంటే చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. సోగ్గాడు, దేవత లాంటి సినిమాలతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయారు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో సరికొత్త వీడియోలు, ఫొటోలు రీక్రియేట్ చేస్తున్నారు. అలా కొందరు శోభన్ బాబుని ఈ సాంకేతిక ఉపయోగించి పలు వీడియోలు క్రియేట్ చేశారు. బీచ్ ఒడ్డున సిక్స్ ప్యాక్‌తో నడిచొస్తున్న వీడియోని తాజాగా ఆర్జీవీ ట్వీట్ చేయగా ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. మరో వీడియోలో సూట్ వేసుకున్న లుక్ అయితే కేక పుట్టిస్తోంది. (ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి) Artificial intelligence created Sobhan Babu https://t.co/HLkSS9va24 — Ram Gopal Varma (@RGVzoomin) January 10, 2024 -
శోభన్ బాబు తో చాలా చనువుగా ఉండేదాన్ని..!
-
ఒక శకం ముగిసింది
-
వెండితెర సోగ్గాడు @45 ఇయర్స్
ఒక్కో హీరో కెరీర్లో ఒక్కో సినిమా ఉంటుంది... కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా. జనం మనసు దోచి, బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన సినిమా. కాలం మారినా... మరపురాని సినిమా. ఆంధ్రుల అందాల నటుడిగా, ఇద్దరు హీరోయిన్ల ముద్దుల ప్రియుడిగా చరిత్ర సష్టించిన హీరో శోభన్ బాబు కెరీర్లో అలాంటి ఓ స్పెషల్ సినిమా ‘సోగ్గాడు’. అది ఎంత స్పెషల్ అంటే, ‘వెండితెర సోగ్గాడు’ అంటే శోభన్ బాబే అనేటంతగా స్పెషల్. సరిగ్గా 45 ఏళ్ళ క్రితం 1975 డిసెంబర్ 19న రిలీజైన ‘సోగ్గాడు’ చిత్రంలోని ఉర్రూతలూపిన పాటలు, బాక్సాఫీస్‌ను ఊపేసిన వసూళ్ళు ఇవాళ్టికీ ఓ చెరిగిపోని చరిత్రే! గ్రామీణ నేపథ్యంలోని ఓ కథ గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని కేంద్రాలలో విజయఢంకా మోగించడం విశేషమే. శోభన్ బాబు హీరోగా, సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు అందించిన అలాంటి బాక్సాఫీస్ విశేషం ‘సోగ్గాడు’. ఊరంతా సోగ్గాడుగా పిలిచే శోభనాద్రి (శోభన్ బాబు), అతని మరదలు (జయసుధ), అనుకోకుండా నగరంలోని హోటల్ రూమ్‌లో అతను పెళ్ళాడిన అమ్మాయి (జయచిత్ర) మధ్య నడిచే కథ ఇది. కృష్ణాజిల్లా కోలవెన్ను, ఈడ్పుగల్లు, అలాగే రామానాయుడు తన స్వగ్రామం కారంచేడులో తొలిసారిగా షూటింగ్ చేసిన ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషనల్ హిట్. నిజజీవితంలోని తన బాబాయిని అనుకరిస్తూ, కోరమీసం, పంచెకట్టుతో, ఎడ్లబండి నడుపుతూ, ‘తస్సాదియ్యా’ అనే ఊతపదంతో ఆ రోజుల్లో శోభన్ బాబు చేసిన నటన, జయసుధ, జయచిత్రల గ్లామర్ అండగా ఆబాలగోపాలాన్ని అలరించిన సినిమా ఇది. స్టార్ డమ్ తెచ్చిన సూపర్ హిట్: శోభన్ బాబు కబడ్డీ ఆటగాడుగా కనిపించే ఈ చిత్రం అప్పట్లో ఎదురులేని ప్రజాదరణతో అఖండ విజయం సాధించింది. ‘సోగ్గాడు’ రిలీజవడానికి సరిగ్గా వారం ముందు... 1975 డిసెంబర్ 12న ఇదే చిత్ర దర్శకుడు కె. బాపయ్య డైరెక్షన్లోనే పెద్ద ఎన్టీఆర్ నటించిన ‘ఎదురులేని మనిషి’ వచ్చింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత అశ్వినీదత్‌కు అదే తొలి సినిమా. ఎన్టీఆర్‌ను ఓ కొత్త పంథాలో చూపించిన ఆ సినిమా ఓ పక్కన ఆడుతుండగానే, సీనియర్ టాప్ హీరోతో పోటాపోటీగా శోభన్ బాబును నిలిపింది ‘సోగ్గాడు’. థియేటర్లలో విజయఢంకా మోగించిన ఈ చిత్రం విడుదలైన అనేక కేంద్రాలలో విజయ విహారం చేస్తూ, వసూళ్ళలో నూతన అధ్యాయం çసృష్టించింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నెలకొల్పింది. విడుదలైన 31 కేంద్రాలలో 50 రోజుల పండగ జరుపుకొంది. 19 కేంద్రాలలో వందల రోజుల పైగా ఆడింది. శోభన్ బాబు కెరీర్లో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రం ఇదే. వెరసి... సరికొత్త స్టార్ హీరోగా శోభన్ బాబు అవతరించడానికి తోడ్పడింది. తమిళ స్టార్ శివాజీగణేశన్ ముఖ్య అతిథిగా చిత్రయూనిట్ అంతా పాల్గొనగా, విజయవాడలో వందరోజుల వేడుక జరుపుకొన్న ఈ చిత్రం బాపయ్యను కూడా దర్శకుడిగా మరో మెట్టు పైన పెట్టింది. దర్శకులు బాపయ్య, కె. రాఘవేంద్రరావు కజిన్స్. గమ్మత్తేమిటంటే, ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజమండ్రిలో బాపయ్య మరో యూనిట్‌తో బిజీగా ఉండడంతో, రాఘవేంద్రరావు స్వయంగా హైదరాబాద్‌లో కొన్ని షాట్లు, ఇండోర్ సీన్లు తీసిపెట్టారు. కెరీర్ బెస్ట్ ఇయర్: నిజానికి, శోభన్ బాబు కెరీర్లోనే ఓ మరపురాని సంవత్సరం – 1975. ఆ ఏడాది శోభన్ బాబు సినిమాలు ఏకంగా 8 రిలీజయ్యాయి (‘దేవుడు చేసిన పెళ్ళి, అందరూ మంచివారే, బాబు, జీవనజ్యోతి, బలిపీఠం, జేబుదొంగ, గుణవంతుడు, సోగ్గాడు’). వాటిలో 5 సూపర్ హిట్లు. అలా ఆ ఏడాది శోభన్ బాబుకు బాగా కలిసొచ్చింది. ఆయన స్టార్ అయిపోయారు. ఒకే ఏడాది ‘జీవన జ్యోతి, సోగ్గాడు’– ఈ రెండు సూపర్ హిట్లతో శోభన్‌బాబు ఇమేజ్ తార స్థాయికి చేరింది. ఈ సినిమాతోనే నటి జయచిత్ర తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమయ్యారు. అప్పటికి వర్ధమాన నటి అయిన జయసుధ హీరో మరదలిగా సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. తమిళ రచయిత బాలమురుగన్ అందించిన కథకు మోదుకూరి జాన్సన్ మాటలు, కె.వి. మహదేవన్ సంగీతంలో ఆచార్య ఆత్రేయ పాటలు ఆకట్టుకున్నాయి. గమ్మత్తేమిటంటే, నిజానికి ఈ చిత్రాన్ని నాగిరెడ్డి వారసుల విజయ కంబైన్స్, రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా సమర్పించినట్టు సినిమా టైటిల్ కార్డుల్లో ఉన్నా, పోస్టర్లు, పబ్లిసిటీలో మాత్రం విజయా కంబైన్స్ పేరు కనిపించదు. ఈ తెలుగు సూపర్ హిట్‌ను ఆ తరువాత హిందీలో జితేంద్ర, రేఖ జంటగా ‘దిల్ దార్’ పేరిట రీమేక్ చేశారు. అందరూ కోరిన అందాల నటుడు: ఆ రోజుల్లో ఎక్కడ విన్నా... మహదేవన్ బాణీల్లోని ‘సోగ్గాడు’ పాటలే. ‘సోగ్గాడు లేచాడు చూసి చూసి నీ దుమ్ము దులుపుతాడు...’ పాట వస్తూ ఉంటే, మాస్లో ఓ హిస్టీరియా. ఫ్యాన్స్ అయితే, తమ అభిమాన హీరో బాక్సాఫీస్ వద్ద జూలు విదిలించి, రికార్డుల దుమ్ము దులుపుతున్నాడని కేరింతలు కొట్టారు. ఈ సినిమాలోని ‘ఏడుకొండలవాడా వెంకటేశా.. ఓరయ్యో ఎంతపని చేశావు తిరుమలేశా’ అనే పాట రేడియోలో కొన్నేళ్ళు ఓ అభిమాన జనరంజక గీతం. అలాగే, ‘అవ్వా బువ్వా కావాలంటే అయ్యేదేనా అబ్బాయి’ పాట. ‘చలివేస్తోంది... చంపేస్తోంది...’ పాట కుర్రకారు మదిలో గిలిగింతలు పెట్టింది. ‘సోగ్గాడు’తో పతాక స్థాయికి చేరిన ఇమేజ్‌తో... పెళ్ళి కావాల్సిన అమ్మాయిలకు ఇలాంటి అబ్బాయి కావాలనే కోరిక పుట్టింది. కన్నవాళ్ళకు అలాంటి కొడుకు కావాలనే ప్రేమ వచ్చింది. తోడబుట్టినవాడు శోభన్ బాబు లాంటి తమ్ముడైతే బాగుండనే అభిమానం వెల్లువెత్తింది. ఆ తరువాత దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇద్దరు ప్రేయసుల మధ్య నలిగే అందాల నటుడిగా శోభన్ బాబు తెలుగుతెరను ఏలారు. అదీ ‘సోగ్గాడు’గా శోభన్‌బాబు చేసిన మేజిక్. – రెంటాల జయదేవ -
బెంగాలీ బాబు శోభన్‌బాబు
దివంగత నటి, ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’లోని స్టార్ క్యాస్ట్ రోజురోజుకీ పెద్దదవుతోంది. జయలలితగా కంగనా రనౌత్, యంజీఆర్‌గా అరవింద స్వామి, శశికళ పాత్రలో ప్రియమణి నటిస్తున్నారు. కరుణానిధిగా ప్రకాశ్‌రాజ్ కనిపిస్తారట. తాజాగా శోభన్‌బాబు పాత్రలో బెంగాలీ నటుడు జిష్షూసేన్ గుప్తా నటిస్తారని తెలిసింది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. శోభన్‌బాబు, జయలలిత కొంతకాలం ప్రేమలో ఉన్నారని అప్పట్లో టాక్. శోభన్‌బాబు పాత్ర ఈ సినిమాలో కీలకంగా ఉండబోతోందట. ఈ పాత్రను పోషించడానికి శోభన్‌బాబు పాత చిత్రాలను చూస్తున్నారట జిష్షూ సేన్. యన్టీఆర్ బయోపిక్‌లో ఎల్వీ ప్రసాద్ పాత్రలో, ‘అశ్వథ్థామ’ లో విలన్ పాత్రలో నటించారు జిష్షూ. -
పుస్తకాల పండుగొచ్చే
సాక్షి హైదరాబాద్: నగరానికి పుస్తకాల పండగొచ్చింది. ప్రతి ఏటా డిసెంబరులో 9 రోజులపాటు జరిగే పుస్తకాల ప్రదర్శన పుస్తక ప్రియులకు ఓ ప్రత్యేకమైన సంబురం. నేటి నుంచి తెలంగాణ కళా భారతి (ఎన్టీఆర్ స్టేడియంలో) 33వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ ప్రారంభం కానుంది. పుస్తక ప్రదర్శన ఏర్పాట్లు, దాని ప్రత్యేకతలను బుక్ ఫెయిర్ ప్రతినిధులు ఆదివారం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, జాయింట్ సెక్రటరీ శోభన్‌బాబు, తదితరులు పాల్గొన్నారు. మొత్తం 330 స్టాళ్లు ఈసారి ప్రదర్శనలో 330 స్టాళ్లు ఏర్పాటు చేశారు, వీటిలో ప్రముఖ ప్రచురణ సంస్థల, పత్రికల స్టాల్స్, తెలుగు, ఇంగ్లిషు సహా అన్ని భాషల పుస్తకాల స్టాళ్లు ఉన్నాయి. ఇక పిల్లలను పుస్తకాలు చదివించేలా బాల మేళాను ప్రముఖంగా నిర్వహిస్తున్నారు. పిల్లలకు, ఐడీ కార్డుతో వచ్చిన విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. గతేడాది 10 లక్షల మంది పాల్గొన్నారని, నగరానికి 50–100 కి.మీ పరిధిలోని పాఠశాలలు తమ విద్యార్థులతో రావాలని గౌరీశంకర్ ఆహ్వానించారు. ఇప్పటివరకు 2 లక్షల పాస్‌లను పంపిణీ చేశామన్నారు. ఎప్పుడు: పుస్తక ప్రదర్శన ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ తమిళిసై ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథులుగా గంటా చక్రపాణి, బి.వినోద్ కుమార్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ జనార్ధన్ రెడ్డి పాల్గొననున్నారు. -
వెండితెర గురువులు
గురు బ్రహ్మ.. గురు విష్ణు.. అని శ్లోకం ఉంది నిజమేగానీ సినిమా వాళ్లు దానికి కాస్త ఎక్స్టెన్షన్ కొట్టి లెంగ్త్ పెంచి గురు హీరో గురు హీరోయిన్ గురు క్యారెక్టర్ ఆర్టిస్ట్ నమః అని కూడా అనుకున్నారు. స్కూళ్లు, కాలేజీలు లేని సమాజం ఎలా లేదో టీచర్ల, లెక్చరర్ల పాత్రలు లేని సినిమాలు కూడా లేవు. ఆ మిస్సమ్మల, పంతులమ్మల, మాస్టారుల రీ విజిట్.. నేడు టీచర్స్ డే సందర్భంగా. ‘మిస్సమ్మ’లో సావిత్రి కేవలం స్కూల్లో పిల్లలకే టీచర్ కాదు. ఆ సినిమాలోని ప్రతి పాత్రకూ టీచరే. కొంచెం నాన్ సీరియస్‌గా ఉన్న ఎన్.టి.ఆర్కు లక్ష్యం ఏర్పరిచిన ఆమే టీచర్. దొంగ బిచ్చగాడు రేలంగిని ఆ దారి వదిలించిన ఆమే టీచర్. తెలిసీ తెలియని వయసులో ఉన్న జమునకు మంచి చెడు తెలియజేసిన ఆమే టీచర్. కంత్రీ విలన్ రమణా రెడ్డికి బడితె పూజ చేయడం తెలిసిన ఆమే టీచర్. ‘మిస్సమ్మ’లో సావిత్రిని చూసి చిన్నపిల్లల్లా ప్రతి ఒక్కరూ భయపడేవారే. ఆఖరుకు ఎస్.వి. రంగారావు, బుష్యేంద్రమణిలతో సహా. సినిమాల్లో టీచర్ పాత్రకు గట్టిగా ఫౌండేషన్ వేసిన పాత్ర అది. కానీ ఆశ్చర్యంగా ‘బడి పంతులు’లో ఎన్.టి.ఆర్ పాత్ర అమిత మెత్తన. నెమ్మది, కరుణ, దయ తప్ప ఆ పాత్రకు ఏమీ తెలియదు. పిల్లలు దేవుళ్లు కాబట్టి ఆ పాత్రలోని దైవత్వాన్ని గ్రహించి ఆదరించారు. కానీ కడుపున పుట్టిన సంతానం అవమానం చేసి వేదన మిగిల్చింది. ఆ పంతులును బడి ఎక్కించి నిలబెట్టింది. అయితే మంచితనమే చివరికి గెలుస్తుంది. శిష్యుడు ఫెయిల్ కావచ్చు గాని విలువలకు నిలబడ్డ గురువు ఓడిపోయినట్టు చరిత్రలో లేదు. అయితే ఇంట్లో తల్లిదండ్రుల మాట వినని మొండి ఘటాలు కూడా స్కూల్లో ఒక మాస్టారు ముందు మోళీ వేసినట్టుగా తలాడిస్తారనడానికి తార్కాణంగా ‘కోడె నాగు’ సినిమా వచ్చింది. ఆ సినిమాలో పరమ మొండి ఘటమైన శోభన్ బాబు తన టీచర్ అయిన ఆత్రేయ మాట మాత్రమే వింటాడు. కానీ ఈ శిష్యుడి సంస్కరణలో ఆ గురువు ప్రాణ త్యాగం చేస్తాడు. ఆ గురువుకు నివాళిగా శిష్యుడూ ఆత్మార్పణం చేస్తాడు. గుండెలు పిండే ఈ కథ గురుశిష్యుల అనుబంధాన్ని అజరామరం చేసింది. ‘స్కూలు’, ‘కాన్వెంటు’ అనే మాటలు వాడుకలో పెరుగుతున్న వేళ ఆడవాళ్లు టీచింగ్ ప్రొఫెషన్లోకి ఎక్కువగా వస్తున్న వేళ ‘పంతులమ్మ’ అనే సినిమా రావడం విడ్డూరం కాదు. భార్య చనిపోగా, చిన్న పిల్లాడితో అవస్థలు పడుతున్న రంగనాథ్ దగ్గర పంతులమ్మ ఉద్యోగానికి వచ్చిన లక్ష్మి ఆ పిల్లాడికి తల్లిలా మారి గాడి తప్పిన ఆ ఇంటికి ఇల్లాలిగా కూడా మారే ఆ కథ పెద్ద హిట్ అయ్యింది. అయితే ‘పూజ’లో మేనమామ కూతురైన కన్నడ మంజులను పెళ్లి చేసుకుందామనుకున్న లెక్చరర్ రామకృష్ణ ఇష్టం లేని వాణిశ్రీని చేసుకుని ఆమెను భార్యగా స్వీకరించలేక క్షోభ పడటం, చివరకు ఆ జంట ఏకం కావడం ఆ వృత్తిలో ఉండేవారికి ఎదురయ్యే ‘పరీక్షాకాలం’గా జనం చూశారు. ఇదే సమయంలో వచ్చిన మరో ముఖ్యమైన సినిమా ‘బలిపీఠం’. ఇందులో కులమతాల వివక్ష దూరం కావాలని భావించే స్కూల్ టీచర్ శోభన్‌బాబు తనకంటే పైకులం స్త్రీ శారదను వివాహం ఆడి సంఘంలో ఎంతటి హెచ్చుతగ్గుల వ్యవస్థ ఉన్నదో తెలుసుకుంటాడు. యూనిఫామ్ వేసి పిల్లలందరినీ సమానం చేసే క్లాస్రూమ్ ఇంట్లో.. బజారులో ఎంత అసమానంగా ఉంటుందో ఈ సినిమాలో తెలుస్తుంది. అటు పిమ్మట వచ్చిన ‘విశ్వరూపం’ విద్యార్థి శక్తి తలుచుకుంటే సంఘ నిర్మాణం, దేశ నిర్మాణంలో ఎంత చురుకైన పాత్ర పోషించగలదో చూపించింది. అయితే అందుకు వారిని ఉత్తేజపరచగల గురువు అవసరం. అలాంటి గురువుగా ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో గొప్పగా కనిపిస్తారు. కానీ అన్ని సినిమాల్లోనూ ఎన్.టి.ఆర్లు ఉండరు. కొన్నింటిలో చంద్రమోహన్లు ఉంటారు. ‘మూడుముళ్లు’ సినిమాలో చంటిబిడ్డతో పల్లెటూళ్లో పాఠాలు చెప్పడానికి వచ్చిన టీచర్ చంద్రమోహన్ అదే ఊళ్లో ఆకతాయిగా తిరుగుతున్న రాధిక మనసు దోచుకుంటాడు. చంద్రమోహన్ సంస్కారాన్ని చూసిన రాధిక ఎలాగైనా సరే అతణ్ణి పెళ్లి చేసుకొని అతని బిడ్డకు తల్లిలా మారాలనుకుంటుంది. ఆమెను అనేకసార్లు ఫెయిల్ చేసిన చంద్రమోహన్ చివరకు పాస్ చేసి అక్కున చేర్చుకుంటాడు. టి.కృష్ణ వచ్చాక సినిమాల్లో బాధ్యతతో ఉండాల్సిన టీచర్ల పాత్రలు ఎక్కువగా చూపించారు. ‘వందేమాతరం’లో స్కూల్ టీచర్‌గా రాజశేఖర్, ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ సినిమాల్లో టీచర్‌గా, లెక్చరర్‌గా విజయశాంతి ప్రేక్షకులను క్లాస్‌రూమ్‌లో కూర్చోబెట్టారు. ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో’... ప్రతి ప్రేక్షకుడు బాధ్యత ఉన్న టీచర్‌గా సంస్కరణకు దిగకపోతే భవిష్యత్తు అంధకార బంధురం అని చెప్పారు. ‘శుభలేఖ’లో సుమలత లెక్చరర్. సంతలో పశువును అమ్మినట్టు వరుణ్ణి అతడి తల్లిదండ్రులు అమ్మే వరకట్న దురాచారాన్ని నిర్మూలించడానికి ఆమె గళం ఎత్తుతుంది. కైకాల సత్యనారాయణను ఎదిరిస్తుంది. ఫలితంగా ఉద్యోగం పోగొట్టుకుంటుంది. అయితే ఏం... ఆఖరుకు చిరంజీవిలాంటి ఉత్తముణ్ణి భర్తగా పొందుతుంది. ఈ సినిమాలో కె.విశ్వనాథ్ మూడు విషయాలు చెప్పారు. స్త్రీలు బాగా చదువుకోవాలి. ఉద్యోగం చేయాలి. అమ్మకానికి అబ్బాయిని తెచ్చుకోకుండా ఆత్మగౌరవంతో పెళ్లి బంధంలోకి వెళ్లాలి. లెక్చరర్ పాత్రలు మాస్ హీరోలను కూడా ఆకట్టుకున్నాయి. అందుకే వెంకటేశ్ ‘సుందరకాండ’, చిరంజీవి ‘మాస్టర్’, బాలకృష్ణ ‘సింçహా’ చేశారు. స్టూడెంట్స్‌ను ‘యాంటీ కరెప్షన్ ఫోర్స్’గా మార్చి, అవినీతి అధికారులకు ఏకంగా మరణశిక్ష విధిస్తూ సంచలనం సృష్టించింది కేవలం ఒక ప్రొఫెసర్ అంటే అది ఆ వృత్తి గొప్పతనం అనుకోవాలి. ‘ఠాగూర్’ సినిమాలో చిరంజీవి ఈ పని చేస్తారు. అయితే ఉపాధ్యాయుడంటే విద్యార్థి బాగు మాత్రమే కోరేవాడు కాదు ఊరు బాగు కూడా కోరేవాడు అని రాజేంద్రప్రసాద్ ‘ఓనమాలు’ చెప్పింది. ఇందులో టీచరైన రాజేంద్రప్రసాద్ సొంత ఊరు వదిలిపెట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఊరికి రావాలని మాతృభూమికి సేవ చేయాలని పిలుపు ఇస్తారు. మార్గదర్శి లేని ఊరు దివిటీ లేని చీకటి దారి అని సందేశం ఇస్తారు. కొత్తతరం హీరోలు కూడా లెక్చరర్లుగా, ట్యూటర్లుగా కనపడటానికి వెనకాడటం లేదు. ‘గీత గోవిందం’లో విజయ్ దేవరకొండ ఒక మంచి లెక్చరర్‌గా కనపడతాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి అబ్దుల్ కలామ్ నుంచి స్ఫూర్తి పొందేవారు ఎందరో ఉంటారు. వారు చెప్పిన మంచే ఒక హీరోనో హీరోయినో చెప్తే వెంటనే తాకే యువతరం శాతం ఎక్కువగా ఉంటుంది. స్టూడియోనే క్లాస్‌రూమ్‌గా కెమెరానే బ్లాక్‌బోర్డుగా సాగే ఈ స్ఫూర్తివంతమైన పాఠాలు కొనసాగాలని కోరుకుందాం. – కె. ‘మిస్సమ్మ’లో సావిత్రి ‘బడిపంతులు’లో ఎన్టీఆర్, అంజలి ‘సుందరకాండ’లో వెంకటేశ్, ‘ఓనమాలు’లో రాజేంద్రప్రసాద్, ‘విశ్వరూపం’లో ఎన్టీఆర్ విజయశాంతి శ్రీవిద్య, శోభన్‌బాబు ‘మూడు ముళ్లు’లో రాధిక, చంద్రమోహన్ ∙చంద్రమోహన్, విజయశాంతి, చరణ్‌రాజ్ ‘ఠాగూర్’లో చిరంజీవి, ‘గీత గోవిందం’లో విజయ్ దేవరకొండ -
25న ‘శోభన్ బాబు’ అవార్డ్స్
దివంగత హీరో శోభన్ బాబు అభిమానులు ‘శోభన్ బాబు సేవాసమితి’ పేరిట ప్రతి ఏడాది ఆయన జయంతి, వర్ధంతిలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శోభన్ బాబు పేరుపై సినీ పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 25న తొలిసారిగా అవార్డుల ప్రదానోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమ వివరాలు చెప్పేందుకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డుల కార్యక్రమంలో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు మొత్తం 19 అవార్డులు ఇస్తున్నాం. వాటిల్లో ఒకరికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 9 మందికి ఎవర్గ్రీన్ అవార్డులు, తొమ్మిది ప్రామిసింగ్ అవార్డ్స్ ఉంటాయి. ఈ కేటగిరీల్లో దర్శకుడు, హీరో, హీరోయిన్, నిర్మాత, రైటర్, సినిమాటోగ్రాఫర్, సింగర్, సంగీత దర్శకుడు, కమెడియన్లు ఉంటారు. అవార్డుల ప్రదానోత్సవానికి కృష్ణంరాజుగారు ముఖ్య అతిథిగా వస్తున్నారు’’ అన్నారు. ‘‘జనవరి 14న శోభన్ బాబు జయంతిని పురస్కరించుకుని కర్నూలులో వేలాది మందితో భారీ ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నాం’’ అని మాజీ ఎమ్మెల్సీ, అఖిలభారత శోభన్ బాబు సేవాసమితి ప్రతినిధి ఎం. సుధాకర్ బాబు అన్నారు. ఈ సమావేశంలో నటుడు, ఎంపీ మురళీమోహన్, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, దర్శకులు రేలంగి నరసింహారావు, రాశీ మూవీస్ నరసింహారావు, నిర్మాత జె. రామాంజనేయులు, నటుడు సంపూర్ణేష్ బాబు, శేష్ట రమేష్ బాబు, పలువురు శోభన్ బాబు అభిమానులు పాల్గొన్నారు. -
శోభన్‌బాబు చిరస్థాయిగా ఉంటారు
‘‘ఎన్టీ రామారావుగారు ముందుగా పరిచయమైనా హీరోగా మా ఫస్ట్ సినిమా శోభన్బాబుగారికే రాశాం. ఆ తర్వాత ఆయనతో 13 సినిమాలకు కలసి పనిచేశాం. శోభన్‌బాబుగారు సినిమాలు మానేసే దశలో మా డైరెక్షన్లో ‘సర్పయాగం’తో పాటు ‘దోషి–నిర్దోషి’ అనే చిత్రం రాశాం. రెండూ మంచి హిట్టయ్యాయి. అప్పుడు శోభన్‌బాబుగారు ఫోన్ చేసి.. ‘నేను గౌరవంగా రిటైర్ అయ్యేలా హిట్లు ఇచ్చారు.. ఫ్రీగా ఓ సినిమా చేసుకోమన్నారు. కానీ మేము చేయలేదు. మేము సినిమా చేసినా, చేయకున్నా మా మనసుల్లోనే కాదు అందరి మనసుల్లోనూ ఆయన చిరస్థాయిగా బతికే ఉన్నారు. ఎప్పటికీ ఉంటారు కూడా’’ అని రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. దివంగత శోభన్‌బాబు పేరిట ‘అఖిల భారత శోభన్ బాబు సేవాసమితి’ ఆధ్వర్యంలో డిసెంబర్ 23న ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేయనున్నారు. 2017కి గానూ నటీనటులు, సాంకేతిక నిపుణులకు వివిధ కేటగిరిల్లో ఈ అవార్డులు అందజేయనున్నారు. ఈ అవార్డుల కార్యక్రమం పోస్టర్ని రచయితలు పరుచూరి బ్రదర్స్ రిలీజ్ చేయగా, దర్శకుడు మారుతి టీజర్‌ను ఆవిష్కరించారు. ఓ సందర్భంలో ‘నేను మీకు పెద్దన్నయ్యను’ అన్నారు శోభన్‌బాబుగారు. అంత ప్రేమాభిమానాలు మాపై వర్షింపజేసిన ఆయన కోసం వారి అభిమానులతో కలసి ఎన్ని సంవత్సరాలైనా ఈ పరుచూరి బ్రదర్స్ అడుగేస్తారు’’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. అఖిల భారత శోభన్‌బాబు సేవాసమితి సభ్యులు వీరప్రసాద్, నిర్మాత ఎమ్.నరసింహారావు, శోభన్‌బాబు అభిమానులు సుధాకర్ బాబు (మాజీ ఎమ్మెల్యే) జె.రామాంజనేయులు, జేష్ట రమేశ్ బాబు (మాజీ ఎమ్మెల్యే), సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
డిసెంబర్ 23న శోభన్‌బాబు అవార్డుల ప్రదానం
ప్రముఖ కథానాయకుడు శోభన్‌బాబు పేరిట ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేయబోతోంది అఖిల భారత శోభన్ బాబు సేవాసమితి. డిసెంబర్ 23న ఈ అవార్డుల వేడుక జరగనుంది. 2017 సంవత్సరానికి గానూ నటీనటులు, సాంకేతిక నిపుణులకు వివిధ కేటగిరిల్లో ఈ అవార్డులు అందజేయనున్నారు. ఆ వివరాలను వెల్లడించేందుకు హైదరాబాద్‌లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన పరుచూరి బ్రదర్స్ పోస్టర్‌ను, మారుతి అవార్డ్స్ టీజర్‌ను ఆవిష్కరించారు. నిర్మాత ఎమ్.నరసింహారావు, శోభన్‌బాబు అభిమానులు సుధాకర్ బాబు, జె.రామాంజనేయులు, వీరప్రసాద్, జేష్ట రమేశ్ బాబు (మాజీ ఎమ్మెల్యే), సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
వధువు తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించండి
మంగళగిరిటౌన్: ప్రేమించి పెళ్లిచేసుకున్న తమ కుమారుడి ఆచూకీ చెప్పాలంటూ ఇంటిపైన సమూహంతో దౌర్జన్యంగా దాడిచేసి, విచక్షణా రహితంగా ప్రవర్తించారని, వారి నుంచి రక్షణ కల్పించాలని యువకుడి తండ్రి మోపర్తి శోభన్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి కథనం ప్రకారం... మోపర్తి శోభన్‌బాబు కుమారుడు మోపర్తి అశోక్ చక్రవర్తి గ్రామంలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఏప్రిల్13వ తేదీ కాకుమాను మండలం లింగంగుంట్లకు చెందిన సౌభాగ్యశ్రీతో మంగళగిరి మండలంలోని ఈసీఏ చర్చిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం సౌభాగ్యశ్రీ పెద్దల నుంచి రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు. అప్పటినుంచి ఆ జంట అశోక్ చక్రవర్తి తల్లిదండ్రుల వద్ద కాకుండా వేరేచోట ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం రాజకీయ ప్రాబల్యంతో 50 మంది సమూహం తమ ఇంటిపైకి వచ్చి నీ కుమారుడు ఎక్కడున్నాడో చెప్పండని దాడి చేయడానికి ప్రయత్నించారని అశోక్‌చక్రవర్తి తండ్రి శోభన్‌బాబు వాపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అమ్మాయి బంధువుల నుంచి తమ కుమారుడు, కోడలితో పాటు తమకు రక్షణ కల్పించాలని శోభన్‌బాబు విజ్ఞప్తిచేశారు. -
చెరగని ముద్ర
ఆరనీకుమా.. ఈ దీపం కార్తీకదీపం.. అనే పాటతో తెలుగిం టి ఆడపడుచుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ సినీనటి శ్రీదేవికి నాగార్జునసాగర్‌తో ప్రత్యేకానుబంధం ఉం ది. 1979లో ఆమె నటించిన కా ర్తీకదీపం సినిమాలోని ప్రేక్షకాదరణ పొందిన పాటతో పాటు కొన్ని సన్నివేశాలను జలాశయ తీరంలో చిత్రీకరించారు. నాగార్జునసాగర్ : సినీనటి శ్రీదేవికి ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. 1979లో విడుదలైన కార్తీకదీపం సినీమాలో ఒకపాటను సాగర్ జలాశయతీరంలో చిత్రీకరించారు. ఈ పాటతోనే ఆ సినిమా హిట్టయ్యింది. ‘ఆరానీకుమా ఈదీపం కార్తీకదీపం’ అనే పాటను శోభన్‌బాబు, శారదతోపాటు శ్రీదేవితో కలిసి జలాశయంలో దీపాలు వదిలే దృశ్యాలను చిత్రీకరించారు. శోభన్‌బాబు, శ్రీదేవిపై ‘చిలుకమ్మ పలికింది.. చిగురాకు కులికింది’ అనే పాటను విజయవిహార్, ఎత్తిపోతల ప్రాంతంలో చిత్రీకరించారు. శివాజీ గణేశన్ హీరోగా నటించిన తమిళ చిత్రం ఆధారంగా డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి రచనతో తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించారు. శోభన్‌బాబు, శ్రీదేవి, శారద చక్కని నటనతో.. ఈ చిత్రం విజయవంతమయ్యింది. ప్రస్తుతం శ్రీదేవి మరణవార్త విన్న సాగర్వాసులు ఆనాడు ఈ ప్రాంతంలో తీసిన చిత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు. -
జయ.. అమృత.. ఓ మిస్టరీ!
చెన్నై: జయలలిత వారసులమంటూ చాలా మంది కోర్టులను ఆశ్రయించారు. కానీ ఇందులో అమృత అనే యువతి సుప్రీంకోర్టుకు వెల్లడించిన అంశాలు.. అవసరమైతే డీఎన్ఏ పరీక్షకూ సిద్ధమని ప్రకటించటం ఆసక్తికర చర్చకు తెరలేపింది. అయితే. అసలు జయకు కూతురుందా? ఉంటే ఆమెనెవరు పెంచారు? జయ సన్నిహితులేమంటున్నారు? ఈ అమృత ఎవరు? ఈ అంశాలపై స్పష్టత వస్తేనే కేసులో చిక్కుముడి వీడుతుంది. ఈ నేపథ్యంలో అమృత చెబుతున్న అంశాలను ఓసారి గమనిస్తే.. అమృత చెబుతున్నదేంటి? జయలలిత సినీ రంగంలో ఓ వెలుగు వెలుగుతున్న రోజుల్లోనే 1980 ఆగస్టు 14న చెన్నై సమీపంలోని మైలాపూర్‌లో జయలలిత నివాసంలో తాను జన్మించినట్లు అమృత తెలిపారు. ‘సినిమా కెరీర్ పాడవకుండా బిడ్డపుట్టిన విషయాన్ని బయటకు రానీయకుండా జయ కుటుంబసభ్యులు జాగ్రత్తపడ్డారు. తనను శైలజ, సారథి దంపతులకు అప్పగించటంతో.. అప్పటినుంచి బెంగళూరులోని రామసంద్రలోనే పెరిగాను. రెండేళ్ల క్రితం శైలజ మృతి చెందగా ఈ ఏడాది మార్చిలో సారథి కన్నుమూశారు. చనిపోయే సమయంలో సారథి తనను పిలిచి నేనున వీరి సొంత కూతురిని కాదని.. జయలలిత ఏకైక కుమార్తెను అనే విషయాన్ని చెప్పారు’ అని అమృత పేర్కొన్నారు. సారథి చెప్పిన మిగిలిన వివరాలను జయ బంధువులనడిగి నిర్దారించుకున్నట్లు అమృత తెలిపారు. జయ సన్నిహితులు, బంధువులు, వరుసకు సోదరైన లలిత, మేన కోడలు రంజని కూడా ఈ విషయాన్ని నిర్ధారించారన్నారు. అమ్మ నన్ను ముద్దుపెట్టుకుంది 1996 జూన్ 6న జయలలిత దగ్గరికి తాను తొలిసారి వెళ్లానని, చూసిన వెంటనే ఆమె తనను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుందని అమృత వెల్లడించారు. తర్వాత కూడా పలుమార్లు జయను కలిసినట్లు తెలిపారు. సచివాలయానికి వెళ్లిన ప్రతిసారీ.. ‘నువ్వు ఎక్కడైనా ఉండు. ప్రాణాలతో ఉంటే చాలు’ అనేవారని అమృత తెలిపారు. అమృత చెప్పే విషయాలను జయ చిన్ననాటి స్నేహితురాలు గీత సమర్థించారు. శోభన్‌బాబు–జయలలితకు ఓ కుమార్తె పుట్టిందని, ఆమే అమృత అని తెలిపారు. ఈ విషయం శశికళ సహా జయ సన్నిహితులందరికీ తెలుసన్నారు. జయకు కూతురు ఉన్న విషయం వాస్తవమేనని జయ మేనత్త కూతురు ఎల్ఎస్ లలిత కూడా వెల్లడించారు. అయితే.. ఆ కూతురు అమృతేనా కాదా? అనేది నిర్ధారించలేనన్నారు. ఆరుద్ర భార్య అదే చెప్పారు శోభన్‌బాబుతో సంబంధాన్ని జయలలిత 1979లోనే బయటపెట్టినట్లు తెలుస్తోంది. తమ సంబంధంపై వార్తలు రాసిన నాటి తమిళ వారపత్రిక ‘స్టార్ అండ్ స్టైల్’కు రాసిన లేఖలో ‘ఏడేళ్లుగా శోభన్ బాబుతో సహజీవనం చేస్తున్నా. ఈ విషయాన్ని దాచి పెట్టాల్సిన అవసరం లేదు’ అని జయలలిత చెప్పినట్లు సమాచారం. శోభన్ బాబు వివాహితుడు కావడం వల్లే ఆయన్ను పెళ్లి చేసుకోలేకపోయానని జయ ఆ లేఖలో పేర్కొన్నట్టు చెబుతారు. ఇదే విషయాన్ని ప్రముఖ కవి ఆరుద్ర భార్య రామలక్ష్మి ధృవీకరించారు. శోభన్‌బాబు, జయలలిత మధ్య సంబంధముండేదని, అయితే.. శోభన్ బాబు తన భార్యకు ద్రోహం చేయొద్దనుకోవడంతోనే వీరి ప్రేమ పెళ్లివరకు రాలేదన్నారు. అమృత వెనక శశికళ? సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూతురినంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన అమృత వెనక శశికళ ప్రోద్బలం ఉన్నట్లు భావిస్తున్నారు. తన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించడానికి అమృత సమాయత్తం అవుతున్నారు. సుప్రీంలో అమృత పిటిషన్ దాఖలు చేసినప్పుడు మద్దతుగా ఆమె బంధువులు లలిత, రంజనీ సంతకాలు చేశారు. జైల్లో శశికళను రంజని కొన్ని నెలల కిత్రం కలుసుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అమృత ద్వారా జయలలిత వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేయాలని రంజనీకి శశికళ సూచించినట్లు తెలుస్తోంది. జయకు స్వయానా కూతురని అమృత నిరూపించుకుంటే, ఆ తరువాత పార్టీ, ఆస్తులను చేజిక్కించుకోవచ్చని శశికళ పథకం పన్నినట్లుగా ఆమె అంతరంగికులే చెబుతున్నారు. జయలలిత తల్లి సంధ్యకు సమీప బంధువైన రంజనీతో కూడా శశికళకు ముందుగానే పరిచయం ఉంది. 1980లో జయలలిత ప్రసవించినపుడు రంజనీ అక్కడే ఉన్నట్లు లలిత చెప్పిందని సమాచారం. జయలలిత తొలి వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, మంత్రులు, పార్టీ నేతలు నల్ల చొక్కాలు ధరించి అన్నాశాలై నుంచి అమ్మ సమాధి ఉన్న మెరీనా బీచ్ వరకు మౌనర్యాలీ నిర్వహించారు. జయ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న సీఎం పళని స్వామి, పన్నీర్ సెల్వం -
సమాచారం లీక్: శోభన్‌బాబుపై వేటు!
సాక్షి, విజయవాడ: కంచె చేను మేసిన తరహాలో ఓ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారి అవినీతిపరులతో కుమ్మక్కయ్యాడు. అవినీతి అధికారులకు ముందుగానే ఏసీబీ దాడుల గురించి లీక్ చేసి.. వారు ఒడ్డున పడేలా వ్యవహరించాడు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఏసీబీ రహస్య విభాగం మేనేజర్ శోభన్‌బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి అధికారులతో శోభన్‌బాబు కుమ్మక్కయి.. ముందుగానే ఏసీబీ దాడుల సమాచారాన్ని వారికి అందవేస్తున్నట్టు తాజాగా గుర్తించారు. 50మందికిపైగా అవినీతిపరులతో ఆయన సంప్రదింపులు జరిపినట్టు కాల్‌డేటా ఆధారంగా ఏసీబీ ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో శోభన్‌బాబుపై శాఖపరమైన విచారణకు ఏసీబీ డీజీ ఠాకూర్ ఆదేశించారు. కాల్‌డేటా ఆధారంగా ఆయనపై కేసు నమోదుచేశారు. -
నేను జయలలిత కూతురిని
-
నేను జయలలిత కూతురిని
శోభన్‌బాబు, జయ ప్రేమకు చిహ్నంగా జన్మించాను: అమృత సాక్షి, బెంగళూరు: తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత తన కన్నతల్లి అని బెంగళూరుకు చెందిన అమృత అనే మహిళ సంచలన ప్రకటన చేసింది. కూతురినని నిరూపించుకునేందుకు డీఎన్ఏ పరీక్షలకు సైతం తాను సిద్ధమని ప్రకటించింది. మరోవైపు, జయలలితది సహజ మరణం కాదని, నిజాలను రాబట్టేందుకు సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్ తదితరులకు ఆమె రాసిన లేఖలు మంగళవారం వెలుగుచూశాయి. సదరు లేఖలో ఉన్న సారాంశం క్లుప్తంగా... ‘జయలలిత నా కన్నతల్లి. ఆమె తన అమ్మానాన్నలను కోల్పోయి మానసికంగా కుంగిపోయిన దశలో అలనాటి తెలుగు సినీ హీరో శోభన్‌బాబు సహచర్యంతో కోలుకుంది. ఆ సమయంలో వారిద్దరి ప్రేమకు గుర్తుగా నేను పుట్టాను. సామాజిక కట్టుబాట్ల కారణంగా వీరి వివాహం జరగలేదు. బెంగళూరులో ఉంటున్న జయ సోదరి శైలజ, భర్త సారథిలకు నన్ను అప్పగించారు. తన కుమార్తెననే విషయం చెప్పొద్దని వారితో జయ ఒట్టు వేయించుకున్నారు. 1996లో జయను కలవాల్సిందిగా శైలజ నాకు సూచించారు. కలిసినపుడు నన్ను చూడగానే జయ నా వివరాలు కనుక్కొని ఆప్యాయతతో ఆలింగనం చేసుకున్నారు. తర్వాతా అనేకసార్లు కలిశా. నేనే నీ తల్లినని ఆమె నాతో ఎన్నడూ అనలేదు. జయ మరణం తర్వాత దీప, దీపక్‌లు ఆమె ఆస్తులకు వారసులమని చెబుతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను చూసి.. అమెరికాలో ఉన్న మా బంధువైన జయలక్ష్మి నాకు ఫోన్ చేసి జయ సంతానం నేనే అని చెప్పారు. బెంగళూరులో ఉంటున్న మరో బంధువు సైతం ఇదే మాట చెప్పారు. నా తల్లిని కొంతమంది కుట్రచేసి చంపారు. వారిలో అన్నాడీఎంకే నాయకురాలు శశికళ, నటరాజన్‌లు ముఖ్యులు’ అని లేఖలో రాశారు. -
శోభన్‌బాబు హత్య కేసులో ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్: వనస్థలిపురంలో ఐదు రోజుల క్రితం హత్యకు గురైన శోభన్‌బాబు కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. హత్యకేసులో నిందితులైన శశిధర్, యాదగిరి అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని మీడియా ముందు హాజరుపరిచారు. గత నెలలో గోవాకు వెళ్లి పేకాట ఆడడంతో రూ.లక్షా 30 వేల నగదును యాదగిరి పోగొట్టుకున్నాడు. యాదగిరి, శోభన్‌బాబులు తిరిగి వచ్చేటప్పుడు ఖర్చులకు డబ్బులు ఇవ్వకపోవడంతో కోపంతో పథకం ప్రకారం మరికొందరితో కలిసి హత్య చేశాడు. శోభన్‌బాబుకు యాదగిరి చిన్ననాటి స్నేహితుడు. హత్యకు గురైన శోభన్ బాబు స్వస్థలం నల్లగొండ. రాజేష్, మరికొందరు వ్యక్తులు పరారీలో ఉన్నారు.