చెన్నై: జయలలిత వారసులమంటూ చాలా మంది కోర్టులను ఆశ్రయించారు. కానీ ఇందులో అమృత అనే యువతి సుప్రీంకోర్టుకు వెల్లడించిన అంశాలు.. అవసరమైతే డీఎన్‌ఏ పరీక్షకూ సిద్ధమని ప్రకటించటం ఆసక్తికర చర్చకు తెరలేపింది. అయితే. అసలు జయకు కూతురుందా? ఉంటే ఆమెనెవరు పెంచారు? జయ సన్నిహితులేమంటున్నారు? ఈ అమృత ఎవరు? ఈ అంశాలపై స్పష్టత వస్తేనే కేసులో చిక్కుముడి వీడుతుంది. ఈ నేపథ్యంలో అమృత చెబుతున్న అంశాలను ఓసారి గమనిస్తే..
అమృత చెబుతున్నదేంటి?
జయలలిత సినీ రంగంలో ఓ వెలుగు వెలుగుతున్న రోజుల్లోనే 1980 ఆగస్టు 14న చెన్నై సమీపంలోని మైలాపూర్‌లో జయలలిత నివాసంలో తాను జన్మించినట్లు అమృత తెలిపారు. ‘సినిమా కెరీర్ పాడవకుండా బిడ్డపుట్టిన విషయాన్ని బయటకు రానీయకుండా జయ కుటుంబసభ్యులు జాగ్రత్తపడ్డారు. తనను శైలజ, సారథి దంపతులకు అప్పగించటంతో.. అప్పటినుంచి బెంగళూరులోని రామసంద్రలోనే పెరిగాను. రెండేళ్ల క్రితం శైలజ మృతి చెందగా ఈ ఏడాది మార్చిలో సారథి కన్నుమూశారు. చనిపోయే సమయంలో సారథి తనను పిలిచి నేనున వీరి సొంత కూతురిని కాదని.. జయలలిత ఏకైక కుమార్తెను అనే విషయాన్ని చెప్పారు’ అని అమృత పేర్కొన్నారు. సారథి చెప్పిన మిగిలిన వివరాలను జయ బంధువులనడిగి నిర్దారించుకున్నట్లు అమృత తెలిపారు. జయ సన్నిహితులు, బంధువులు, వరుసకు సోదరైన లలిత, మేన కోడలు రంజని కూడా ఈ విషయాన్ని నిర్ధారించారన్నారు.
అమ్మ నన్ను ముద్దుపెట్టుకుంది
1996 జూన్ 6న జయలలిత దగ్గరికి తాను తొలిసారి వెళ్లానని, చూసిన వెంటనే ఆమె తనను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుందని అమృత వెల్లడించారు. తర్వాత కూడా పలుమార్లు జయను కలిసినట్లు తెలిపారు. సచివాలయానికి వెళ్లిన ప్రతిసారీ.. ‘నువ్వు ఎక్కడైనా ఉండు. ప్రాణాలతో ఉంటే చాలు’ అనేవారని అమృత తెలిపారు. అమృత చెప్పే విషయాలను జయ చిన్ననాటి స్నేహితురాలు గీత సమర్థించారు. శోభన్‌బాబు–జయలలితకు ఓ కుమార్తె పుట్టిందని, ఆమే అమృత అని తెలిపారు. ఈ విషయం శశికళ సహా జయ సన్నిహితులందరికీ తెలుసన్నారు. జయకు కూతురు ఉన్న విషయం వాస్తవమేనని జయ మేనత్త కూతురు ఎల్‌ఎస్ లలిత కూడా వెల్లడించారు. అయితే.. ఆ కూతురు అమృతేనా కాదా? అనేది నిర్ధారించలేనన్నారు.
ఆరుద్ర భార్య అదే చెప్పారు
శోభన్‌బాబుతో సంబంధాన్ని జయలలిత 1979లోనే బయటపెట్టినట్లు తెలుస్తోంది. తమ సంబంధంపై వార్తలు రాసిన నాటి తమిళ వారపత్రిక ‘స్టార్ అండ్ స్టైల్’కు రాసిన లేఖలో ‘ఏడేళ్లుగా శోభన్ బాబుతో సహజీవనం చేస్తున్నా. ఈ విషయాన్ని దాచి పెట్టాల్సిన అవసరం లేదు’ అని జయలలిత చెప్పినట్లు సమాచారం. శోభన్ బాబు వివాహితుడు కావడం వల్లే ఆయన్ను పెళ్లి చేసుకోలేకపోయానని జయ ఆ లేఖలో పేర్కొన్నట్టు చెబుతారు. ఇదే విషయాన్ని ప్రముఖ కవి ఆరుద్ర భార్య రామలక్ష్మి ధృవీకరించారు. శోభన్‌బాబు, జయలలిత మధ్య సంబంధముండేదని, అయితే.. శోభన్ బాబు తన భార్యకు ద్రోహం చేయొద్దనుకోవడంతోనే వీరి ప్రేమ పెళ్లివరకు రాలేదన్నారు.
అమృత వెనక శశికళ?
సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూతురినంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన అమృత వెనక శశికళ ప్రోద్బలం ఉన్నట్లు భావిస్తున్నారు. తన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించడానికి అమృత సమాయత్తం అవుతున్నారు. సుప్రీంలో అమృత పిటిషన్ దాఖలు చేసినప్పుడు మద్దతుగా ఆమె బంధువులు లలిత, రంజనీ సంతకాలు చేశారు. జైల్లో శశికళను రంజని కొన్ని నెలల కిత్రం కలుసుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అమృత ద్వారా జయలలిత వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేయాలని రంజనీకి శశికళ సూచించినట్లు తెలుస్తోంది.
జయకు స్వయానా కూతురని అమృత నిరూపించుకుంటే, ఆ తరువాత పార్టీ, ఆస్తులను చేజిక్కించుకోవచ్చని శశికళ పథకం పన్నినట్లుగా ఆమె అంతరంగికులే చెబుతున్నారు. జయలలిత తల్లి సంధ్యకు సమీప బంధువైన రంజనీతో కూడా శశికళకు ముందుగానే పరిచయం ఉంది. 1980లో జయలలిత ప్రసవించినపుడు రంజనీ అక్కడే ఉన్నట్లు లలిత చెప్పిందని సమాచారం. జయలలిత తొలి వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, మంత్రులు, పార్టీ నేతలు నల్ల చొక్కాలు ధరించి అన్నాశాలై నుంచి అమ్మ సమాధి ఉన్న మెరీనా బీచ్ వరకు మౌనర్యాలీ నిర్వహించారు.
జయ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న సీఎం పళని స్వామి, పన్నీర్ సెల్వం
Comments
Please login to add a commentAdd a comment