మురళీ మోహన్, పరుచూరి గోపాలరావు, వెంకటేశ్వరరావు
దివంగత హీరో శోభన్ బాబు అభిమానులు ‘శోభన్ బాబు సేవాసమితి’ పేరిట ప్రతి ఏడాది ఆయన జయంతి, వర్ధంతిలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శోభన్ బాబు పేరుపై సినీ పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 25న తొలిసారిగా అవార్డుల ప్రదానోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమ వివరాలు చెప్పేందుకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డుల కార్యక్రమంలో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు మొత్తం 19 అవార్డులు ఇస్తున్నాం. వాటిల్లో ఒకరికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, 9 మందికి ఎవర్‌గ్రీన్ అవార్డులు, తొమ్మిది ప్రామిసింగ్ అవార్డ్స్ ఉంటాయి.
ఈ కేటగిరీల్లో దర్శకుడు, హీరో, హీరోయిన్, నిర్మాత, రైటర్, సినిమాటోగ్రాఫర్, సింగర్, సంగీత దర్శకుడు, కమెడియన్లు ఉంటారు. అవార్డుల ప్రదానోత్సవానికి కృష్ణంరాజుగారు ముఖ్య అతిథిగా వస్తున్నారు’’ అన్నారు. ‘‘జనవరి 14న శోభన్ బాబు జయంతిని పురస్కరించుకుని కర్నూలులో వేలాది మందితో భారీ ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నాం’’ అని మాజీ ఎమ్మెల్సీ, అఖిలభారత శోభన్ బాబు సేవాసమితి ప్రతినిధి ఎం. సుధాకర్ బాబు అన్నారు. ఈ సమావేశంలో నటుడు, ఎంపీ మురళీమోహన్, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, దర్శకులు రేలంగి నరసింహారావు, రాశీ మూవీస్ నరసింహారావు, నిర్మాత జె. రామాంజనేయులు, నటుడు సంపూర్ణేష్ బాబు, శేష్ట రమేష్ బాబు, పలువురు శోభన్ బాబు అభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment