ఒకే ఒక్క క్యారెక్టర్.. గంటన్నర సినిమా.. సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ అహం- రీబూట్. ఆహాలో రెండు నెలల క్రితం విడుదలైన ఈ సినిమాపై దర్శకరచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌లో రివ్యూ ఇచ్చారు.
అలా చేసుంటే..
ఆయన మాట్లాడుతూ.. రేడియో జాకీగా పని చేసే ఓ యువకుడి చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ఒకే పాత్రతో సినిమా తీయడం అంత ఈజీ కాదు. ఒకే క్యారెక్టర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా కష్టం. ఇందులో సోలోమ్యాన్ షోలా కాకుండా ప్రియురాలి పాత్రను నెమరువేసుకునే సన్నివేశాలు రూపొందించి ఉంటే ఇంకా బాగుండేది. అప్పుడు ప్రేక్షకులు సినిమాను ఇంకా బాగా చూసేవారు.
తాపత్రయం బాగుంటుంది
సినిమా గురించి మరింత మాట్లాడుతూ.. తన జీవితంలో ఒకరిని కోల్పోయినందుకు చనిపోదామనుకునే దశ నుంచి దాన్నుంచి బయటపడటం అనేది మంచి సందేశం. తన జీవితంలో జరిగిన సంఘటన మరొకరి జీవితంలో జరగకూడదని హీరో పడే తాపత్రయం బాగుంటుంది. చిన్నచిన్న సమస్యలకే ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది మంచిది కాదని సినిమాలో చక్కగా చెప్పారు.
ప్రయోగాలు ఆపకూడదు
నూతన ఒరవడి కోసం ఇలాంటి సినిమాలను అప్పుడప్పుడు చూడాలి. కొన్నిసార్లు ప్రయోగాలు అద్భుత విజయాలను సాధిస్తాయి. మరికొన్నిసార్లు దెబ్బతింటాయి. దెబ్బతిన్నాం కదా అని ప్రయోగాలు ఆపకూడదు అని పేర్కొన్నారు. కాగా సుమంత్ హీరోగా నటించిన అహం మూవీకి ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment