బేబి.. క్లైమాక్స్‌ అలా తీసుంటే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ | Paruchuri Gopala Krishna Review on Baby Movie | Sakshi
Sakshi News home page

Paruchuri Gopala Krishna: బేబి సినిమాలో అలా చేయాల్సింది.. ఈ సినిమా ఆడకూడదు, కానీ..

Published Mon, Sep 4 2023 5:05 PM | Last Updated on Mon, Sep 4 2023 6:02 PM

Paruchuri Gopala Krishna Review on Baby Movie - Sakshi

చిన్న సినిమాగా రిలీజై అఖండ విజయం సాధించిన చిత్రం బేబి. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. సినిమా కథకు యూత్‌ బాగా కనెక్ట్‌ అయింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నది ఇదేనని చాలామంది అభిప్రాయపడ్డారు. మొత్తానికి సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమాపై సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చాడు.

నా గుండె ఎందుకో అదురుతోంది డైలాగ్‌..
'ఊహించని ముగింపుతో వచ్చిన అందమైన ప్రేమ కథ బేబి. ఇంటర్వెల్‌ వచ్చేసరికి  హీరోయిన్‌ ఓ చిన్న తప్పు చేసింది. ఈ తప్పును ప్రేమించినవాడికి చెప్పి ఉంటే సినిమా ముగింపు మరోలా ఉండేది. కానీ, ఆ తప్పును అతడితో చెప్పకుండా దాన్ని మర్చిపోయేందుకు మరో పెద్ద తప్పు చేసింది. ఏదో జరుగుతున్నట్లు నా గుండె ఎందుకో అదురుతోంది అన్న డైలాగ్‌తో ఏదో గండం రాబోతుందని డైరెక్టర్‌ ముందే హింటిచ్చాడు. సరిగ్గా అప్పుడే విరాజ్‌ ఎంట్రీ ఇవ్వడం.. హీరోయిన్‌ మేకప్‌ వేసుకోవడం.. తనలో మార్పులు రావడం చూపించారు.

ఇంటర్వెల్‌లో విరాజ్‌కు ముద్దు.. కానీ సెకండాఫ్‌ ప్రారంభంలో..
హీరో ఆనంద్‌ ఆటో తాకట్టు పెట్టి హీరోయిన్‌  వైష్ణవికి కొత్త ఫోన్‌ కొనిస్తాడు. కానీ ఎప్పుడైతే విరాజ్‌ ఐఫోన్‌ కొనిస్తాడో అప్పుడు ఆనంద్‌ ఇచ్చిన మొబైల్‌ను డబ్బా ఫోన్‌ అనేస్తుంది హీరోయిన్‌. దీంతో అతడు ఫోన్‌ నేలకేసి కొట్టేస్తాడు. అతడిచ్చిన ఫోన్‌నే చులకన చేసింది మరి ఆటోవాడితో కలిసి జీవిస్తుందా? అన్న ప్రశ్నను మనలో రెకెత్తించారు. ఇంటర్వెల్‌ సీన్‌ అయితే మైండ్‌ బ్లోయింగ్‌.. హీరోయిన్‌ విరాజ్‌కు కిస్‌ ఇస్తుంది. కానీ సెకండాఫ్‌ ప్రారంభంలో తన పెదాలు కడిగేసుకుంటుంది. అంటే తాగిన మత్తులో ఆ పని చేసిందే తప్ప తన ప్రేమ మాత్రం ఆనంద్‌ మీదే ఉందని అర్థమవుతుంది.

హీరోయిన్‌కు చెడ్డ సలహా..
అయితే విరాజ్‌ తనను వదిలేయాలంటే అతడి దగ్గరకు ఒకసారి వెళ్లి వస్తే సరిపోతుందని హీరోయిన్‌కు ఆమె స్నేహితురాలు చెడ్డ సలహా ఇస్తుంది. కథను ఇలా రాసుకున్న సాయిరాజేశ్‌ గట్స్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే! ఈ పాయింట్‌తో నా సినిమా ఏమైపోతుందోనని భయపడలేదు. ధైర్యంగా రాశాడు, ధైర్యంగా తీశాడు కూడా! శారీరకంగా ఒకరికి దగ్గరైన అమ్మాయి ఇంకొకరిని ధైర్యంగా పెళ్లి చేసుకోగలదా? కానీ హీరోయిన్‌ అలాంటి నిర్ణయం తీసుకుంది. ఈ క్లైమాక్స్‌తో సినిమా ఆడకూడదు. కానీ ఆడింది.

హీరోయిన్‌ బేబిలాగే ఆలోచించింది
పెట్టుబడికి 7 రెట్ల డబ్బులు వసూలు చేసింది. సమాజం ఇలాగే ఉందని నమ్మారు కాబట్టే జనాలు బేబిని ఆదరించారు. హీరోయిన్‌ విరాజ్‌కు పెదాలపై కాకుండా బుగ్గపై ముద్దు పెట్టి ఉంటే బాగుండేది. అప్పుడు క్లైమాక్స్‌లో హీరోహీరోయిన్లు కలిసిపోయేవారు అనిపించింది. టైటిల్‌కు తగ్గట్లుగా హీరోయిన్‌ బేబిలాగే ఆలోచించింది. రిస్కులు తీసుకుంటున్న స్క్రీన్‌ప్లేను కూడా జనాలు విజయవంతం చేస్తున్నారని బేబితో నిరూపితమైంది. ఏదేమైనా దర్శకుడు సాహసోపేతంగా తీశారు' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ.

చదవండి: పుష్పరాజ్‌ దెబ్బ.. సెకండ్‌ పార్ట్‌కు రూ.1000 కోట్ల డీల్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement