శోభితలో నాకు బాగా నచ్చేదదే.. తన నుంచి నేర్చుకోవాలి: నాగచైతన్య | Naga Chaitanya: I Like This Quality in Sobhita Dhulipala | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: తనలో ఆ టాలెంట్‌ చూసి అబ్బురపడ్డా.. ఆమె మేధస్సును నాకూ పంచమని అడుగుతుంటా..

Published Thu, Mar 20 2025 4:08 PM | Last Updated on Thu, Mar 20 2025 4:44 PM

Naga Chaitanya: I Like This Quality in Sobhita Dhulipala

పెళ్లయ్యాక అదృష్టం కలిసొస్తుందంటారు. కిరణ్‌ అబ్బవరం.. రహస్యను పెళ్లి చేసుకున్నా 'క' మూవీతో బ్లాక్‌బస్టర్‌ కొట్టాడు. అటు నాగచైతన్య (Naga Chaitanya).. శోభిత (Sobhita Dhulipala)ను పెళ్లాడాక 'తండేల్‌'తో పెద్ద హిట్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా సక్సెస్‌ అవకపోతే ఇంట్లో పరువు పోతుందని తెగ భయపడిపోయాడు. చివరకు విజయం దక్కడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఈ మధ్యే ఇద్దరూ మెక్సికోలో హనీమూన్‌కు కూడా వెళ్లొచ్చారు.

అప్పటిదాకా చైను ఫాలో కాలే
తాజాగా ఈ జంట వోగ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై కనిపించారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శోభిత మాట్లాడుతూ.. ఓసారి నేను సోషల్‌ మీడియాలో అభిమానులడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తున్నాను. అప్పుడో వ్యక్తి మిమ్మల్ని ఫాలో అవుతున్న అక్కినేని నాగచైతన్యను తిరిగి ఎందుకు ఫాలో అవడం లేదు? అని ప్రశ్నించారు.  అవునా అని ఆశ్చర్యపోతూ అతడి ప్రొఫైల్‌ చెక్‌ చేశా.. తను కేవలం 70 మందిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. అందులో నేనూ ఉన్నాను. 

నచ్చినవాటి కోసం..
అది చూసి కాస్త ఖుషీ అయ్యాను. వెంటనే నేనూ ఫాలో కొట్టాను. అప్పటినుంచి అతడి పోస్టులు రావడం.. ఒకరికొకరం మెసేజ్‌ చేసుకోవడం మొదలైంది. 2022 ఏప్రిల్‌లో తొలిసారి ఇద్దరం కలుసుకుని లంచ్‌ డేట్‌కు వెళ్లాం. తను చాలా సింపుల్‌గా ఉంటాడు. తను ఇష్టపడే బైక్‌ను రెండు గంటల సమయం కేటాయించి తనే శుభ్రం చేసుకుంటాడు. తనకు నచ్చిన వస్తువుల కోసం, వ్యక్తుల కోసం ఏదైనా చేస్తాడు. 

(చదవండి: సినిమాల్లో అసభ్యకర స్టెప్పులు... మహిళా కమిషన్‌ సీరియస్‌)

శోభితలో బాగా నచ్చే అంశం అదే!
జీవితం ఎన్ని సవాళ్లు విసిరినా సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాడు. కస్టడీ ఫ్లాప్‌ అయినప్పుడు, తండేల్‌ హిట్టయినప్పుడు ఒకేలా ఉన్నాడు అని చెప్పుకొచ్చింది. నాగచైతన్య మాట్లాడుతూ.. శోభిత చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది. అది నాకు బాగా నచ్చుతుంది. మా ఇంట్లో వారంతా కూడా తెలుగులోనే మాట్లాడతారు. కానీ నేను చెన్నైలో చదువుకోవడం వల్ల తమిళం భాష వచ్చేసింది. బయటకు వెళ్తే తమిళం, ఇంట్లో ఇంగ్లీష్‌లో మాట్లాడేవాడిని. 

ఫోటోలో స్మైల్‌ ఇవ్వు అంటే..
శోభిత మాట్లాడే తెలుగు ముందు నా భాష దేనికీ పనికిరాదు. ఈ విషయంలో ఆమెను మెచ్చుకోవాల్సిందే! నాకూ తెలుగు నేర్పించమని అడుగుతూ ఉంటాను. అలాగే తన మేధస్సును కూడా పంచమని చెప్తుంటాను. ఇకపోతే శోభిత ఫోటోల్లో పెద్దగా నవ్వనే నవ్వదు. ఎందుకలా ఉంటావ్‌, కాస్త నవ్వుతూ దిగొచ్చుగా అంటే నేను లోపల నవ్వుతున్నాను, కానీ మీరెవరూ చూడలేకపోతున్నారు అని నాకే డైలాగ్స్‌ వేస్తుంది అని చై చెప్పుకొచ్చాడు. చై-శోభిత 2024 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు.

చదవండి: తమన్‌ని అన్‌ఫాలో చేసిన రామ్‌ చరణ్‌..నిజమెంత?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement