ఈ సిగరెట్ సురక్షితమేమీ కాదు! | in this Cigarette Is not safe | Sakshi
Sakshi News home page

ఈ సిగరెట్ సురక్షితమేమీ కాదు!

Published Fri, Aug 26 2016 10:59 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

ఈ సిగరెట్   సురక్షితమేమీ కాదు!

ఈ సిగరెట్ సురక్షితమేమీ కాదు!

పల్మునాలజీ కౌన్సెలింగ్

నా వయసు 45 ఏళ్లు. విపరీతంగా సిగరెట్లు తాగుతాను. ఎంత ప్రయత్నించినా చైన్‌స్మోకింగ్ మానడం సాధ్యం కావడం లేదు. స్నేహితులు ఈ-సిగరెట్‌ను ప్రయత్నించమని చెబుతున్నారు. ఈ-సిగరెట్ (ఎలక్ట్రానిక్ సిగరెట్) ఉపయోగించడం ద్వారా సిగరెట్ మానేయవచ్చా? ఇది మంచిదేనా? - నవీన్‌కుమార్, మహబూబ్‌నగర్
ఈ-సిగరెట్‌లోనూ దాదాపు  సాధారణ సిగరెట్‌లో ఉండే ప్రమాదకరమైన రసాయనాలే ఉంటాయి. మామూలు సిగరెట్లు, ఈ-సిగరెట్లు... ఈ రెండింటిలోనూ నికోటిన్ కామన్‌గానే ఉంటుంది. ఇది తనకు బానిస అయ్యేలా చేసుకుంటుంది.  మందుల సేఫ్టీ విషయంలో ప్రామాణికమైన అమెరికా అత్యున్నత సంస్థ ఎఫ్‌డీఏ విశ్లేషణల ప్రకారం... ఈ-సిగరెట్‌లోనూ గుర్తించగల స్థాయిలో క్యాన్సర్ కారకాలూ, విషపూరిత రసాయనాలూ ఉన్నాయి. ఈ-సిగరెట్‌లో కాటరిడ్జ్‌లో డీ-ఇథైల్ గ్లైకాల్ అనే విషపూరిత పదార్థం, నైట్రోజమైన్స్ అనే క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. పైగా ఎన్నో రకాల కాలుష్యాలు ఈ-సిగరెట్ ద్వారా శరీరంలోకి వెళ్తుంటాయి. దీని పొగను కూడా  మామూలు సిగరెట్లలాగే గొంతు, ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలిక మంట, ఇన్ఫెక్షన్లను (క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్‌ను) కలిగిస్తుంది.

ఇలా పొగ పీల్చడం దీర్ఘకాలం పాటు కొనసాగితే అది ఈ-సిగరెట్ పొగ అయినా సరే... కొన్నాళ్ల తర్వాత బ్రాంకైటిస్, ఎంఫసిమా, గుండెజబ్బుల వంటి వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి ఈ-సిగరెట్ మామూలు సిగరెట్ కంటే చాలా సురక్షితమేమీ కాదు. దీర్ఘకాలంలో మామూలు సిగరెట్‌తో వచ్చే దాదాపు అన్ని రకాల దుష్పరిణామాలూ ఈ-సిగరెట్‌తోనూ వస్తాయి. ఈ-సిగరెట్‌లోనూ ఉండేది నికోటినే కాబట్టి దానికి బానిసై మళ్లీ మీరు ఈ-సిగరెట్‌కు అలవాటు పడతారు. మీరు సిగరెట్ వదిలేయదలిస్తే... ఒక్కసారిగా వదిలేయడం మేలు. సిగరెట్ మానేయగానే కాస్త చిరాకు, కోపం, నిస్పృహ, అస్థిమితంగా ఉండటం వంటి కొన్ని తాత్కాలిక లక్షణాలు కనిపించినా, దీర్ఘకాలంలో సిగరెట్ మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ.


డా॥రమణ ప్రసాద్
కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్,  కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్

 

 

కార్డియాలజీ కౌన్సెలింగ్
గుండెదడ తగ్గాలంటే..
?

నా వయసు 40 ఏళ్లు. ఈమధ్య నాకు గుండె దడగా ఉంటోంది. అడపాదడపా ఈ గుండెదడ వస్తోంది. దీనివల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందా? వాటి సాధారణ కారణాలు తెలపండి. సలహాలు ఇవ్వండి.    - సుబ్రహ్మణ్యం, బోధన్
సాధారణ పరిస్థితుల్లో అయితే గుండె తాలూకు స్పందనలను మనం గ్రహించలేము. ఒకవేళ అలా గ్రహించే స్థితి ఏర్పడితే దాన్ని గుండె దడ అంటారు. గుండె దడ అనేది ఒక వ్యాధి కాదు. ఒక లక్షణం. గుండెదడ తాత్కాలికంగా కనిపించినా, దానంతట అదే సద్దుమణుగుతుంది. అయితే ఇదే పరిస్థితి నిరంతర లక్షణంగా మారితే దానికి ప్రాధాన్యం ఇవ్వాలి లేకపోతే చాలా మందిలో గుండెకు సంబంధించిన ప్రతి అంశం ఆందోళన పుట్టిస్తుంది. సాధారణమైన జలుబులు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు, టీ, కాఫీ, మద్యం తాగడం వంటి అంశాలు కూడా గుండెదడను కలిగించగలవనే విషయం తెలిక చాలామంది విపరీతమైన ఆందోళనకు, అలజడికి గురవుతారు. సాధారణంగా ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు గుండెదడ వస్తుంది లేదా గుండెకు సంబంధించిన వ్యాధులలో కూడా ఈ స్థితి కనిపిస్తుంది. గుండెదడను వైద్యశాస్త్రపరంగా విశ్లేషించేటప్పుడు సాధారణ రక్తపరీక్ష మొదలు ఈసీజీ వరకు కొన్ని పరీక్షలు అవసరమవుతాయి.

సూచనలు :  గుండెదడగా ఉన్నప్పుడు మరీ వేడిగా ఉండే పదార్థాలను తినకూడదు. చేదు, కారం రుచులను తగ్గించుకోవాలి. ఎక్కువగా తినడం, తిన్నది జీర్ణం కాకముందే తినడం మంచిది కాదు.  మలమూత్ర విసర్జనలను ఆపుకోకూడదు. కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్ లాంటి ఉత్ప్రేరక పదార్థాలు వాడటం తగ్గించాలి. టీ కంటే కాఫీ మరింత ప్రమాదకరం.  పొగతాగే అలవాటు మానేయండి. పక్కనుండే స్నేహితులు పొగతాగుతున్నా వారించండి.  మానసికంగా నిలకడగా, నిశ్చింతగా ఉండాలి.  బిగ్గరగా మాట్లాడకూడదు, మాట్లాడితే గుండెదడ పెరుగుతుంది. మృదుభాషణ సర్వదా హితకరం.  నూనెలు, కొవ్వు పదార్థాలు వాడకాన్ని తగ్గించాలి. మరీ దడ ఎక్కువగా ఉన్నపుపడు ఐస్‌ను నల్లగ్గొట్టి ఒక బ్యాగ్‌లో వేసి, ఛాతీపై పెట్టుకుంటే గుండెదడ సద్దుమణుగుతుంది.


డాక్టర్  హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్.

 

కాలు నేలకు ఆనడం లేదు... మడమనొప్పి తగ్గేదెలా?
ఆయుర్వేద కౌన్సెలింగ్

నా వయసు 46 ఏళ్లు. గత నాలుగు నెలల నుంచి మడమనొప్పితో బాధపడుతున్నాను. బీపీ, షుగరు లేవు. డాక్టరుగారి సూచన మేరకు నరాల శక్తి కోసం మందులు వాడుతున్నాను. పెద్దగా ఫలితం కనబడలేదు. ఆయుర్వేదంలో పరిష్కారం ఉంటే తెలియజేయండి. - జి. కామేశ్వరి, విజయనగరం
మీ సమస్యను ఆయుర్వేద పరిభాషలో ‘పార్షి శూల’ అంటారు. ఇది వాత ప్రధానమైన వ్యాధి. శరీరంలోని ‘కొసనరాలు’ (పెద్ద నరాల చివరి శాఖలు) బలహీనమై వాపునకు గురవుతాయి. అందువల్ల మీరు మడమను అదిమిపెట్టి నడవలేరు. రాత్రి పడుకొని ఉదయం లేచేటప్పుడు పాదాన్ని నేలపై మోపాలంటే భరించలేనంత నొప్పిగా ఉంటుంది. దీనికి ప్రధానంగా విటమిన్-బి కాంప్లెక్సు తగినంత తీసుకోవడం అవసరం. ముడిబియ్యంతో వండిన అన్నం తినండి. గంజిని వార్చి పారేయవద్దు.

 
తాజాఫలాలు, డ్రైఫ్రూట్స్ ప్రతిరోజూ తినండి. పప్పులు, మొలకలు, మాంస రసం (మటన్‌సూప్) కూడా తినవచ్చు. మీ వయసు రీత్యా మీకు తగినంత కాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషక విలువలున్న ఖనిజలవణాలు లభించాలంటే పైన చెప్పిన ఆహారం క్రమం తప్పకుండా తీసుకుంటూ మూడు నెలలు తినండి. బయటి తినుబండారాలు, మరిగించిన నూనెతో చేసిన ఆహారపదార్థాలు తినవద్దు.

 చికిత్స : 1. క్షీరబల క్యాప్సూల్స్ : ఉదయం 1, రాత్రి - 1 (ఆహారానికి ముందు)

 2. మహాయోగరాజ గుగ్గులు (మాత్రలు) : ఉదయం 1, రాత్రి- 1 (తిన్న తర్వాత)

 3. శిలాజిత్ ( స్వర్ణయుక్త) : రోజూ ఒకటి

 4. మహారస్నాదికాఢ (కషాయం) : నాలుగు చెంచాలకు సమానంగా నీళ్లు కలిపి రోజూ మూడు పూటలా తాగాలి.

 5. పిండతైల : దీనిని మడమపై మృదువుగా మర్దన (మసాజ్) చేసి వేడినీటి ఆవిరితో కాపడం పెట్టాలి. (ఉదయం, సాయంత్రం)

 గృహవైద్యం : ఉమ్మెత్త ఆకుని శుభ్రంగా కడిగి, లోపలివైపు ఆముదంగానీ నువ్వుల నూనెగానీ పూసి, కొంచెం వేడి చేసి, దాన్ని మడమవై పెట్టి కట్టుకట్టుకోండి. ఈ విధంగా ఏడురాత్రులు చెయ్యండి. నొప్పి తగ్గిపోతుంది.

 

మా బాబు వయసు ఐదు నెలలు. మల మార్గం దగ్గరున్న చర్మం ఒరుసుకుపోయింది. తాకితే ఏడుస్తున్నాడు మంచి ఆయుర్వేద ఔషధం చెప్పగలరు.  - సుజాత, ఖమ్మం
సాధారణంగా శిశువులు మలవిసర్జన చేసిన తర్వాత, తల్లులు శుభ్రం చేస్తుంటారు కదా. ఎక్కువగా ఒత్తడం, ఎక్కువ సార్లు కడగడం వల్ల, చేతి ఒత్తిడి వల్ల... అక్కడ ఒరుసుకుపోయి, ఎర్రగా అవుతుంది. దీనికి గుదంకుట్ట అని ఆయుర్వేదం వర్ణించింది. దీన్ని ఇంగ్లిష్‌లో న్యాప్‌కిన్ డర్మటైటిస్ అంటారు.

చికిత్స : పరిశుభ్రం చేసినప్పుడల్లా మృదువుగా చేయాలి. మహామరిచాది తైలాన్ని శుభ్రమైన దూదితో మెల్లగా ఆ ప్రాంతంపై పూయాలి (రోజూ రెండు మూడు సార్లు పూయవచ్చు). వారం రోజులలో తగ్గిపోతుంది.

 

డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి  ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య
ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement