
ప్రతి కంపెనీలో సిగరెట్ తాగే వారు ఉంటారు.. తాగని వారూ ఉంటారు. కానీ మీరు పనిచేసే కంపెనీ ఎప్పుడైనా మీ సిగరెట్ అలవాటును మాన్పించేందుకు ప్రయత్నించిందా?? దాదాపుగా వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉండే ప్రతి కంపెనీ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోకపోవచ్చు. కానీ జపాన్‌లోని టోక్యోకు చెందిన ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగుల సంక్షేమమే ముఖ్యమని భావించింది. అందుకే ఎవరైతే పొగ తాగడం మానేస్తారో వారికి ఏడాదిలో ఆరు పని దినాలను అదనంగా సెలవులుగా మంజూరు చేస్తామని ప్రకటించింది.
ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కంపెనీ పేరు పియాలా.ఐఎన్‌సీ... కంపెనీ కేంద్ర కార్యాలయం బిల్డింగ్‌లోని 29వ ఫ్లోర్‌లో ఉంటుంది. అంత పైనుంచి ఉద్యోగులు బిల్డింగ్ బేస్‌మెంట్‌లోకి వచ్చి సిగరెట్ తాగి వెళ్లడం వలన సుమారు 15 నిమిషాల సమయం వ్యర్థమైపోతోంది. దీనివల్ల పనిలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని సిగరెట్ తాగని ఒక ఉద్యోగి పేపర్‌పై రాసి సలహాల పెట్టెలో వేశాడు. దీన్ని చదివిన కంపెనీ సీఈవో పొగతాగని వారి కోసం ఆరు అదనపు సెలవులను ఇస్తే బాగుంటుందని భావించాడు.
అంతేకాకుండా ప్రాణాన్ని హరించే ఆ మహమ్మారి నుంచి ఉద్యోగులను కాపాడవచ్చని నిర్ణయించాడు. దీంతో వెంటనే ఈ ఆరు సెలవు దినాల కాన్సెప్ట్‌ను ప్రారంభించాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది. 120 మంది ఉద్యోగుల్లో సుమారు 30 మంది ఆ కాన్సెప్ట్‌ను అందిపుచ్చుకుని ఇప్పటికే లబ్ధి పొందారు కూడా. కనీసం నలుగురినైనా సిగరెట్ అలవాటు నుంచి దూరం చేయాలని కంపెనీ ఉద్దేశాన్ని ప్రస్తుతం అక్కడి వారు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment