సిగరెట్‌.. చుట్టూ వందల కోట్ల వ్యాపారం | Foreign Cigarette Smuggling Gang Held in Hyderabad | Sakshi
Sakshi News home page

సిటీలో సిగరెట్‌ దందా!

Published Mon, Jun 15 2020 12:35 PM | Last Updated on Mon, Jun 15 2020 12:35 PM

Foreign Cigarette Smuggling Gang Held in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సిగరెట్‌..చుట్టూ ఇప్పుడు రూ.వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది. విదేశాల్లో తయారైన కొన్ని బ్రాండ్లను ఢిల్లీ మీదుగా గుట్టుగా నగరానికి తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ స్మగ్లింగ్‌ దందా లాక్‌డౌన్‌ తదనంతర పరిణామాలతో పెరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నగర వ్యాప్తంగా నిఘా ముమ్మరం చేశారు. ఫలితంగా శనివారం నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు రూ.12.6 లక్షల సరుకుతో చంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్‌ అహ్మద్‌ చిక్కాడు. ఈ విదేశీ సిగరెట్ల దందాపై దృష్టి పెట్టిన పోలీసు విభాగం లోతుగా ఆరా తీస్తోంది.  

తయారీ మొత్తం ఆయా దేశాల్లోనే...
హైదరాబాద్‌ నగరానికి అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో కొన్ని బ్రాండ్లే ఎక్కువగా ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్‌ గుర్తించింది. సాధారణ సిగరెట్లకు భిన్నమైన ఫ్లేవర్స్‌ కలిగి ఉండే డజరమ్‌ బ్లాక్, గుడాన్‌ గరమ్, మాల్‌బరో, డన్‌హిల్, ఎస్సా, విన్, ప్యారిస్‌ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు వివిధ రూపాల్లో వస్తున్నట్లు గుర్తించింది. ఇవి తయారవుతున్నది ఇండోనేషియా, చైనా, మలేషియా,స్విడ్జర్లాండ్, సౌత్‌ కొరియాల్లో అయినప్పటికీ అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకోవట్లేదు. దుబాయ్‌ మీదుగానే ఢిల్లీ, ముంబై, చెన్నైలకు చేరి అట్నుంచి సిటీకి వస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. మహ్మద్‌ అహ్మద్‌కు సైతం ఢిల్లీలోని సదర్‌ బజార్‌ నుంచి రైల్వే కార్గోలో వచ్చిన విషయం ఇప్పటికే గుర్తించారు. అధికారుల కళ్ళు గప్పేందుకు ఈ అక్రమ రవాణా సిగరెట్ల పేరుతో కాకుండా వివిధ వస్తువులంటూ జరుగుతోందని
నిర్థారిస్తున్నారు. 

ఓసారి ఓడలు, మరోసారి విమానాలు...
సిటీకి సిగరెట్ల అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న నగరానికి చెందిన ఓ ముఠాపై గతంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు డేగకన్ను వేశారు. ఈ గ్యాంగ్‌ ఓసారి విదేశీ సిగరెట్లను సముద్ర మార్గంలో కంటైనర్ల ద్వారా తీసుకువచ్చింది. పిల్లలకు వినియోగించే డైపర్లని చెప్తూ కంటైనర్‌ ముందు వరుసల్లో వాటినే పెట్టి, వెనుక సిగరెట్లను నింపి తీసుకువచ్చింది. మూసాపేటలో ఉన్న ఇన్‌ల్యాండ్‌ కంటైనర్‌ డిపోకు ఇవి చేరుకోవడంతో ఉప్పందిన డీఆర్‌ఐ అధికారులు దాడి చేసి రూ.7.5 కోట్ల విలువైన రెండు కంటైనర్లను పట్టుకుని నిందితుల్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత పంథా మార్చిన అదే గ్యాంగ్‌ ఇంజనీరింగ్‌ వస్తువులు, కంప్యూటర్‌ స్పేర్‌ పార్ట్స్‌ పేరుతో విమాన మార్గంలో తీసుకువచ్చింది. శంషాబాద్‌లోని ఎయిర్‌కార్గోలో ఉండగా దాడి చేసి రూ.51 లక్షల వలువైనవి స్వాధీనం చేసుకుని ముఠాను అరెస్టు చేసింది. ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఇలాంటి గ్యాంగ్స్‌ మరోసారి రెచ్చిపోతున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ అనుమానిస్తోంది.  

ఒకటికి ఒకటిన్నర డ్యూటీ...
ఆరోగ్యానికి హానికరమైన, స్థానికంగా ఉండే వ్యాపారులను నష్టాన్ని తీసుకువచ్చే సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం (కస్టమ్స్‌ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవుల్లో ఉండే సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. అంటే... రూ.10 ఖరీదైన సిగరెట్‌ ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీనే రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ డ్యూ టీని ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠా భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతోందని డీఆర్‌ఐ దర్యాప్తులో తేలింది. సిటీలో ఉన్న హోల్‌సేలర్లతో సంబంధాలు పెట్టుకున్న ఈ గ్యాంగ్‌ వారి ద్వారా మార్కెట్‌లోని వెదజల్లుతోంది.  

ఆరోగ్యానికీ చేటనే అనుమానం...
ఈ రకంగా అక్రమ రవాణా ద్వారా నగరంలోకి వస్తున్న సిగరెట్ల కారణంగా ‘పన్ను పోటు’తో పాటు ప్రజల ఆరోగ్యానికీ చేటు ఉందని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుల దర్యాప్తు నేపథ్యంలో క్షేత్రస్థాయిలోనూ పరిశీలన చేసి వ్యాపార లావాదేవీలను గుర్తించాలని నిర్ణయించారు. ఇలా చేయడం ద్వారా మూలాలు కనుగొనడానికి ఆస్కారం ఉందని చెప్తున్నారు. విదేశాల్లో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేది స్పష్టంగా వెలుగులోకి రాలేదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమని అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్‌ హెల్త్‌ ఆఫీసర్లు పరీక్షించి సర్టిఫై చేస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకపోడంతో విపణిలోకి వెళ్ళిపోతున్నాయని వివరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలు లేని ఈ సిగరెట్లు ఆరోగ్యానికి ఎనలేని హాని చేస్తాయిని పోలీసులుహెచ్చరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement