
సిగరెట్ పీకతో రోడ్లు..!
సిగరెట్ అలవాటు బాగా ఉన్నవాళ్లు రోజుకెన్ని ప్యాకెట్లు లాగిస్తారో చెప్పడం కష్టమే. లేదూ... లైట్‌గా తాగుతాం అనే వాళ్లు మాత్రం రోజుకు రెండు నుంచి మూడు వరకైనా తాగక మానరు కదా. వీరిలాంటి వారి సంఖ్య రాష్ట్రం, దేశం, ప్రపంచం ఇలా మొత్తంగా చూసుకుంటే... బాగానే ఉంటుంది. రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరి తాగే వాళ్లు సిగరెట్‌ను పూర్తిగా తాగుతారా అంటే.. సగం సిగరెట్, ఇటు ఫిల్టర్ ముక్కలను రోడ్లపైనే పడేస్తుంటారు. దానివల్ల ఇటు వాతావరణంలో వేడి పెరగడమే కాకుండా చెత్త కూడా కుప్పలు కుప్పలుగా పేరుకు పోతోంది.
మరి దీనికి పరిష్కారం ఏంటి? సిగరెట్ తాగేవాళ్లు తమ అలవాటును మానుకోవడమేనా? అది పూర్తిగా జరిగే పనిలా లేదు. అందుకేనేమో... ఆస్ట్రేలియాలోని రాయల్ మెల్‌బోర్న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు దీనికి పరిష్కారాన్ని కనుగొన్నారు. ఎలా అంటారా? గుట్టలు గుట్టలుగా పేరుకు పోతున్న సిగరెట్ పీకలను రోడ్ల తయారీలో ఉపయోగించొచ్చనేది వారి ఆలోచన. వాటిని కాంక్రీట్‌తో కలిపి రోడ్లు వేస్తే.. ఇటు వాతావరణంలో పెరిగే వేడిని తగ్గించొచ్చు. అలాగే వాటి ద్వారా విడుదలయ్యే రసాయనాలను అరికట్టొచ్చు. ఈ పద్ధతిని అన్ని దేశాల్లోనూ వినియోగిస్తే ఎంతో మేలు కదా..!