
కాలుతున్న సిగి‘రేట్లు’
కొవ్వూరు : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి లేఖ సిగిరెట్ వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. సిగిరెట్లపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. కారణం దొరకిందని భావించిన వ్యాపారులు సిగరెట్ల బ్లాక్ మార్కెట్ విక్రయాలకు తెర లేపారు. కేంద్ర బడ్జెట్ వచ్చే నెల ముందు నుంచి సిగిరెట్లను బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయించటం ప్రతి ఏటా పరిపాటిగా మారింది. ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టకపోవటంతో వారికి అందుకు అవకాశం చిక్కలేదు. ఇప్పుడు కేంద్ర మంత్రి లేఖ వారికి మంచి అవకాశం కల్పించింది. జిల్లాలో 10 రోజుల నుంచి హోల్‌సేల్ వ్యాపారులు సిగరెట్లకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. చిల్లర వర్తకులకు అవసరమైన మేరకు సిగరెట్లు లభించకపోవడం, దొరికినా అధిక ధరలకు కొనాల్సి రావటంతో ఎమ్మార్పీ కంటే సుమారు 20 శాతం వరకు ధర పెంచి విక్రయిస్తున్నారు.
ధరలు ఇలా..
గోల్డ్ ఫ్లాక్ కింగ్స్ 10 పెట్టెలు రూ.770 ఉండగా ప్రస్తుతం రూ.870 విక్రయిస్తున్నారు. ఒక పెట్టి ఎమ్మార్పీ 85 రూపాయలే. రిటైలర్లకు ప్యాకెట్‌కు ఇవ్వాల్సిన రూ.8 మార్జిన్‌కు తోడు మరో రూ.2 రెండు రూపాయలు అదనంగా వేసి మరీ హోల్‌సేల్ వ్యాపారులు దోచుకుంటున్నారు. దీంతో కిళ్లీ షాపులు, చిల్లర వర్తకులు పెట్టెను రూ.90 నుంచి రూ.100 వరకు వీలును బట్టి విక్రయిస్తున్నారు. గోల్డ్ ఫ్లాక్ ఫిల్టర్ 50 పెట్టెల కార్టన్ ధర 10 రోజుల క్రితం వరకు రూ.2,700. దీనిని రూ.2,950 వరకు విక్రయిస్తున్నారు. ఒక పెట్టె ఎమ్మార్పీ రూ.59 ఉండగా రిటైల్ వర్తకులు రూ.65 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నారు. బర్కిలీ ఫిల్టర్ 50 పెట్టెల కార్టన్ గతంలో రూ.1,580 ఉండగా ప్రస్తుతం రూ.1,700 అమ్ముతున్నారు. ఒక్కో పెట్టె ఎమ్మార్పీ రూ.35 ఉండగా రిటైల్‌గా రూ.40 చొప్పున విక్రయిస్తున్నారు. విల్స్ ఫ్లాక్ సిగరెట్లు 50 పెట్టెల కార్టన్‌ను హోల్‌సేల్ వ్యాపారులు రూ.2,450 చొప్పున అమ్ముతున్నారు. ఎమ్మార్పీ రూ.50 ఉన్న ఈ సిగిరెట్ పెట్టెను చిల్లర వర్తకులు రూ.55 వరకు విక్రయిస్తున్నారు. పది రోజుల క్రితం వరకు పొగరాయుళ్లకు ఇవే సిగరెట్లు ఎమ్మార్పీ ధరలకే లభ్యమయ్యేవి. గత ఏడాది కాలంలో సిగరెట్ ధరలు మూడుసార్లు పెరిగాయి.
బ్లాక్ మార్కెట్‌పై నియంత్రణ ఏదీ
జిల్లాలో కొందరు హోల్‌సేల్ డీలర్లు సిగరెట్లను భారీగా నిల్వచేసి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, వాణిజ్య పన్నుల శాఖ, రెవెన్యూ అధికారులు దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కొన్ని శాఖల అధికారులు, సిబ్బందికి హోల్‌సేల్ వర్తకుల నుంచి మామూళ్లు అందుతుండటమే ఈ ఉదాసీనతకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.