
త్వరలో ఐటీసీ సిగరెట్ల ఉత్పత్తి పునఃప్రారంభం!
న్యూఢిల్లీ: సిగరెట్‌ల ఉత్పత్తిని త్వరలో పునఃప్రారంభిస్తున్నట్లు ఐటీసీ ప్రకటించింది. పొగతాగడం హానికరమని సూచిస్తూ... సిగరెట్ కవర్‌పై 85 శాతం మేర ‘హెచ్చరిక చిత్రం’ ముద్రించాలన్న కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ... టొబాకో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (టీఐఐ) నేతృత్వంలోని పలు కంపెనీలు ఏప్రిల్ 1 నుంచీ తమ ఉత్పత్తులను నిలిపివేశాయి. టీఐఐలో ఐటీసీసహా గాడ్‌ఫ్రే ఫిలిప్స్, వీఎస్‌టీ వంటివి సభ్యత్వ సంస్థలుగా ఉన్నాయి. అసలు ఈ నిబంధనల్లో స్పష్టతలేదని కూడా ఆయా కంపెనీలు పేర్కొన్నాయి.
కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఐటీసీ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తమకు అనుకూలంగా రూలింగ్ ఇచ్చినందువల్ల త్వరలో ఉత్పత్తిని ప్రారంభిస్తున్నట్లు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ)కి సమర్పించిన ఒక ఫైలిం గ్‌లో తెలిపింది. కంపెనీకి ఐదు ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి. అయితే ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమయ్యేదీ స్పష్టమైన తేదీని తెలపలేదు. కోర్టు ఉత్తర్వుల పూర్తి వివరాలు తెలియరాలేదు.