
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల చుట్టూ కలుషిత వాతావరణం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ స్కూల్‌కు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్‌లు అమ్మే షాపులు ఉండకూడదని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్ల సమీపంలోని పరిస్థితులను ఇకపై ఏఎన్‌ఎంలు పర్యవేక్షిస్తారు. ఒక్కో ఏఎన్‌ఎంకు రెండు, మూడు పాఠశాలల బాధ్యతలు అప్పగించనున్నారు. ఏఎన్‌ఎం వెళ్లి స్కూలు సమీపంలోని పరిస్థితులను పరిశీలించాల్సి ఉంటుంది. దీనికోసం ఒక ప్రత్యేక యాప్‌ను తయారు చేశారు.
ఈ యాప్ ద్వారా అక్కడి ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాలి. ఎవరైనా సిగరెట్, గుట్కా వంటి షాపులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే స్కూల్ సమీపంలో ఎవరైనా స్మోకింగ్ చేసినా కూడా చర్యలుంటాయి. మద్యం షాపులైతే ఆ పరిసరాల్లో అసలే కనిపించకూడదు. ప్రతి స్కూల్‌నూ పర్యవేక్షణ కోసం మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ అనంతరం వీటిని ఆన్‌లైన్ పోర్టల్‌కు అనుసంధానిస్తారు. చెడు అలవాట్ల ప్రభావం చిన్నపిల్లలపై పడకూడదని ఈ చర్యలు చేపట్టారు. అలాగే స్కూల్ ఆవరణలో స్మోకింగ్ వల్ల వచ్చే అనర్థాలను సూచించే బోర్డులను ఏర్పాటు చేస్తారు. టీచర్లు ఎవరైనా స్కూల్ ఆవరణలో స్మోకింగ్ చేస్తే.. వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటారు. త్వరలో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment