ఆకాశంలో సిగ‘రేట్లు’
- బ్లాక్ మార్కెట్‌లో ప్రత్యక్షం
- ధరలు పెరుగుతాయనే కారణం
- కృత్రిమ కొరత సృష్టిస్తున్న మార్కెట్ శక్తులు
గుడివాడ : కాదేదీ బ్లాక్ మార్కెట్‌కు అతీతమని మార్కెట్ శక్తులు నిరూపిస్తున్నాయి. వచ్చే నెలలో సిగరెట్ ధరలు పెరుగుతాయనే సంకేతాలందడంతో బ్లాక్‌మార్కెట్ తలుపులు బార్లా తెరుచుకున్నాయి. పెరగనున్న పోగాకు ఉత్పత్తుల ధరలను బూచీగా చూపి మార్కెట్ శక్తులు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇప్పటికే సిగరెట్ ధరలు అడ్డగోలుగా పెంచి వినియోగదారులను దోచుకు తింటున్నారు.
కొత్త ఎంఆర్పీ ధరతో ఉత్పత్తులు రాకముందే పాత ఎంఆర్పీ ధర ఉన్న వాటిని బ్లాక్ చేసి ఒక్కో సిగరెట్ ప్యాకెట్‌కు రూ.10నుంచి 15వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో విని యోగదారుని జేబుకు చిల్లు పడుతుంది. ప్రతి బ్రాండ్‌పై ఎంఆర్‌పీ కన్నా 25నుంచి 35 శాతానికి పైగా అధిక ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అదేమని అడిగితే పొగాకు ఉత్పత్తులపై టాక్సును పెంచుతున్నందున ధరలు పెరగనున్నాయని అందుకే సరుకు దొర కడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. మ ద్యం తరువాత అత్యధిక గిరాకీ ఉన్న పోగాకు ఉత్పత్తుల ద్వారా మార్కెట్ శక్తులు రూ.కోట్లు గడిస్తున్నాయనే ఆరోపణలున్నాయి.
కృత్రిమ కొరత ...
సిగరెట్లుపై పెరగనున్న ధరలను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కంపెనీ నుంచి ఎటువంటి కొరత లేదని తెలుస్తుంది. పెంచిన టాక్సులు ఇంకా అమల్లోకి రాని కారణంగా కొత్త ఎంఆర్పీతో సిగరెట్ ఉత్పత్తులు బయటకు రాలేదు. పాత ధరతోనే సరుకు వస్తుండగా పెద్దపెద్ద హోల్‌సేల్ మార్కెట్ శక్తులు ముందుగానే సరుకును కొనేసి బ్లాక్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సిగరెట్‌ల సరఫరా సాధారణంగానే ఉన్నా పెద్దపెద్ద డిస్ట్రి బ్యూటర్లు, హోల్‌సేల్ వ్యాపారులు వీటిని బ్లాక్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు సరఫరా చేసినా హోల్ సేలర్లు సరుకును బ్లాక్ చేసి అధిక ధరకు అమ్ముతున్నారు.
రిటైల్ ధరకాదు.. ఎంఆర్పీ అయితేనే...
ఇప్పటి వరకు చిన్నచిన్న చిల్లర దుకాణాల వారికి హోల్‌సేల్ డీలర్లు రిటైల్ ధరకు అమ్ముతారు. ధరలు పెరుగుతాయని సంకేతాలు రావడంతో వారం రోజులుగా ఎంఆర్పీ ధరకే చిన్న దుకాణాల వారికి అమ్ముతున్నారు. ఇదే అదునుగా భావించిన చిన్న చిన్న బడ్డీ కోట్లు వారు ఒక్కో సిగరెట్‌కు ఒక రూపాయి అదనంగా వసూలు చేస్తున్నారు. అంటే పది సిగరెట్లు ఉండే పెట్టికి రూ.10 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. పొగాకు ఉత్పత్తుల ధరలు అడ్డగోలుగా వసూలు చేస్తున్నా నియంత్రించాల్సిన తూనికలు కొలతలు శాఖ నిద్రపోతుందని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు.