సాయితేజగౌడ్ యువకుడిపై దాడి చేస్తున్న సాయితేజగౌడ్
అడ్డగుట్ట: సిగరెట్ కోసం ఓ యువకుడు అర్థరాత్రి కిరాణా దుకాణానికి వెళ్లగా పాత బాకీ తీరిస్తేనే సిగరెట్ ఇస్తానని షాపు యజమాని చెప్పడంతో సదరు యువకుడు అతడితో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న తుకారాంగేట్‌కు చెందిన మరో యువకుడు తనకు సంబంధం లేకపోయినా జోక్యం చేసుకోవడమేగాక సిగరెట్ కోసం వచ్చిన యువకుడిపై చేయి చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గొడవపడుతున్న వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించిన సంఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంగళవారం రాత్రి స్థానిక ఇందిరా గాంధీ విగ్రహం సమీపంలోని కిరాణా దుకాణానికి వచ్చిన లాలాగూడకు చెందిన రాహుల్ బోస్లే అనే యువకుడు షాపు యజమాని ప్రకాష్‌ను సిగరెట్ అరువు అడిగాడు. అయితే ఇప్పటికే పాత బాకీ ఉన్నందున సిగరెట్ ఇచ్చేందుకు అతను నిరాకరించడంతో రాహుల్ షాపు యజమానితో గొడవ పడటంతో ఘర్షణకు దారి తీసింది.
అదే సమయంలో స్నేహితులతో కలిసి అటుగా వెళుతున్న సాయితేజ గౌడ్ ఈ విషయంలో జోక్యం చేసుకోగా నరేష్ అనే యువకుడు సాయితేజను కొట్టాడు. దీంతో సాయితేజ నరేష్‌తో పాటు రాహుల్‌పై దాడి చేయడమేగాక అడ్డు వచ్చిన అతని తల్లితో కూడా గొడవ పడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తుకారాంగేట్ పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మిగతా వారి విషయమై ఆరా తీయగా సాయితేజ తన స్నేహితుల వివరాలు చెప్పకుండానే స్టేషన్‌లో నుంచి బయటికి వెళ్లబోతూ కింద పడటంతో గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా స్టేషన్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుల్ తనపై దాడి చేశారని సాయితేజ గౌడ్ ఆరోపిస్తుండగా, అతడి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment