సాక్షి, సిటీబ్యూరో: బంగారం... ఎలక్ట్రానిక్ వస్తువులు... మాదకద్రవ్యాలు మాత్రమే కాదు సిగరెట్ల సైతం పెద్ద ఎత్తున నగరానికి అక్రమ రవాణా అవుతున్నాయి. ఈ తరహా స్మగ్లింగ్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడటంతో పాటు ప్రజారోగ్యానికి చేటని అధికారులు పేర్కొంటున్నారు. నగరానికి అక్రమంగా వచ్చిన సిగరెట్లను హోల్‌సేల్‌గా విక్రయిస్తున్న వ్యక్తిని తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి రూ.6 లక్షల విలువైన 3300 విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విక్రయంపై నిషేధం కొనసాగుతోందని టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ మంగళవారం వెల్లడించారు. నగరానికి అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో 23 బ్రాండ్లకు చెందినవిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాధారణ సిగరెట్లకు భిన్నమైన ఫ్లేవర్స్ కలిగి ఉండే బ్లాక్, గరమ్‌లతో పాటు ఎస్సీ, మోండ్, మల్‌బొరొ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు వివిధ రూపాల్లో వస్తున్నట్లు తెలిపారు.
ఇండోనేషియాలో తయారవుతున్న ఈ సిగరెట్లు అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకోవట్లేదు. దుబాయ్ మీదుగానే సిటీకి వస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కస్టమ్స్ సహా వివిధ విభాగాల కళ్లు గప్పేందుకు సిగరెట్ల పేరుతో కాకుండా వివిధ వస్తువుల పేరుతో అక్రమ రవాణా జరుగుతోందని వారు పేర్కొన్నారు. ఇలా నగరానికి వచ్చిన సిగరెట్లను సంతోష్ దవే అనే వ్యక్తి తన వద్ద స్టాక్ చేసుకుని హోల్‌సేల్‌గా రిటైలర్లకు విక్రయిస్తున్నాడు. అఫ్జల్‌గంజ్‌కు చెందిన ఇతను ఫీల్‌ఖానాలో మహాలక్ష్మీ మార్కెటింగ్ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నాడు. సుగంధ ద్రవ్యాల వ్యాపారం పేరుతో స్మగుల్డ్ సిగరెట్లనూ అమ్ముతున్నాడు. దీనిపై ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సైలు పి.రమేష్, గోవింద్ స్వామి, జి.శ్రీనివాస్‌రెడ్డి, సి.వెంకటేష్ సదరు సంస్థపై దాడి చేశారు. సంతోష్‌ను అదుపులోకి తీసుకుని అతడి నుంచి రూ.6 లక్షల విలువైన నిషేధిత సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని షాహినాయత్‌గంజ్ పోలీసులకు అప్పగించారు.
ఆరోగ్యానికి చేటు..ఆదాయానికి గండి
ఆరోగ్యానికి హానికరమైన, స్థానిక వ్యాపారులకు నష్టాన్ని తీసుకువచ్చే సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం (కస్టమ్స్ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవులో ఉండే సిగరెట్లలో ఒక్కో దానికి ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. అంటే... రూ.10 ఖరీదైన సిగరెట్‌ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీ రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ డ్యూటీని ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠాలు భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయని టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెబుతున్నారు. సిటీలోని సంతోష్ లాంటి హోల్‌సేలర్లతో సంబంధాలు పెట్టుకున్న ఈ ముఠాలు వారి ద్వారా సిగరెట్లను మార్కెట్‌లోని తీసుకెళుతున్నారు. ఈ రకంగా అక్రమ రవాణా ద్వారా నగరంలోకి వస్తున్న సిగరెట్ల కారణంగా ‘పన్ను పోటు’తో పాటు ప్రజల ఆరోగ్యానికీ చేటు ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇండోనేషియా సహా మరికొన్ని దేశాల్లో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేదానిపై స్పష్టత లేదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమని అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్ హెల్త్ ఆఫీసర్లు పరీక్షించి సర్టిఫై చేస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకపోడంతో విపణిలోకి వెళ్లిపోతున్నాయని వివరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలు లేని ఈ సిగరెట్లు ఆరోగ్యానికి హాని చేస్తాయిని హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు ఈ అక్రమ సిగరెట్లపై హెచ్చరిక బొమ్మలు కూడా ఉండవని, ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment