‘ఫ్యాన్సీ’ గా అక్రమ సిగరెట్ల వ్యాపారం | Cigarette Smuggling in Hyderabad | Sakshi
Sakshi News home page

‘ఫ్యాన్సీ’ గా అక్రమ సిగరెట్ల వ్యాపారం

Published Mon, Aug 19 2019 10:28 AM | Last Updated on Mon, Aug 19 2019 10:28 AM

Cigarette Smuggling in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: బేగంబజార్‌ పరిధిలోని ఫీల్‌ఖానాలో ఫ్యాన్సీ వస్తువుల వ్యాపారం చేస్తున్న మంగిలాల్‌ జైన్‌ దాని ముసుగులో అక్రమ సిగరెట్ల దందా మొదలెట్టారు. బంగ్లాదేశ్‌ నుంచి మూడు మెట్రో నగరాల మీదుగా సిటీకి వస్తున్న ఈ సరుకును విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం దాడి చేశారు. మంగిలాల్‌ను పట్టుకోవడంతో పాటు రూ.2 లక్షల విలువైన అక్రమ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం తెలిపారు. గోషామహల్‌ ప్రాంతానికి చెందిన మంగిలాల్‌ ఫీల్‌ఖానాలో ప్రియ నావెల్టీస్‌ పేరుతో ఫ్యాన్సీ వస్తువులు, సౌందర్య సాధనాలు, సుగంధ ద్రవ్యాలు విక్రయించే వ్యాపారం చేస్తున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం అక్రమ సిగరెట్ల దందా కూడా ఇదే కార్యాలయం నుంచి మొదలెట్టాడు. ఇండోనేషియాలో తయారైనట్లు అనుమానిస్తున్న ప్యారిస్, విన్, మోండ్‌ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు బంగ్లాదేశ్‌ మీదుగా దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. వీటిని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కోల్‌కతాలకు చెందిన కొందరు అక్రమ వ్యాపారాలు హోల్‌సేల్‌గా ఖరీదు చేసి హైదరాబాద్‌లోని ఏజెంట్లకు విక్రయిస్తున్నారు. రైలులో ఇక్కడకు చేరుకున్న ఈ బ్రాండ్లకు చెందిన సిగరెట్లను మంగిలాల్‌ తన దుకాణంలోనే నిల్వ చేస్తున్నాడు.

ఒక్కో సిగరెట్‌ ప్యాకెట్‌ను రూ.6కు ఖరీదు చేస్తున్న ఇతగాడు వివిధ దుకాణదారులకు రూ.20 నుంచి రూ.25కు విక్రయిస్తున్నాడు. ఇది వినియోగదారుడికి చేరేసరికి రూ.30 నుంచి రూ.40కి చేరుతోంది. తక్కువ ధరకు వస్తున్నాయనే ఉద్దేశంతో అనేక మంది వీటిని కొని కాలుస్తూ బానిసలుగా మారుతున్నారు. ఈ దందా ద్వారా ప్రభుత్వానికి పన్ను రూపంలో రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడుతోంది. ఆరోగ్యానికి హానికరమైన, స్థానికంగా ఉండే వ్యాపారులను నష్టాన్ని తీసుకువచ్చే సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం (కస్టమ్స్‌ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవుల్లో ఉండే సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. అంటే... రూ.10 ఖరీదైన సిగరెట్‌ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీనే రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. మంగిలాల్‌ వంటి వ్యాపారులు ఈ అక్రమ దందా చేయడం ద్వారా ఈ డ్యూటీతో పాటు జీఎస్టీ సైతం పరోక్షంగా భారీగా ఎగ్గోడుతున్నారు. ఇతడి దందాపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు టి.శ్రీధర్, కె.శ్రీనివాసులు తమ బృందాలతో దాడి చేసి పట్టుకున్నారు. ఇతడి నుంచి వివిధ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement