అమెరికా ఆడాళ్ల తరువాత మనోళ్లే!
ఢిల్లీ: దేశంలో గత సంవత్సరంతో పోల్చితే సిగరెట్ల వినియోగం బాగానే తగ్గింది. అయితే మహిళా స్మోకర్ల సంఖ్య మాత్రం తెగ పెరిగిపోయింది. భారత ఆరోగ్య మంత్రిత్వశాఖ పార్లమెంట్లో తెలిపిన తాజా గణాంకాల్లో సిగరెట్ల వినియోగం, ఉత్పత్తి వివరాలను వెల్లడించింది.
2013-14 సంవత్సరంలో భారత్లో ఊదేసిన సిగరెట్ల సంఖ్య 10,180 కోట్లుగా ఉంది. అయితే 2014-15 సంవత్సరానికి ఈ సంఖ్య 9,320 కోట్లకు తగ్గడం కొంతవరకు ఊరట కలిగించే అంశం. డిమాండ్ తగ్గడంతో సిగరెట్ల తయారీ కూడా తగ్గినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. 2013-14 సంవత్సరంలో ఇండియాలో 11,010 కోట్ల సిగరెట్లు ఉత్పత్తి కాగా, 2014-15 సంవత్సరానికి ఉత్పత్తి 10,530 కోట్లకు తగ్గింది.
అయితే.. సిగరెట్లను కాల్చే ఆడాళ్ల సంఖ్య మాత్రం మన దేశంలో బాగా పెరిగింది. గ్లోబల్ టొబాకో స్టడీ తెలిపిన వివరాల ప్రకారం అమెరికా తర్వాత అత్యధికంగా సిగరెట్లు తాగుతున్న ఆడాళ్లు మనోళ్లే కావడం విశేషం.1980 నాటికి భారత్లో సిగరెట్లు తాగుతున్న మహిళల సంఖ్య 53 లక్షల మంది ఉండగా, 2012 నాటికి వీరి సంఖ్య 1.25 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. ఈ పెరుగుదల ఆందోళనకరమని యాంటీ టొబాకో యాక్టివిస్ట్లు హెచ్చరిస్తున్నారు.