
పొగను పొమ్మంటున్నారు...
సినిమా చూద్దామని థియేటర్‌కు వెళ్తే.. ‘ఈ నగరానికి ఏమైంది..’ అంటూ ప్రకటనలు, సిగరెట్ డబ్బా కొంటే.. దానిపై పొగచూరిన ఊపిరితిత్తులు.. మొత్తానికి ధూమపానం అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి చర్యలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) ప్రకారం.. ధూమపానాన్ని మనవాళ్లు కాస్త దూరంగా ఉంచుతున్నారని తేలింది. పాన్, గుట్కా, బీడీ వంటి పొగాకు ఉత్పత్తులతో పోలిస్తే.. సిగరెట్ల విషయంలో ప్రజలు కాస్త సీరియస్‌గా ఆలోచించడం మొదలైందని సర్వే సారాంశం.
గ్రామీణ భారతం, పట్టణ భారతం వారీగా చేసిన సర్వే ఫలితాలు సిగరెట్ సమస్యకు ప్రజలు చెక్ పెడుతున్నారని తెలిపాయి. యావత్ భారతంలో పొగాకు ఉత్పత్తుల కోసం వెచ్చించే మొత్తం పెరిగింది. ఇదే సమయంలో పెరుగుదల నిష్పత్తి కొంత తగ్గడం గుడ్డిలో మెల్ల. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఎస్‌వో) డాటా ప్రకారం 2004-05 గ్రామీణ భారతం నెల వారీగా పొగాకు ఉత్పత్తులపై రూ.15.09 ఖర్చు చేస్తే.. అదే సమయంలో పట్టణ భారతం రూ.16.84 పొగాకుపై తగిలేసింది. ఇక 2009-10కి వచ్చే సరికి ఈ ఖర్చు గ్రామీణ భారతంలో రూ.20.41 ఉంటే, పట్టణ భారతంలో రూ.21.43గా నమోదైంది. అయితే గతంతో పోలిస్తే సిగరెట్లపై ఖర్చు చేసే మొత్తం నిష్పత్తి కొంత తగ్గిందని తెలిసింది. ఈ లెక్కన పొగచూరిన బతుకులు తమకొద్దనే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం.. ఆహ్వానించదగ్గ పరిణామం.