సాక్షి, అమరావతి: గుప్పెడంత గుండె శరీరం మొత్తానికి నిరంతరాయంగా రక్తం సరఫరా చేస్తుంటుంది. అంతటి కీలకమైన గుండెకు ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాలు, మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి జబ్బులు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. మరీ ముఖ్యంగా ధూమపానం గుండె ఆరోగ్యంపై అత్యధిక ప్రభావం చూపుతోందని కర్నూలు జీజీహెచ్ వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, కార్డియాలజీ వైద్యనిపుణుడు వినోద్ బైపాస్ సర్జరీ కేసులపై పరిశీలన జరిపారు. 2016 ఆగస్టు నుంచి 2021 డిసెంబర్ మధ్య కర్నూలు జీజీహెచ్‌లో నిర్వహించిన 108 బైపాస్ సర్జరీ కేసులను అనలైజ్ చేశారు. ఈ కేసుల్లో గుండె జబ్బు బాధితుల కనిష్ట వయసు 35, గరిష్ట వయసు 85 సంవత్సరాలు కాగా.. మొత్తం కేసుల్లో పురుషులు 90 మంది.. మహిళలు 18 మందిఉన్నారు.
అధిక కేసులకు ధూమపానమే కారణం
మెడికల్ అనలైజేషన్ ప్రొటోకాల్ ప్రకారం వివిధ కోణాల్లో పరిశీలన జరపగా.. 108 బైపాస్ సర్జరీ కేసుల్లో 60 మందిలో ధూమపానమే ప్రధాన కారణంగా నిర్ధారించారు. ధూమపానం అనంతరం రెండో స్థానంలో మద్యపానం ఉంది. 36 మందిలో మద్యపానం గుండె జబ్బుకు కారణంగా తేలింది. 28 మందిలో రక్తపోటు, 19 మందిలో మధుమేహం చరిత్రను గుర్తించారు. ధూమపానం ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్‌గా ఉన్న వ్యక్తులు యుక్త వయసు నుంచే ఆ వ్యసనానికి అలవాటుపడి ఉన్నట్టుగా నిర్ధారించారు. సుదీర్ఘకాలం పొగతాగడం వల్ల రక్తనాళాలపై తీవ్ర ప్రభావం పడి బైపాస్ సర్జరీలకు దారి తీసింది.
రక్తనాళాలకు హాని
ధూమపానం గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం. ధూమపానం చేసినప్పుడు పీల్చే రసాయనాలు గుండె, రక్త నాళాలకు హాని కలిగిస్తాయి. దీంతో అథెరోస్క్లెరోసిస్ లేదా ధమనులలో ఫలకం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం కొంతమందికి, ముఖ్యంగా గర్భనిరోధక మాత్రలు ఉపయోగించే స్త్రీలకు, మధుమేహం ఉన్నవారికి మరింత ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు, అధిక రక్తపోటు, అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలకు దారితీసి గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఈ క్రమంలో ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. రక్తపోటు, మధుమేహం వంటి జీవన శైలి జబ్బుల బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలి.
– డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, గుండె, ఊపిరి
తిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment