ధనుష్ చిత్ర పోస్టర్లపై వ్యతిరేకత
తమిళసినిమా: నటుడు ధనుష్ నటించిన తాజా చిత్రం వేలై ఇల్లా పట్టాదారి వివాదాల్లో చిక్కుకుంది. ధనుష్ నిర్మించి, నటించిన ఈ చిత్రం విజయబాటలో పయనిస్తోంది. అయితే ఈ చిత్ర ప్రచారంలో భాగంగా సిగరెట్లు తాగే ఫొటోలతో పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా వెలిశాయి. దీనిని తమిళనాడు పొగాకు నియంత్రణ ప్రజా సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సంఘం నిర్వాహకులు ఈ వ్యవహారంపై ఆరోగ్యశాఖకు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు.
దీనిపై పొగాకు నియంత్రణ ప్రజా సంఘం నాయకుడు సిరిల్ అలెగ్జాండర్ మాట్లాడుతూ వేలై ఇల్లా పట్టాదారి చిత్రానికి సెన్సార్ బోర్డు యు సర్టిఫికెట్ నిచ్చిందన్నారు. ఈ చిత్రంలో పొగతాగే సన్నివేశాలు చాలా ఉన్నాయని, పైగా ధనుష్ సిగరెట్ తాగే ఫొటోలను పోస్టర్లుగా ముద్రించి ప్రచారం చేస్తున్నారని ఇది పొగాకు నియంత్రణ చట్ట వ్యతిరేకత చర్య అవుతుందని పేర్కొన్నారు. ధనుష్ పాపులర్ నటుడని ఆయనే ఆరోగ్యానికి సంబంధించిన పొగాకు నియంత్రణ చట్టాన్ని అతిక్రమించారని ఆరోపించారు. కాబట్టి ధనుష్ సిగరెట్లు తాగే పోస్టర్లను ప్రభుత్వం వెంటనే తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.