రామ్... వీఐపి!
వీఐపి.. అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని అర్థం. కానీ, ఈ మధ్య తమిళ పరిశ్రమలో ఈ మూడక్షరాలకు ఓ కొత్తర్థం చెబుతున్నారు. అదే ‘వేలై ఇల్లాద పట్టదారి’ (వి.ఐ.పి). అంటే.. డిగ్రీ పట్టా పుచ్చుకున్న నిరుద్యోగి అని అర్థం. ధనుష్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ఇది. అలాగే, పెళ్లికి ముందు అమలాపాల్ చేసిన చిత్రం ఇదే కావడం విశేషం. అతి తక్కువ నిర్మాణ వ్యయంతో రూపొందించిన ఈ చిత్రం అక్కడ వసూళ్ల వర్షం కురిపించడం మరో విశేషం.
దాంతో ఈ సినిమా హక్కుల కోసం ఇతర భాషలకు చెందిన నిర్మాతలందరూ క్యూ కట్టారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈ సినిమా హక్కుల కోసం భారీ పోటీనే నెలకొంది. ఈ నేపథ్యంలో... ఇంత పోటీని తట్టుకొని నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకోవడం విశేషం. ‘రవికిశోర్ ఈ సినిమా హక్కుల్ని సొంతం చేసుకున్నారు’ అనగానే... ఇందులో నటించే హీరో ‘రామ్’ అని చెప్పకనే చెప్పేస్తున్నారంతా.
రామ్‌తోనే స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని చేయనున్నట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం. కథ రీత్యా ఇందులో హీరో పాత్ర... బోయ్ నెక్ట్స్ డోర్ అన్నట్టుగా ఉంటుంది. ఎలాగూ రామ్‌కి పక్కింటబ్బాయి ఇమేజ్ ఉంది కాబట్టి, రామ్‌కి ఈ కథ యాప్ట్‌గా ఉంటుందని పరిశీలకుల అంచనా. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.