సాక్షి, హైదరాబాద్: పొగాకు ఉత్పత్తుల వినియోగంలో ప్రపంచస్థాయిలో అమ్మాయిలు అబ్బాయిలను మించిపోయారు. పాఠశాల స్థాయిలో ఇది ఎక్కువగా ఉంది. 15 ఏళ్లలోపు విద్యార్థులు వివిధ రూపాల్లో పొగాకు వినియోగానికి ఆకర్షితులవుతున్నారు. తోటి విద్యార్థులను చూసి సరదాగా మొదలుపెట్టినవారు ఆ తరువాత వ్యసనంగా మార్చుకుంటున్నారు. యువత టొబాకో వినియోగంపై గ్లోబల్ యూత్ టొబాకో నిర్వహించిన సర్వే ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రపంచస్థాయిలో పొగాకు వినియోగంలో అబ్బాయిలు 22శాతం ఉంటే... అమ్మాయిలు 24శాతం. అంటే రెండు శాతం ఎక్కువగా అమ్మాయిలు పొగాకు ఉత్పత్తులను ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నారు. ధూమపానంలో కూడా అమ్మాయిలదే పైచేయి. మొత్తంగా 2.3శాతం విద్యార్థుల్లో– అమ్మాయిలు 2.7%, అబ్బాయిలు 1.9% పొగ తాగుతున్నారు. 12 శాతం విద్యార్థులు (13% అమ్మాయిలు, 12% అబ్బాయిలు) వివిధ పొగాకు ఉత్పత్తులను (స్మోక్‌లెస్ టొబాకో) ఉపయోగిస్తున్నారు.
భారత్‌లో మేలు..
యువత పొగాకు వినియోగ పర్యవేక్షణకు ‘గ్లోబల్ టొబాకో సర్వేలెన్స్ సిస్టమ్’ప్రమాణాలకు అనుగుణంగా దేశంలో గ్లోబల్ యూత్ టొబాకో సర్వే–4 నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపిఎస్) దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి స్కూళ్లలో (550 ప్రభుత్వ, 450 ప్రైవేట్ పాఠశాలలు)ని దాదాపు లక్ష మంది (80 వేలకు పైగా 13–15 ఏళ్ల వయసున్న) విద్యార్థులపై సర్వే నిర్వహించింది. జాతీయస్థాయిలో 2003తో (16.9 శాతంతో) పోల్చితే దేశంలో ఈ వయసు పిల్లల్లో పొగాకు వినియోగం 2019లో 8.5 శాతానికి తగ్గినట్టుగా ఈ సర్వే వెల్లడించింది. మొత్తంగా చూస్తే... భారత్‌లో అబ్బాయిలు–9.6%, అమ్మాయిలు–7.4% పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. వీరిలో 7.3% (అబ్బాయిలు–8.3%, అమ్మాయిలు–6.2%) పొగాకు పొగరూపంలో పీలుస్తున్నారు. 2.6% మంది సిగరెట్ల రూపంలో పొగ తాగుతున్నారు. 2.1% మంది బీడీల రూపంలో పొగ పీలుస్తున్నారు. 4.1% (అబ్బాయిలు–4.6%,అమ్మాయిలు–3.4 %) పొగలేని పొగాకు ఉత్పత్తులు వినియోగిస్తున్నారు.
సరదాగా మొదలై వ్యసనంగా...
‘వివిధ రూపాల్లో పొగాకు వినియోగం మొదట్లో తోటి విద్యార్థుల ›ప్రోద్బలం, ఒత్తిళ్లతో సరదాగా మొదలవుతుంది. ఇది అలవాటయ్యాక ఇతరుల నుంచి తప్పించుకుని రహస్యంగా స్మోకింగ్ కొనసాగిస్తారు. ఆ తర్వాత ఇతరుల ఎదుట ధైర్యంగా పొగతాగగలుగుతారు. ఈ అలవాటును తల్లిదండ్రులు ముందే నివారించాలి. మొదలుపెట్టినవారిని మానిపించేందుకు ప్రయత్నించాలి’అని అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డాక్టర్స్ సెక్రటరీ జనరల్ డా.అభిషేక్ శుక్లా చెబుతున్నారు.
అత్యల్ప పొగాకు వినియోగంలో టాప్–10 రాష్ట్రాలు...
► హిమచల్‌ప్రదేశ్–1.1శాతం
► కర్ణాటక–1.2
►గోవా–2.1
► దాద్రా, నగరహవేలి–2.4
►ఆంధ్రప్రదేశ్–2.6
► చంఢీగఢ్–3.0
► కేరళ–3.2
►హరియాణ–3.8
►మధ్యప్రదేశ్–3.9
► రాజస్థాన్–4.1
తెలంగాణ–5.2 శాతంతో 17వ స్థానంలో నిలిచింది.
అత్యధిక పొగాకు వినియోగంలో టాప్–10 రాష్ట్రాలు...
► మిజోరామ్–57.9 శాతం
►అరుణాచల్‌ప్రదేశ్–57.9
► నాగాలాండ్–42.6
► మేఘాలయా–33.6
►సిక్కిం–24.8
►యూపీ–22.9
► మణిపూర్–19.5
► ఉత్తరాఖండ్–18.5
► అస్సాం–11.9
►జమ్మూ,కశ్మీర్–లఢాక్–11.2
పొగ తాగుతున్న ప్రదేశాలు
►ఇళ్ల దగ్గర–23.5 శాతం
►స్కూళ్ల వద్ద–19.5
►స్నేహితుల ఇళ్ల వద్ద–16.7
►ఫంక్షన్లు, కార్యక్రమాల్లో–8.7
►బహిరంగప్రదేశాల్లో–12.2
► ఇతరచోట్ల–19.4 శాతం
Comments
Please login to add a commentAdd a comment