సాక్షి, అమరావతి: పొగాకు మనుషుల పాలిట పగాకులా మారింది. విచ్చలవిడి ధూమపానం అనారోగ్య చీకట్లలోకి నెట్టేస్తుంటే.. పొగాకు గుట్కా, ఖైనీ మనుషుల ప్రాణాలను చిదిమేస్తున్నాయి. దేశంలో ప్రతి ఆరు కుటుంబాలకు ఒక కుటుంబంలోని ఒకరు అంతకంటే ఎక్కువ మంది పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నట్టు కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సంస్థ లోకల్ సర్కిల్ సర్వేలో వెల్లడైంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ధూమపానం, పొగాకు ఉత్పత్తులు విస్తృత స్థాయిలో అందుబాటులో ఉన్నట్టు గుర్తించింది. దశాబ్దం క్రితం దేశంలో గుట్కాను నిషేధించినప్పటికీ పాన్‌మసాలా ముసుగులో అనేక కంపెనీలు ఇప్పటికీ వాటిని తయారు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ క్రమంలోనే సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు తమ ప్రాంతంలో విరివిగా పొగాకు ఉత్పత్తులు లభిస్తున్నాయని.. దీనిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరడం గమనార్హం.
ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల మంది మృత్యువాత
పొగాకు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను.. మరీముఖ్యంగా నోటి క్యాన్సర్‌ను కలిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 80 లక్షల కంటే ఎక్కువ మంది పొగాకు ఉత్పత్తుల వినియోగంతో మృత్యువాత పడుతున్నారు. భారత్‌లో అయితే ఏటా మరణాల సంఖ్య 14 లక్షలుగా ఉంటోంది. వారణాసిలో ఇటీవల క్యాన్సర్ బాధితుల డేటా సేకరించగా.. 55 శాతం క్యాన్సర్లు పొగాకు వాడకంతో ముడిపడి ఉన్నాయని లాన్సెట్ నివేదిక పేర్కొంది.
పర్యావరణానికి హానికరంగా..
పొగాకు మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా పర్యావరణంపై కూడా ప్రతికూలత చూపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం ఏటా పొగాకు పరిశ్రమ వల్ల 600 మిలియన్ల చెట్లు, 2 లక్షల హెక్టార్ల అటవీ నిర్మూలన, 22 బిలియన్ టన్నుల నీటిని, 84 మిలియన్ టన్నుల కార్బన్‌ను కోల్పోవాల్సి వస్తోంది. విమానయాన పరిశ్రమ విడుదల చేసే హానికర వాయువుల్లో ఐదవ వంతు పొగాకు పరిశ్రమ నుంచి విడుదలవుతున్నాయి.
పొగాకు సాగులో పెద్ద మొత్తంలో పురుగు మందులు, ఎరువులు వాడకం నేల నాణ్యతను దెబ్బతీస్తూ.. జీవవైవిధ్యానికి ముప్పును తీసుకొస్తోంది. కాలి్చపడేసిన సిగరెట్ పీకలు భూమిలో విచ్ఛిన్నం కావడానికి ఏళ్లు సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సిగరెట్ ఖాళీ ప్యాకెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల ప్యాకింగ్‌లతో ప్లాస్టిక్ కాలుష్యం పెరిగిపోతోంది. ఏటా చైనా 2.6 బిలియన్లు, భారత్ 766 మిలియన్లు, బ్రెజిల్, జర్మనీలు 200 మిలియన్ల డాలర్లకుపైగా పొగాకు ఉత్పత్తుల చెత్తను శుభ్రం చేయడానికి ఖర్చు చేస్తున్నాయి.
పొగాకు ఉత్పత్తిలో మూడో స్థానం
భారతదేశం పొగాకు ఉత్పత్తుల్లో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఉత్పత్తిదారు, ఎగుమతిదారుగా ఉంది. ఇతర దేశాల మాదిరిగా కాకుండా భారత్‌లో సిగరెట్, చుట్ట(స్మోక్డ్ టుబాకో) కంటే గుట్కా, ఖైనీ (స్మోక్‌లెస్ టుబాకో) వినియోగం అధికంగా ఉంటోంది. దేశ జనాభాలో దాదాపు 21 శాతం (199.4 మిలియన్) ప్రజలు స్మోక్‌లెస్ టుబాకోను, 10.7 శాతం మంది (99.5 మిలియన్లు) పొగాకు ఉత్పత్తులను (స్మోక్డ్ టుబాకో) వినియోగిస్తున్నారు.
ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్, స్ట్రోక్, గుండె జబ్బులు, మధుమేహం వంటి అనారోగ్య ప్రమాదాలకు దారి తీస్తోంది. యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం క్యాన్సర్ నిర్ధారణ తర్వాత కూడా ధూమపానం చేసిన రోగుల్లో గుండె జబ్బులు రెట్టింపు అవుతున్నాయని, ధూమపానం మానేసిన వారిలో స్ట్రోక్ ప్రమాదం చాలా తక్కువని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment