tobacco Auction
-
పొగాకు వినియోగంలో వారే అధికం.. షాకింగ్ విషయాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పొగాకు ఉత్పత్తుల వినియోగంలో ప్రపంచస్థాయిలో అమ్మాయిలు అబ్బాయిలను మించిపోయారు. పాఠశాల స్థాయిలో ఇది ఎక్కువగా ఉంది. 15 ఏళ్లలోపు విద్యార్థులు వివిధ రూపాల్లో పొగాకు వినియోగానికి ఆకర్షితులవుతున్నారు. తోటి విద్యార్థులను చూసి సరదాగా మొదలుపెట్టినవారు ఆ తరువాత వ్యసనంగా మార్చుకుంటున్నారు. యువత టొబాకో వినియోగంపై గ్లోబల్ యూత్ టొబాకో నిర్వహించిన సర్వే ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచస్థాయిలో పొగాకు వినియోగంలో అబ్బాయిలు 22శాతం ఉంటే... అమ్మాయిలు 24శాతం. అంటే రెండు శాతం ఎక్కువగా అమ్మాయిలు పొగాకు ఉత్పత్తులను ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నారు. ధూమపానంలో కూడా అమ్మాయిలదే పైచేయి. మొత్తంగా 2.3శాతం విద్యార్థుల్లో– అమ్మాయిలు 2.7%, అబ్బాయిలు 1.9% పొగ తాగుతున్నారు. 12 శాతం విద్యార్థులు (13% అమ్మాయిలు, 12% అబ్బాయిలు) వివిధ పొగాకు ఉత్పత్తులను (స్మోక్లెస్ టొబాకో) ఉపయోగిస్తున్నారు. భారత్‌లో మేలు.. యువత పొగాకు వినియోగ పర్యవేక్షణకు ‘గ్లోబల్ టొబాకో సర్వేలెన్స్ సిస్టమ్’ప్రమాణాలకు అనుగుణంగా దేశంలో గ్లోబల్ యూత్ టొబాకో సర్వే–4 నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపిఎస్) దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి స్కూళ్లలో (550 ప్రభుత్వ, 450 ప్రైవేట్ పాఠశాలలు)ని దాదాపు లక్ష మంది (80 వేలకు పైగా 13–15 ఏళ్ల వయసున్న) విద్యార్థులపై సర్వే నిర్వహించింది. జాతీయస్థాయిలో 2003తో (16.9 శాతంతో) పోల్చితే దేశంలో ఈ వయసు పిల్లల్లో పొగాకు వినియోగం 2019లో 8.5 శాతానికి తగ్గినట్టుగా ఈ సర్వే వెల్లడించింది. మొత్తంగా చూస్తే... భారత్‌లో అబ్బాయిలు–9.6%, అమ్మాయిలు–7.4% పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. వీరిలో 7.3% (అబ్బాయిలు–8.3%, అమ్మాయిలు–6.2%) పొగాకు పొగరూపంలో పీలుస్తున్నారు. 2.6% మంది సిగరెట్ల రూపంలో పొగ తాగుతున్నారు. 2.1% మంది బీడీల రూపంలో పొగ పీలుస్తున్నారు. 4.1% (అబ్బాయిలు–4.6%,అమ్మాయిలు–3.4 %) పొగలేని పొగాకు ఉత్పత్తులు వినియోగిస్తున్నారు. సరదాగా మొదలై వ్యసనంగా... ‘వివిధ రూపాల్లో పొగాకు వినియోగం మొదట్లో తోటి విద్యార్థుల ›ప్రోద్బలం, ఒత్తిళ్లతో సరదాగా మొదలవుతుంది. ఇది అలవాటయ్యాక ఇతరుల నుంచి తప్పించుకుని రహస్యంగా స్మోకింగ్ కొనసాగిస్తారు. ఆ తర్వాత ఇతరుల ఎదుట ధైర్యంగా పొగతాగగలుగుతారు. ఈ అలవాటును తల్లిదండ్రులు ముందే నివారించాలి. మొదలుపెట్టినవారిని మానిపించేందుకు ప్రయత్నించాలి’అని అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డాక్టర్స్ సెక్రటరీ జనరల్ డా.అభిషేక్ శుక్లా చెబుతున్నారు. అత్యల్ప పొగాకు వినియోగంలో టాప్–10 రాష్ట్రాలు... ► హిమచల్‌ప్రదేశ్–1.1శాతం ► కర్ణాటక–1.2 ►గోవా–2.1 ► దాద్రా, నగరహవేలి–2.4 ►ఆంధ్రప్రదేశ్–2.6 ► చంఢీగఢ్–3.0 ► కేరళ–3.2 ►హరియాణ–3.8 ►మధ్యప్రదేశ్–3.9 ► రాజస్థాన్–4.1 తెలంగాణ–5.2 శాతంతో 17వ స్థానంలో నిలిచింది. అత్యధిక పొగాకు వినియోగంలో టాప్–10 రాష్ట్రాలు... ► మిజోరామ్–57.9 శాతం ►అరుణాచల్‌ప్రదేశ్–57.9 ► నాగాలాండ్–42.6 ► మేఘాలయా–33.6 ►సిక్కిం–24.8 ►యూపీ–22.9 ► మణిపూర్–19.5 ► ఉత్తరాఖండ్–18.5 ► అస్సాం–11.9 ►జమ్మూ,కశ్మీర్–లఢాక్–11.2 పొగ తాగుతున్న ప్రదేశాలు ►ఇళ్ల దగ్గర–23.5 శాతం ►స్కూళ్ల వద్ద–19.5 ►స్నేహితుల ఇళ్ల వద్ద–16.7 ►ఫంక్షన్లు, కార్యక్రమాల్లో–8.7 ►బహిరంగప్రదేశాల్లో–12.2 ► ఇతరచోట్ల–19.4 శాతం -
లోగ్రేడ్.. లో రేట్
కందుకూరు: అసలే ప్రకృతి వైపరీత్యాలతో పొగాకు నాణ్యత తగ్గింది. దానికి తోడు కరోనా వైరస్ పుణ్యమా అంటూ 50 రోజులకు పైగా వేలం నిలిచిపోయింది. అంతంత మాత్రంగా ఉన్న నాణ్యత కాస్త వేలం విరామంతో మరికాస్త దిగజారింది. రంగు మారి బ్రైట్‌గ్రేడ్ రకం కూడా లోగ్రేడ్ రకంలోకి మారిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో ఈ ఏడాది రైతుల వద్ద లోగ్రేడ్ ఉత్పత్తులే అధికంగా ఉన్నాయి. కానీ వీటిని అమ్ముకోవాలంటే రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వేలం కేంద్రాలకు తీసుకొచ్చిన లోగ్రేడ్ పొగాకు బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేయరు. ఒకవేళ కొనుగోలు చేసినా ధర రాదు. ఇదీ ప్రస్తుతం పొగాకు రైతులు ఎదుర్కొంటున్న దుస్థితి. జిల్లాలో ఈ ఏడాది మొత్తం 91.78 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయింది. దాంట్లో ఇప్పటి వరకు 31.5 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేశారు. లోగ్రేడ్ రకం కొనుగోలు చేయని వ్యాపారులు: ఈ ఏడాది వేలం ప్రారంభంలోనే పొగాకు నాణ్యతపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. బ్రైట్‌గ్రేడ్ కేవలం 40 శాతం మాత్రమే వచ్చిందనేది బోర్డు అధికారుల అంచనా. డిసెంబర్, జనవరి నెలల్లో కురిసిన అకాల వర్షాల వల్ల పొగాకు నాణ్యత దెబ్బతిని క్యూరింగ్‌లో మీడియం, లోగ్రేడ్ రకం ఉత్పత్తులు అధికంగా వచ్చాయి. దాదాపు 50 శాతం వరకు లోగ్రేడ్ ఉత్పత్తులు వచ్చాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వేలంలో లోగ్రేడ్ రకం ఉత్పత్తులకు సరైన ధర దక్కితేనే రైతులు నష్టాల నుంచి బయటపడగలరు. కానీ పొగాకు వేలంలో పరిస్థితి పూర్తి భిన్నంగా నడుస్తోంది. బ్రైట్‌గ్రేడ్ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు మొగ్గు చూపుతున్నారే తప్పా లోగ్రేడ్ రకం పొగాకును కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. వేలానికి తీసుకొచ్చిన బేళ్లను కొనుగోలు చేయకపోవడంతో రైతులు తిరిగి ఇంటికి తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతి వేలం కేంద్రంలో రోజూ వందల సంఖ్యలో లోగ్రేడ్ బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. ఉదాహరణకు కందుకూరు ఒకటో వేలం కేంద్రంలో శనివారం 784 బేళ్లను వేలానికి ఉంచితే 634 కొనుగోలు చేయగా 150 బేళ్లను తిరస్కరించారు. అలాగే రెండవ వేలం కేంద్రంలో 719 బేళ్లను గాను 609 కొనుగోలు చేయగా 110 బేళ్లను తిరస్కరించారు. ప్రతి రోజు ఇదే తీరుగా వందల సంఖ్యలో బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. దీని వల్ల రైతులకు అదనపు భారంగా మారుతోంది. వేలానికి తీసుకొచ్చిన బేళ్లను తిరిగి ఇంటికి తీసుకెళ్లడం ఒకెత్తు అయితే తిరిగి తమ క్లస్టర్ వంతు వచ్చే వరకు వేచిచూడాల్సిన వస్తోంది. ఒక క్లస్టర్ వంతు తిరిగి వేలానికి రావాలంటే కనీసం నెల రోజులకుపైగానే పడుతోంది. ఇలా బేళ్లను ఇంటిలోనే ఉంచుకోవడం వల్ల ఆ ఉత్పత్తుల నాణ్యత మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక ధర విషయం మరీ దారుణంగా ఉంది. లోగ్రేడ్ ఉత్పత్తుల విషయంలో సిండికేట్‌గా మారి న వ్యాపారులు గిరిగీసినట్లు ఒక రేటును దాటడం లేదు. కేవలం రూ.80 మాత్రమే చెల్లిస్తున్నారు. గత నెల రోజుల వేలం ప్రక్రియలో లోగ్రేడ్ రకం పొగాకుకు ఇదే ధర లభిస్తోంది. ఒక్క రూపాయి పెరగడం లేదు, తగ్గడం లేదు. అదీ లేకపోతే వేలంలో కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారు. దీంతో ఈ ఏడాది అధికంగా ఉన్న లోగ్రేడ్ ఉత్పత్తులను అమ్ముకోవడం రైతులకు గగనంగా మారుతోంది. అమ్ముకున్నా వ్యాపారులు చెప్పిన రేటుకు ఇచ్చేయాల్సిందే. వేలం ఆలస్యంతో మరింత నష్టం: కరోనా వైరస్ లేకుంటే ఇప్పటికే వేలం ప్రక్రియ చివరి దశలో ఉండేది. కానీ ఈ ఏడాది ఇంకా మరో రెండు నెలలకు వేలం ముగిసినా ముగిసినట్టే. ప్రస్తుతం కొనుగోలు చేసిన ఉత్పత్తులు ఇంకా మిగిలిన ఉత్పత్తులే ఇందుకు నిదర్శనం. కందుకూరు ఒకటో వేలం కేంద్రంలో 8.4 మిలియన్లు, రెండవ వేలం కేంద్రంలో 7.2 మిలియన్ల వరకు అధికారిక కొనుగోళ్లు జరగాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు దాదాపు 3 మిలియన్ల ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేశారు. ఇవిపోను అనధికారిక ఉత్పత్తులు కూడా ఉంటాయి. అంటే ఇంకెంత సమయం పడుతుందో ఊహించవచ్చు. దీని వల్ల ఉత్పత్తుల రంగు మారి అంతిమంగా రైతులకు నష్టం చేకూరుతుంది. అసలే లోగ్రేడ్ కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఇష్టపడడం లేదు. ఈ పరిణామం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం బ్రైట్ గ్రేడ్ రూ.200లకు కొనుగోలు చేస్తున్నా, లోగ్రేడ్ రూ.80లు దాటడం లేదు. దీంతో సరాసరి రేట్లు కూడా రూ.140లు మించి రావడం లేదు. ప్రత్యక్ష వేలంలోకి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా పొగాకు వేలంలో మార్క్‌ఫెడ్ ద్వారా ప్రత్యక్షంగా పాల్గొనేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జులై 1వ తేదీ నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. ప్రధానంగా వ్యాపారులు కూటమిగా మారి ధరలు పెంచకపోవడం, లోగ్రేడ్ ఉత్పత్తులను తిరస్కరిస్తుండడంతో ప్రభుత్వం వేలంలోకి అడుగు పెడుతోంది. రేట్లు రాని ఉత్పత్తులను రైతులకు మద్దతు ధర వచ్చేలా వేలంలో మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తుంది. అంటే లోగ్రేడ్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల వ్యాపారులు కూడా కచ్చితంగా లోగ్రేడ్ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే బోర్డు పరిధిలో రిజిస్టర్ అయి వేలంలో పాల్గొనని వ్యాపారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో వేలంలో పాల్గొనే వ్యాపారుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇలా మొత్తం మీద ప్రభుత్వమే స్వయంగా పొగాకు వేలంలోకి రావడం వల్ల ధరలు పెరుతాయనే ఆశాభావం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ వ్యాపారులు ధరలు పెంచేందుకు ముందుకు రాకపోయినా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. దీని వల్ల ఇక రైతులు నష్టపోయే అవకాశం లేకుండా ఉంటుంది. అన్ని రకాల ఉత్పత్తులను మద్దతు ధరలకు వేలం కేంద్రాల్లోనే నేరుగా అమ్ముకునే అవకాశం వస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పొగాకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఆశలన్నీ ధరలపైనే..
►నేటి నుంచి పొగాకు వేలం ►12 కేంద్రాల్లో ప్రారంభం కానున్న కొనుగోళ్లు ►ఏర్పాట్లు పూర్తి చేసిన టుబాకో బోర్డు అధికారులు ► సరాసరి ధర కిలోకి రూ.135 కోరుతున్న రైతులు ఈ ఏడాది పొగాకు వేలానికి రంగం సిద్ధమైంది. ప్రకృతి ప్రతికూలతల మధ్య శ్రమించి సాగు చేసిన పంటను అమ్ముకునేందుకు రైతులు సిద్ధమయ్యారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది సాగుతో పాటు, ఉత్పత్తి కూడా తగ్గడంతో ధరలపైనే కోటి ఆశలు పెట్టుకున్నారు. పెరిగిన సాగు ఖర్చులు, రెండేళ్ల నుంచి వరుస నష్టాల నేపథ్యంలో ఈసారైనా మద్దతు ధర దక్కుతుందో లేదోననే సంశయంతో ఉన్నారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న వేలంలో అన్ని రకాల పొగాకుకు సరాసరి మద్దతు ధర రూ.135 ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒంగోలు టూటౌన్ /కందుకూరు : జిల్లాలో బుధవారం నుంచి పొగాకు అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 28,022 మంది పొగాకు రైతులు ఉండగా.. 21,137 బ్యారన్లు ఉన్నాయి. మొత్తం 14 వేలం కేంద్రాలు ఉండగా వాటిలో రెంటిని ఈ ఏడాది కుదించారు. పొదిలి–1, 2 కేంద్రాలను కలిపి ఒకే కేంద్రంగా ఏర్పాటు చేశారు. అలాగే వెల్లంపల్లి –1, 2 కేంద్రాలను కూడా కలిపి ఒక వేలం కేంద్రం చేశారు. దీంతో 14 ప్లాట్‌ఫారాలు కాస్త 12 వేలం కేంద్రాలయ్యాయి. కందుకూరు–1, కందుకూరు–2, ఒంగోలు–1, ఒంగోలు–2, టంగుటూరు–1, టంగుటూరు–2, కనిగిరి, కొండపి, కలిగిరి, డీసీపల్లి, వేలం కేంద్రాల్లో బుధవారం నుంచి అమ్మకాలు ప్రారంభించేందుకు బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వీటిలో కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాలు నెల్లూరు జిల్లా పరిధిలో పనిచేస్తున్నాయి. 82 మిలియన్ కిలోలకు అనుమతి..ఈ ఏడాది ప్రతికూల వాతావరణంలో రైతులు పొగాకు పంటను సాగు చేశారు. జిల్లాలో మొత్తం 82 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతిచ్చింది. ఇందులో ఎస్ఎల్ఎస్ పరిధిలో 40.5 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతివ్వగా 23 మిలియన్ కిలోల ఉత్పత్తి మాత్రమే వచ్చే అవకాశం ఉందని టుబాకో బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు జిల్లాలో ఉన్న ప్రతికూల వాతావరణం దెబ్బకు ఇంకా తగ్గే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు. ఎస్బీఎస్ పరిధిలో 42 మిలియన్ ఆథరైజ్డ్ ఇవ్వగా ప్రస్తుత పరిస్థితిని బట్టి 30 నుంచి 32 మిలియన్ కిలోల పంట ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా. అదే విధంగా రైతు ప్రతినిధులు, రైతులు కూడా ఇదే అంచనాతో ఉన్నారు. గత నాలుగేళ్లుగా పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో పాలకులు విఫలమైన కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చాలా మంది అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయినా అటు బోర్డులోనూ, ఇటు పాలకుల్లో మార్పు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో బోర్డు కూడా పంట ఉత్పత్తిని ఏటా తగ్గించుకుంటూ వస్తోంది. బ్రెజిల్, జింబాబ్వే, టాంజినియా, అమెరికా దేశాలలో పొగాకు ఉత్పత్తి బారీగా పెరగటం, ప్రపంచ వ్యాప్తంగా సిగరెట్ల వాడకం తగ్గడం వలన పొగాకుకు గిరాకీ పడిపోయింది. దీంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి నెలకొంది. వాస్తవ పరిస్థితిని గమనించిన కేంద్రం 2014–15 నుంచి పొగాకును తగ్గించేందుకు వ్యూహం పన్నింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 172 మిలియన్ కిలోల పంట ఉత్పత్తిని క్రమేణా తగ్గించుకుంటూ వస్తోంది. మరుసటి ఏటా 120 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతిచ్చింది. దీంట్లో ఒక్క ప్రకాశం జిల్లాలోనే 82 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి అనుమతిచ్చింది. వర్షాభావ పరిస్థితుల్లో పంట సాగు చేయడం వలన ఖర్చులు పెరిగాయి. దీనికి తోడు ఆలస్యంగా నాట్లు వేయడంతో పంట నాణ్యత, దిగుబడి బాగా తగ్గింది. ఒక్కొక్క బ్యారన్‌కు రైతులు రూ.5 లక్షల వరకు ఖర్చు చేశారు. నుంచి ప్రారంభమయ్యే వేలం కేంద్రాలను పొగాకు రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్బీఎస్ ఆర్ఎం ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రారంభ ధర రూ.170 ఇవ్వాలి...: బుధవారం నుంచి ప్రారంభమయ్యే వేలం కేంద్రాలలో ఎఫ్–1 గ్రేడ్ రకానికి రూ.160 నుంచి రూ.170 వరకు రేట్ ఇవ్వాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్–2 గ్రేడ్‌కు రూ.150 నుంచి రూ.160 వరకు రేట్ ఇచ్చే విధంగా చూడాలని రైతులు మంగళవారం ఎస్బీఎస్ ఆర్ఎం ఉమామహేశ్వరరావుకు వినతిపత్రం ఇచ్చారు. మిగిలిన గ్రేడ్లకు (లోగ్రేడ్, మీడియం గ్రేడ్లకు) రూ.100 నుంచి రూ.140 తగ్గకుండా రేట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సరాసరి రూ.135 ఉండేటట్లుచూడాలని విజ్ఞప్తి చేశారు. వేలం కేంద్రాలు ప్రారంభమయిన రోజునే నిర్ణయించిన రేట్లు అమలు చేయాలని తెలిపారు. ఇదే విషయాన్ని ఇటీవల జిల్లాకు వచ్చిన పొగాకు బోర్డు ఇన్చార్జీ సెక్రటరీ పట్నాయక్‌కు విన్నవించారు. మరీ రైతులకు గిట్టుబాటు ధర వస్తుందో లేదో బుధవారం వరకు వేచి చూడాలి. -
వేలానికి రంగం సిద్ధం
కందుకూరు, న్యూస్‌లైన్: ఈ ఏడాది పొగాకు వేలానికి రేపటితో తెరలేవనుంది. మొదటి విడతగా జిల్లాలో 8 వేలం కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పొగాకు రైతులు మద్దతు ధరపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది పొగాకు నాణ్యతతో పాటు, మార్కెట్ కొంత ఆశాజనకంగా ఉండడం రైతులకు కొంత ఊరటనిచ్చే అంశం. అయితే ఏటా పెరుగుతున్న సాగు ఖర్చులనేపథ్యంలో గత ఏడాది కంటే మరికొంత ధరలు పెంచాల్సిన అవసరం ఉందని రైతులతో పాటు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రారంభం కానున్న వేలం కేంద్రాలివీ.. జిల్లాలో పొగాకు బోర్డు పరిధిలో ఒంగోలు, గుంటూరు రీజియన్లు ఉన్నాయి. వీటిలో ఒంగోలు రీజియన్ పరిధిలో ఒంగోలు-1,2 , టంగుటూరు-1,2, కందుకూరు-1,2, కొండపి, నె ల్లూరు జిల్లాలోని కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాలున్నాయి. ఇక గుంటూరు రీజియన్ పరిధిలో పొదిలి-1,2, వెల్లంపల్లి-1,2 వేలం కేంద్రాలున్నాయి. వీటిలో సోమవారం నుంచి ఒంగోలు-1, కందుకూరు-1,2, పొదిలి-1,2, కొండపి, కలిగిరి, డీసీ పల్లి వేలం కేంద్రాలను ప్రారంభించేందుకు బోర్డు అధికారులు ఏర్పాట్లు చేశారు. మిగిలిన వేలం కేంద్రాలను వచ్చే నెలలో ప్రారంభిస్తామని అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ సీజన్ మద్దతు ధరపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. మరోపక్క ఈ ఏడాది వాతావరణం అనుకూలించి ఎన్నడూ లేనంతగా మంచి దిగుబడి వచ్చింది. భారీగా పెరిగిన సాగు విస్తీర్ణం... గత సీజన్లో వచ్చిన ఆశాజనకమైన ధరలతో రైతులు ఈ ఏడాది పొగాకు పంటను భారీగా సాగు చేస్తారని అధికారులు వేసిన అంచనాలే నిజమయ్యాయి. సాగు విస్తీర్ణం పెరగడంతో అనుమతించిన దానికంటే అధిక మొత్తం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఒంగోలు రీజియన్ పరిధిలో 71 మిలియన్ కేజీల పొగాకును పండించేందుకు బోర్డు అనుమతిచ్చింది. కానీ 82.6 మిలియన్ కేజీలను రైతులు పండించారు. అదే ఈ ఏడాది 73 మిలియన్ కేజీలు పండించుకునేందుకు అనుమతిస్తే ఉత్పత్తి 91 మిలియన్ కేజీల వరకు ఉండవచ్చనని అంచనా వేస్తున్నారు. దాదాపు 62 వేల హెక్టార్లకు పైగా పొగాకు సాగైంది. ఈ నేపథ్యంలో ధరలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. అధికారులు మాత్రం మార్కెట్ ఆశాజనకంగానే ఉన్నందున మద్దతు ధరకు ఏ ఇబ్బందీ ఉండకపోవచ్చని చెప్తున్నారు. సరాసరి ధర పెంచాలి... ఏడాదికేడాది పెరుగుతున్న సాగు ఖర్చులను దృష్టిలో ఉంచుకుని మద్దతు ధరను కూడా వ్యాపారులు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నాణ్యమైన ఉత్పత్తి రావడంతో సరైన ధరలు చెల్లించాలని కోరుతున్నారు. గత ఏడాది రీజియన్ పరిధిలో కేజీకి 99ల సరాసరి ధ ర వచ్చింది. అయితే ప్రస్తుతం సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో 125ల సరాసరి ధరను కేజీకి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విధంగా ఇవ్వకపోతే రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు. అలాగే కేజీ అత్యధిక ధరపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. గత ఏడాది ఒంగోలు వేలం కేంద్రాల పరిధిలో కేజీ 160లకు పైగానే వచ్చింది. మిగిలిన వేలం కేంద్రాల్లో 120 నుంచి 125ల అత్యధిక ధర వచ్చింది. గత ఏడాది రైతులు సగం వరకు అమ్ముకున్న తరువాత ఒంగోలు కేంద్రాల పరిధిలో అత్యధిక ధరలు రావడంతో రైతులకు నిరాశే ఎదురైంది. అలాగే పొదిలి వేలం కేంద్రాల రైతులు మద్దతు ధర కోసం గత ఏడాది మొత్తం పోరాటాలు చేయాల్సి వచ్చింది. జిల్లా మొత్తం రైతులకు అనుకూల ధరలు వస్తే ఒక్క పొదిలిలో రైతులకు ఏమాత్రం గిట్టుబాటు ధరలు రాలేదు. వేలం చివరి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ఉత్పత్తిలో నాణ్యత తగ్గడంతో కొనుగోలు చేయలేమని వ్యాపారులు చెప్పుకొచ్చారు. అయితే ఈ ఏడాది అంచనాలకు మించి నాణ్యమైన ఉత్పత్తులు రావడంతో ధరలు కూడా అదేవిధంగా ఉంటాయని రైతులు ఆశిస్తున్నారు. మొత్తం హై గ్రేడే... అనుకున్న విధంగానే ఈ ఏడాది రైతులకు అన్నీ అనుకూలించినా మరో అంశం కలవర పరుస్తోంది. సాధారణంగా ఉత్పత్తిలో నాణ్యత తగ్గితే బాధపడాలి. ఈ ఏడాది అనుకున్న దానికి కంటే నాణ్యమైన ఉత్పత్తి రావడమే రైతులను, అధికారులను కలవరపరిచే అంశం. జిల్లా వ్యాప్తంగా దాదాపు 90 శాతం పంట హై గ్రేడ్ ఉత్పత్తే వచ్చింది. దీంతో లోగ్రేడ్, మీడియం గ్రేడ్ అనేవి లేకుండా పోయాయి. మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాని నేపథ్యంలో మార్కెట్లో లో గ్రేడ్‌కు డిమాండ్ ఉంటే ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని బోర్డు అధికారులు లెక్కలు వేస్తున్నారు. దీనికి ప్రధానంగా ఒక్క మన జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హై గ్రేడ్ పొగాకు ఉత్పత్తి వచ్చిందని చెప్తున్నారు. దీంతో వ్యాపారులు కోరిన ఉత్పత్తులు లేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ-వేలం ద్వారానే కొనుగోలు గత ఏడాది నుంచి పొగాకు వేలంలో ప్రవేశపెట్టిన ఈ-వేలం విధానాన్నే ఈ ఏడాది కూడా అమలు చేయనున్నారు. వేలంలో అవకతవకలను పూర్తిగా నిరోధించడంతో పాటు, త్వరగా ముగించేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది. సోమవారం వేలం ప్రారంభం కానున్న మొత్తం 8 కేంద్రాల్లో ఈ-వేలాన్ని అమలు చేయనున్నారు.