కందుకూరు, న్యూస్‌లైన్: ఈ ఏడాది పొగాకు వేలానికి రేపటితో తెరలేవనుంది. మొదటి విడతగా జిల్లాలో 8 వేలం కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పొగాకు రైతులు మద్దతు ధరపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది పొగాకు నాణ్యతతో పాటు, మార్కెట్ కొంత ఆశాజనకంగా ఉండడం రైతులకు కొంత ఊరటనిచ్చే అంశం. అయితే ఏటా పెరుగుతున్న సాగు ఖర్చులనేపథ్యంలో గత ఏడాది కంటే మరికొంత ధరలు పెంచాల్సిన అవసరం ఉందని రైతులతో పాటు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రారంభం కానున్న వేలం కేంద్రాలివీ..
జిల్లాలో పొగాకు బోర్డు పరిధిలో ఒంగోలు, గుంటూరు రీజియన్లు ఉన్నాయి. వీటిలో ఒంగోలు రీజియన్ పరిధిలో ఒంగోలు-1,2 , టంగుటూరు-1,2, కందుకూరు-1,2, కొండపి, నె ల్లూరు జిల్లాలోని కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాలున్నాయి. ఇక గుంటూరు రీజియన్ పరిధిలో పొదిలి-1,2, వెల్లంపల్లి-1,2 వేలం కేంద్రాలున్నాయి. వీటిలో సోమవారం నుంచి ఒంగోలు-1, కందుకూరు-1,2, పొదిలి-1,2, కొండపి, కలిగిరి, డీసీ పల్లి వేలం కేంద్రాలను ప్రారంభించేందుకు బోర్డు అధికారులు ఏర్పాట్లు చేశారు. మిగిలిన వేలం కేంద్రాలను వచ్చే నెలలో ప్రారంభిస్తామని అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ సీజన్ మద్దతు ధరపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. మరోపక్క ఈ ఏడాది వాతావరణం అనుకూలించి ఎన్నడూ లేనంతగా మంచి దిగుబడి వచ్చింది.
భారీగా పెరిగిన సాగు విస్తీర్ణం...
గత సీజన్‌లో వచ్చిన ఆశాజనకమైన ధరలతో రైతులు ఈ ఏడాది పొగాకు పంటను భారీగా సాగు చేస్తారని అధికారులు వేసిన అంచనాలే నిజమయ్యాయి. సాగు విస్తీర్ణం పెరగడంతో అనుమతించిన దానికంటే అధిక మొత్తం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఒంగోలు రీజియన్ పరిధిలో 71 మిలియన్ కేజీల పొగాకును పండించేందుకు బోర్డు అనుమతిచ్చింది. కానీ 82.6 మిలియన్ కేజీలను రైతులు పండించారు.
అదే ఈ ఏడాది 73 మిలియన్ కేజీలు పండించుకునేందుకు అనుమతిస్తే ఉత్పత్తి 91 మిలియన్ కేజీల వరకు ఉండవచ్చనని అంచనా వేస్తున్నారు. దాదాపు 62 వేల హెక్టార్‌లకు పైగా పొగాకు సాగైంది. ఈ నేపథ్యంలో ధరలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. అధికారులు మాత్రం మార్కెట్ ఆశాజనకంగానే ఉన్నందున మద్దతు ధరకు ఏ ఇబ్బందీ ఉండకపోవచ్చని చెప్తున్నారు.
సరాసరి ధర పెంచాలి...
ఏడాదికేడాది పెరుగుతున్న సాగు ఖర్చులను దృష్టిలో ఉంచుకుని మద్దతు ధరను కూడా వ్యాపారులు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నాణ్యమైన ఉత్పత్తి రావడంతో సరైన ధరలు చెల్లించాలని కోరుతున్నారు. గత ఏడాది రీజియన్ పరిధిలో కేజీకి 99ల సరాసరి ధ ర వచ్చింది. అయితే ప్రస్తుతం సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో 125ల సరాసరి ధరను కేజీకి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విధంగా ఇవ్వకపోతే రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు. అలాగే కేజీ అత్యధిక ధరపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. గత ఏడాది ఒంగోలు వేలం కేంద్రాల పరిధిలో కేజీ 160లకు పైగానే వచ్చింది. మిగిలిన వేలం కేంద్రాల్లో 120 నుంచి 125ల అత్యధిక ధర వచ్చింది.
గత ఏడాది రైతులు సగం వరకు అమ్ముకున్న తరువాత ఒంగోలు కేంద్రాల పరిధిలో అత్యధిక ధరలు రావడంతో రైతులకు నిరాశే ఎదురైంది. అలాగే పొదిలి వేలం కేంద్రాల రైతులు మద్దతు ధర కోసం గత ఏడాది మొత్తం పోరాటాలు చేయాల్సి వచ్చింది. జిల్లా మొత్తం రైతులకు అనుకూల ధరలు వస్తే ఒక్క పొదిలిలో రైతులకు ఏమాత్రం గిట్టుబాటు ధరలు రాలేదు. వేలం చివరి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ఉత్పత్తిలో నాణ్యత తగ్గడంతో కొనుగోలు చేయలేమని వ్యాపారులు చెప్పుకొచ్చారు. అయితే ఈ ఏడాది అంచనాలకు మించి నాణ్యమైన ఉత్పత్తులు రావడంతో ధరలు కూడా అదేవిధంగా ఉంటాయని రైతులు ఆశిస్తున్నారు.
మొత్తం హై గ్రేడే...
అనుకున్న విధంగానే ఈ ఏడాది రైతులకు అన్నీ అనుకూలించినా మరో అంశం కలవర పరుస్తోంది. సాధారణంగా ఉత్పత్తిలో నాణ్యత తగ్గితే బాధపడాలి. ఈ ఏడాది అనుకున్న దానికి కంటే నాణ్యమైన ఉత్పత్తి రావడమే రైతులను, అధికారులను కలవరపరిచే అంశం. జిల్లా వ్యాప్తంగా దాదాపు 90 శాతం పంట హై గ్రేడ్ ఉత్పత్తే వచ్చింది. దీంతో లోగ్రేడ్, మీడియం గ్రేడ్ అనేవి లేకుండా పోయాయి. మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాని నేపథ్యంలో మార్కెట్‌లో లో గ్రేడ్‌కు డిమాండ్ ఉంటే ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని బోర్డు అధికారులు లెక్కలు వేస్తున్నారు. దీనికి ప్రధానంగా ఒక్క మన జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హై గ్రేడ్ పొగాకు ఉత్పత్తి వచ్చిందని చెప్తున్నారు. దీంతో వ్యాపారులు కోరిన ఉత్పత్తులు లేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఈ-వేలం ద్వారానే కొనుగోలు
గత ఏడాది నుంచి పొగాకు వేలంలో ప్రవేశపెట్టిన ఈ-వేలం విధానాన్నే ఈ ఏడాది కూడా అమలు చేయనున్నారు. వేలంలో అవకతవకలను పూర్తిగా నిరోధించడంతో పాటు, త్వరగా ముగించేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది. సోమవారం వేలం ప్రారంభం కానున్న మొత్తం 8 కేంద్రాల్లో ఈ-వేలాన్ని అమలు చేయనున్నారు.
వేలానికి రంగం సిద్ధం
Published Sun, Feb 16 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM
Advertisement
Advertisement