ఆశలన్నీ ధరలపైనే.. | tobacco formers expected good rate | Sakshi
Sakshi News home page

ఆశలన్నీ ధరలపైనే..

Published Wed, Mar 15 2017 11:03 AM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM

ఆశలన్నీ ధరలపైనే..

ఆశలన్నీ ధరలపైనే..

►నేటి నుంచి పొగాకు వేలం
►12 కేంద్రాల్లో ప్రారంభం కానున్న కొనుగోళ్లు 
►ఏర్పాట్లు పూర్తి చేసిన టుబాకో బోర్డు అధికారులు
► సరాసరి ధర కిలోకి రూ.135 కోరుతున్న రైతులు


ఈ ఏడాది పొగాకు వేలానికి రంగం సిద్ధమైంది. ప్రకృతి ప్రతికూలతల మధ్య శ్రమించి సాగు చేసిన పంటను అమ్ముకునేందుకు రైతులు సిద్ధమయ్యారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది సాగుతో పాటు, ఉత్పత్తి కూడా తగ్గడంతో ధరలపైనే కోటి ఆశలు పెట్టుకున్నారు. పెరిగిన సాగు ఖర్చులు, రెండేళ్ల నుంచి వరుస నష్టాల నేపథ్యంలో ఈసారైనా మద్దతు ధర దక్కుతుందో లేదోననే సంశయంతో ఉన్నారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న వేలంలో అన్ని రకాల పొగాకుకు సరాసరి మద్దతు ధర రూ.135 ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఒంగోలు టూటౌన్‌ /కందుకూరు : జిల్లాలో బుధవారం నుంచి పొగాకు అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 28,022 మంది పొగాకు రైతులు ఉండగా.. 21,137 బ్యారన్లు ఉన్నాయి. మొత్తం 14 వేలం కేంద్రాలు ఉండగా వాటిలో రెంటిని ఈ ఏడాది కుదించారు. పొదిలి–1, 2 కేంద్రాలను కలిపి ఒకే కేంద్రంగా ఏర్పాటు చేశారు. అలాగే వెల్లంపల్లి –1, 2 కేంద్రాలను కూడా కలిపి ఒక వేలం కేంద్రం చేశారు. దీంతో 14 ప్లాట్‌ఫారాలు కాస్త 12 వేలం కేంద్రాలయ్యాయి.

కందుకూరు–1, కందుకూరు–2, ఒంగోలు–1, ఒంగోలు–2, టంగుటూరు–1, టంగుటూరు–2, కనిగిరి, కొండపి, కలిగిరి, డీసీపల్లి, వేలం కేంద్రాల్లో బుధవారం నుంచి అమ్మకాలు ప్రారంభించేందుకు బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వీటిలో కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాలు నెల్లూరు జిల్లా పరిధిలో పనిచేస్తున్నాయి. 82 మిలియన్‌ కిలోలకు అనుమతి..ఈ ఏడాది ప్రతికూల వాతావరణంలో రైతులు పొగాకు పంటను సాగు చేశారు.  జిల్లాలో మొత్తం 82 మిలియన్‌ కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతిచ్చింది. ఇందులో ఎస్‌ఎల్‌ఎస్‌ పరిధిలో 40.5 మిలియన్‌ కిలోల ఉత్పత్తికి అనుమతివ్వగా 23 మిలియన్‌ కిలోల ఉత్పత్తి మాత్రమే వచ్చే అవకాశం ఉందని టుబాకో బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు జిల్లాలో ఉన్న ప్రతికూల వాతావరణం దెబ్బకు ఇంకా తగ్గే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు.

ఎస్‌బీఎస్‌ పరిధిలో 42 మిలియన్‌ ఆథరైజ్డ్‌ ఇవ్వగా ప్రస్తుత పరిస్థితిని బట్టి 30 నుంచి 32 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా. అదే విధంగా రైతు ప్రతినిధులు, రైతులు కూడా ఇదే అంచనాతో ఉన్నారు. గత నాలుగేళ్లుగా పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో పాలకులు విఫలమైన కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చాలా మంది అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయినా అటు బోర్డులోనూ, ఇటు పాలకుల్లో మార్పు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో బోర్డు కూడా పంట ఉత్పత్తిని ఏటా తగ్గించుకుంటూ వస్తోంది.

బ్రెజిల్, జింబాబ్వే, టాంజినియా, అమెరికా దేశాలలో పొగాకు ఉత్పత్తి బారీగా పెరగటం, ప్రపంచ వ్యాప్తంగా సిగరెట్ల వాడకం తగ్గడం వలన పొగాకుకు గిరాకీ పడిపోయింది. దీంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి నెలకొంది. వాస్తవ పరిస్థితిని గమనించిన కేంద్రం 2014–15 నుంచి పొగాకును తగ్గించేందుకు వ్యూహం పన్నింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 172 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తిని క్రమేణా తగ్గించుకుంటూ వస్తోంది. మరుసటి ఏటా 120 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతిచ్చింది. దీంట్లో ఒక్క ప్రకాశం జిల్లాలోనే 82 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తికి అనుమతిచ్చింది. వర్షాభావ పరిస్థితుల్లో పంట సాగు చేయడం వలన ఖర్చులు పెరిగాయి. దీనికి తోడు ఆలస్యంగా నాట్లు వేయడంతో పంట నాణ్యత, దిగుబడి బాగా తగ్గింది. ఒక్కొక్క బ్యారన్‌కు రైతులు రూ.5 లక్షల వరకు ఖర్చు చేశారు. నుంచి ప్రారంభమయ్యే వేలం కేంద్రాలను పొగాకు రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌బీఎస్‌ ఆర్‌ఎం ఉమామహేశ్వరరావు తెలిపారు.

ప్రారంభ ధర రూ.170 ఇవ్వాలి...: బుధవారం నుంచి ప్రారంభమయ్యే వేలం కేంద్రాలలో ఎఫ్‌–1 గ్రేడ్‌ రకానికి రూ.160 నుంచి రూ.170 వరకు రేట్‌ ఇవ్వాలని రైతు నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎఫ్‌–2 గ్రేడ్‌కు రూ.150 నుంచి రూ.160 వరకు రేట్‌ ఇచ్చే విధంగా చూడాలని రైతులు మంగళవారం ఎస్‌బీఎస్‌ ఆర్‌ఎం ఉమామహేశ్వరరావుకు వినతిపత్రం ఇచ్చారు. మిగిలిన గ్రేడ్‌లకు (లోగ్రేడ్, మీడియం గ్రేడ్‌లకు) రూ.100 నుంచి రూ.140 తగ్గకుండా రేట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సరాసరి రూ.135 ఉండేటట్లుచూడాలని  విజ్ఞప్తి చేశారు. వేలం కేంద్రాలు ప్రారంభమయిన రోజునే నిర్ణయించిన రేట్లు అమలు చేయాలని తెలిపారు. ఇదే విషయాన్ని ఇటీవల జిల్లాకు వచ్చిన  పొగాకు బోర్డు ఇన్‌చార్జీ సెక్రటరీ పట్నాయక్‌కు విన్నవించారు. మరీ రైతులకు గిట్టుబాటు ధర వస్తుందో లేదో బుధవారం వరకు వేచి చూడాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement