మిర్చి రైతు కన్నెర్ర!
► గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన రైతులు
► చిల్లర సాయంతో రైతుకు వనగూరేది శూన్యం
► మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వమే మిర్చి కొనుగోలు చేయాలి
► రైతులు, రైతు సంఘాల నేతల డిమాండ్
► ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద హైవేపై బైఠాయింపు
► పంటను దహనం చేసి నిరసన
గిట్టుబాటు ధర కోసం రెండు నెలలుగా డిమాండ్ చేస్తున్నా పాలకులు పట్టించుకోలేదని మిర్చిరైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకొంటూనే రైతుల్ని మోసగిస్తున్నారని మండిపడ్డారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని, ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే సర్కారు చోద్యం చూస్తోందని ఆందోళనకు దిగారు. సోమవారం ఒంగోలు వ్యవసాయ మార్కెట్‌కమిటీ వద్ద రైతులు, రైతులు సంఘ నాయకులు రాస్తారోకో చేశారు. రహదారిపై మిర్చిని దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రైతులు పండించిన మిర్చి పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం క్వింటాకు రూ.1,500 ఇస్తామంటూ చేతులు దులుపుకునే ప్రయత్నానికి దిగడంపై రైతులు, రైతు సంఘ నాయకులు మండిపడుతున్నారు. బాబు సర్కారు ఇస్తామన్న చిల్లర పైసల వల్ల రైతులకు వనగూరే ప్రయోజనం ఏమి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణం ప్రభుత్వమే నాఫెడ్, మార్క్‌ఫెడ్‌ల ద్వారా మిర్చి కొనుగోళ్లు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కనీసం ఇచ్చే రూ.1,500 సాయంతోనైనా ప్రభుత్వమే మిర్చి కొనుగోలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
నేరుగా కొంటేనే మిర్చి రైతకు మేలు..
ప్రభుత్వరంగ సంస్థలు నేరుగా మిర్చి కొనుగోళ్లకు దిగితే వ్యాపారులు సైతం అదే ధర ఇచ్చి మిర్చి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే రైతులకు మేలు చేకూరుతుంది. అలా కాకుండా వ్యాపారుల ద్వారానే మిర్చిని కొనుగోలు చేయించి కేవలం కొంత మంది రైతులకు రూ.1,500 సాయం మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెప్పడం వల్ల వ్యాపారులు మిర్చి ధరలను మరింతగా తగ్గించే అవకాశం ఉంది. అదే జరిగితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
ప్రభుత్వం మిర్చి కొనుగోలు చేయక కేవలం అరకొర సాయంతో సరిపెట్టడం వల్ల వ్యాపారులు మరింతగా ధరలు తగ్గించే పరిస్థితి ఉంటుందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. ఇలా జరిగితే ప్రభుత్వం రైతులకు కాకుండా వ్యాపారులకే సాయం అందించినట్లవుతుందని రైతులతో పాటు రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రూ.8వేల లోపు మార్కెట్ ధర ఉంటేనే రాయితీకి రైతులు అర్హులని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రస్తుతం తేజ రకం మిర్చి ధర మార్కెట్లో రూ.7,300 వరకు ఉంది.
రూ.8000 మార్కెట్ ధర ప్రకారం ఈ లెక్కన సదరు రైతుకు రూ.700 మించి ప్రభుత్వ సాయమందే అవకాశం లేదు. అలా కాకుండా మార్కెట్ ధరల మేరకు ప్రభుత్వమే కనీసం రూ.1,500 అదనంగా ఇచ్చి మొత్తం మిర్చిని కొనుగోలు చేస్తే రైతుకు కొంత మేరైనా ఉపయోగకరంగా ఉంటుంది.
ఎగుమతులకూ విఘాతం..
సంక్షోభం ఎదురైన 1998–99, 2004–05 సంత్సరాల్లో మార్క్‌ఫెడ్ ద్వారానే కొనుగోళ్లు చేశారు. దీంతో మార్కెట్‌తో పోటీగా ధరలు పెరిగాయి. 2007, 2014లో ఇలాంటి సంక్షోభంలోనే ప్రభుత్వం శనగలను కొనుగోలు చేసింది. ఆ తర్వాత ధరలు పెరిగిన సందర్భాలున్నాయి. అదే జరిగితే ప్రభుత్వానికి మంచి లాభం ఉంటుంది. రైతులకు అరకొర సాయం అందించి సరుకు కొనుగోలు చేయకపోవడం వల్ల పండించిన పంట ఎగుమతులు ఆగిపోయి కోల్డ్ స్టోరేజ్‌లకు పరిమితం కావాల్సి ఉంది.
ఇదే జరిగితే వచ్చే ఏడాది సాగుపై ఈ ప్రభావం ఉంటుంది. రైతులు తగిన మోతాదులో సదరు పంట సాగు చేసే అవకాశం ఉండదు. ప్రభుత్వమే మిర్చి కొనుగోళ్లు చేపట్టిన పక్షంలో ఎగుమతులకు అవకాశం ఉంటుంది. అలా జరిగితే ధరలు సైతం పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారులు పోటీ పడి సరుకు కొనే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం తక్షణం స్పందించి చిల్లర సాయం పక్కనపెట్టి స్వయంగా మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి మిర్చి కొనుగోలును చేపట్టాలని రైతులతో పాటు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కోత కూలీ వచ్చేలా లేదు..
జిల్లావ్యాప్తంగా లక్షా 50 వేల ఎకరాల్లో రైతులు మిరప సాగు చేశారు. పంట దిగుబడి తగ్గిన నేపథ్యంలో సగటున 7 నుంచి 8 క్వింటాళ్ల వరకు మిర్చి దిగుబడి వచ్చింది. గతేడాది బేడిగ రకం మిర్చి క్వింటా రూ.18 వేలు ఉండగా, తేజ రకం మిర్చి రూ.13 వేల వరకు ఉంది. ప్రస్తుతం బేడిగ రకం రూ.7 వేల లోపు ఉండగా తేజ రకం రూ.3,500 నుంచి రూ.4 వేల వరకు మాత్రమే ఉంది.
ఈ పరిస్థితుల్లో మిర్చి అమ్మకానికి పెడితే రైతులకు పంట కోత కూలీ కూడా వచ్చే పరిస్థితుల్లేవు. కౌలుతో కలుపుకొని ఎకరానికి లక్షా 20 వేల నుంచి లక్షా 50 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుత దిగుబడి, ధరను పోల్చి చూస్తే ఎకరానికి రూ.80 వేలకు తగ్గకుండా రైతుకు నష్టం వస్తోంది. ఒక వేళ ధర వచ్చే వరకు పంటను కోల్డ్ స్టోరేజీల్లో దాచుకుందామన్న గుంటూరు ప్రాంత వ్యాపారులు ఆ అవకాశం కూడా లేకుండా చేశారు.