వేటపాలెం ప్రాంతంలో వరి సాగు (ఫైల్) , ఆక్రమించుకున్న భూముల్లో నీరు పెడుతున్న రైతులు (ఫైల్)
చీరాల : రొంపేరు భూములు ఏళ్ల తరబడి కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. పైగా అవి తమ సొంత భూములన్నట్లు కొందరు ఇతరులకు కూడా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. వ్యవసాయ మురుగు కాలువల్లో ప్రధానమైన రొంపేరు కుడి కాలువకు సంబంధించిన సుమారు 300 ఎకరాలు 125 మంది అక్రమార్కులు ఆక్రమించుకుని పట్టా భూములతో పాటు రొయ్యల చెరువులు సాగు చేసుకుంటూ లక్షల రూపాయలు గడిస్తున్నారు.
చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలో వందలాది ఎకరాలు ఆక్రమణకు గురైనా డ్రైనేజీ శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. భూమి ఆక్రమించిన చాలామంది ఎకరాన్ని రూ.5 నుంచి 7 లక్షలకు చొప్పున అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వ భూమి కాస్తా అక్రమార్కుల పరమవుతన్నాయి. కోట్లాది రూపాయలు విలువైన వందలాది ఎకరాల భూములు కళ్లెదుటే ఆక్రమణలకు గురైనా కాపాడాల్సిన అధికారులు ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్ అవసరాలకు ఉంచిన భూములన్నీ ఆక్రమణదారుల చేతుల్లో చిక్కుకున్నాయి.
లంచాలకు కక్కుర్తి పడిన రెవెన్యూ యంత్రాంగం ఇతర శాఖలకు చెందిన భూమిని కూడా కొందరికి బి.ఫారాలు ఇచ్చి అక్రమార్కుల సరసన నిలబడింది. వివరాలు.. వ్యవసాయ భూముల నుంచి వచ్చే మురుగు నీరు, వర్షాల సమయంలో వచ్చే వరద నీరు సముద్రంలో కలిసేందుకు వీలుగా కారంచేడు నుంచి పెదగంజాం వరకు రొంపేరు కుడి మురుగునీటి కాలువ నిర్మించారు. వరదలు, ఇతర వ్యవసాయ మురుగు నీరంతా ఈ కాలువ నుంచి పెదగంజాం వద్ద సముద్రంలో కలుస్తోంది.
కబ్జా కోరల్లో 300 ఎకరాలు
భవిష్యత్‌లో కాలువ వెడల్పు పెరుగుతుందన్న ఉద్దేశంతో ముందు చూపుగా డ్రైనేజీ శాఖ కాలువకు ఇరువైపులా 300 ఎకరాల వరకు ఉంచింది. కారంచేడు నుంచి పెదగంజాం వరకు ఈ రొంపేరు కాలువ 35 కిలో మీటర్ల పొడవున ఉంటుంది. అదే పొడవున ఆ శాఖకు చెందిన భూములు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆ భూములన్నీ కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. కాలువ పక్కనే ఉన్న భూములను ఆక్రమించుకొని కొందరు వ్యవసాయం చేస్తుండగా మరికొందరు ఏకంగా రొయ్యల చెరువులు తవ్వి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. కారంచేడు నుంచి పందిళ్లపల్లి వరకు 200 ఎకరాలు ఆక్రమించుకొని వరిసాగు చేస్తుండగా పందిళ్లపల్లి నుంచి పెదగంజాం వరకు 100 ఎకరాలకు పైగా ఆక్రమించుకున్న భూముల్లో రొయ్యల చెరువులు తవ్వి సాగు చేస్తున్నారు.
కన్నెతి చూడని డ్రైనేజీ అధికారులు
కళ్లెదుటే ఏళ్ల తరబడి ఈ అక్రమ వ్యవహారం నిరాటంకంగా సాగుతున్నా సంబం«ధించిన డ్రైనేజీ శాఖ వాటిని కాపాడుకొనేందుకు కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. డ్రైనేజీ శాఖ భూములను ఆక్రమించుకొని ఉన్న కొందరికి రెవెన్యూ శాఖ నిబంధనలకు విరుద్ధంగా పదేళ్ల క్రితం బి–ఫారాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇవి నకిలీవన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. డ్రైనేజీ శాఖ భూములు బదలాయింపు జరగకుండా బి–ఫారాలు ఇవ్వడం అక్రమం.
అరకొరగా ఆధునికీకరణ
రొంపేరు డ్రైన్లు ఆధునికీకరణకు గతంలో ప్రభుత్వం రూ.130 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఉన్న కాలువ కంటే 20 శాతం వెడల్పున కాలువను విస్తరించి అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో భాగంగా డ్రైనేజీ శాఖ తమ భూములకు హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ అధికారులను కోరినా నేటికీ వారు ముందుకు రాలేదు. ఆధునికీకరణ జరగాలంటే తప్పని సరిగా ఆక్రమణలో ఉన్న కొందరి భూములు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రొంపేరు భూములకు రెక్కలొచ్చాయి. ఎకరం రూ.5 నుంచి రూ.7 లక్షల వరకు పలుకుతోంది. ఇంకా మిగిలి ఉన్న భూములను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు.
పైపెచ్చు తాము సాగు చేస్తున్నామని, భూమిపై హక్కు తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఎకరం నుంచి ఐదు ఎకరాలకుపైగా ఆక్రమించుకొని వరి, రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. చాలామంది ఈ భూములను తమ సొంత భూములుగా భావించి ఇతరులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన దర్జాగా అమ్మకాలు జరుపుతున్నా సంబంధిత డ్రైనేజీ శాఖాధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. కనీసం అక్రమార్కులకు నోటీసులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. కోట్లాది రూపాయల విలువైన భూములు ఆక్రమణలో చిక్కుకున్నా వాటిని కాపాడుకొనే ప్రయత్నం చేయకపోవడంతో ప్రస్తుతం ఆధునికీకరణ పనులకు అవసరమైన భూమి కూడా డ్రైనేజీ శాఖకు లేకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment