ఒంగోలు టూటౌన్ : జిల్లాను గత నాలుగేళ్లుగా కరువు వణికిస్తోంది. అడపా, దడపా చిరుజల్లులు మినహా సకాలంలో వానలు లేవు, వరదలు లేవు. దీంతో భూగర్భ జలాలు వందల అడుగుల కిందకి వెళ్లిపోయాయి. దీంతో వర్షాలు లేక భూమి అంతా బొగిలిపోయింది. మాగాణి పొలాలు బీటలు వారాయి. గత యేడాది వేసిన పంటల మొత్తం భానుడి ప్రతాపానికి ఎండిపోయింది. చేతికొచ్చే పంటలు సైతం మేతబీడుగా వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. కోట్ల రూపాయల పెట్టుబడులు నేలపాలయ్యాయి. అరకొరగా చేతికొచ్చిన పంటలకు గిట్టుబాటు ధరలేక నానా అవస్థలు రైతులు పడుతున్నారు. అప్పుల పాలవుతున్నారు. జిల్లా పరిస్థితిని గమనించిన సర్కార్ కరువు జిల్లాగా ప్రకటించింది. పంట నష్టాన్ని పరిశీలించేందుకు ఇటీవల కేంద్రం బృందం వచ్చి పరిశీలించింది. జిల్లాలో ఎండిన చెరువులు, కుంటలు, బీటలు వారిన పొలాలు చూసి చలించిపోయింది. పంటనష్టం అంచనాల అనంతరం ఇన్‌ఫుట్ సబ్సిడీ రూ.125 కోట్లు అవసరమని జిల్లా అధికారులు కేంద్ర, రాష్ట్రాలకు సమాచారం పంపించడం జరిగింది.
కరువు చూసి నోరెళ్లబెట్టిన కేంద్ర బృందం..
జిల్లా ఎంతటి కరువు భారిన పడిందో కేంద్ర బృందమే చూసి నివ్వెరపోయింది. అంతటి కరువు జిల్లాను కమ్మేసింది. ఇలాంటి పరిస్థితులలో మళ్లీ ఖరీఫ్ ప్రారంభమయ్యే సమయం వచ్చింది. ఏ పాలుపోని రైతులు మళ్లీ ఆకాశం వైపు చూడటం మొదలెట్టారు. చినుకు జాడ కోసం ఆశగా ఎదురు చూస్తుండటం నిత్యకృత్యమయింది. ఈ సారైనా నైరుతి రుతు పవనాలు కరుణించి వానలు పడతాయని ఆశతో ఎదురు చూస్తున్నారు. నైరుతిపైనే ఆశలు పెట్టుకున్నారు.
ముందస్తు ప్రణాళికతో వ్యవశాయశాఖ..
నైరుతిపై ఆశతోనే వ్యవసాయశాఖ ఖరీఫ్ విత్తనాలు, ఎరువులను ముందస్తు ప్రణాళికతో సిద్ధం చేసింది. ఎప్పుడు వరుణుడు కరుణిస్తే అప్పుడు అన్నదాతకు విత్తనాలు సరఫరా చేయాలని సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం 6,500 క్వింటాళ్ల పచ్చి రొట్ట ఎరువులతో పాటు పెసర, మినుము, కందులు వంటి విత్తనాలు అలాట్ అయ్యాయి. పచ్చి రొట్ట ఎరువులలో జీలుగ 200 క్వింటాళ్ళు, జనుము 4 వేల క్వింటాళ్ళు, పిల్లిపెసర 500 క్వింటాళ్లు ఉన్నాయి. వీటిని రైతులకు 75 శాతం రాయితీపై రైతులకు ఖరీఫ్‌కు ముందు సరఫరా చేయనున్నారు. వీటితో పాటు కందులు 500 క్వింటాళ్లు, పెసర 200 క్వింటాళ్లు, మినుము 300 క్వింటాళ్లు, ఆముదం 100 క్వింటాళ్ళు, సజ్జ 63 క్వింటాళ్ళు, జొన్న 56 క్వింటాళ్లు, నువ్వులు 200 క్వింటాళ్లు, వేరుశనగ విత్తనాలు 50 క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. కందుల విత్తనాలను 33 శాతం రాయితీపై సరఫరా చేయనున్నారు. వీటితోపాటు లక్షా 72, 532 మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధం చేశారు. యూరియా 41, 638 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 28, 215 మెట్రిక్‌టన్నులు, ఎస్‌ఎస్‌పి 1, 029 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 50, 061 మెట్రిక్ టన్నులు, డీఏపీ 28, 215 మెట్రిక్ టన్నులను అందుబాటులో ఉంచారు. ఇవిగాకుండా నవధాన్యాల కిట్‌లు కూడా మంజూరు అయ్యాయి.
జిల్లాకు 10,500 కిట్లు..
జిల్లాకు మొత్తం మొత్తం 10,500 కిట్లు కేటాయించినట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. ఒక్కొక్క ఫ్యాకెట్లో ఆరురకాల విత్తనాలు ఉంటాయి. ముఖ్యంగా కొర్ర, జనుము, కందులు ఇలా ఆరు రకాల విత్తనాలు కిట్ ద్వారా రైతులకు 75 శాతం రాయితీపై ఇస్తారు. ప్రస్తుతం జిల్లాకు కేటాయించిన ఈ విత్తనాలను జల్లాలోని 12 వ్యవసాయ డివిజన్లకు కేటాయించడం జరుగుతుంది. అక్కడ నుంచి మండల వ్యవసాయాధికారులకు కేటాయించి రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇలాంటి పరిస్థితులలో వర్షం కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. సకాలంలో వర్షాలు కురిస్తే ఖరీఫ్ సాగుకు ముందు పచ్చి రొట్ట ఎరువుల పంటలు సాగుచేసుకునే పనిలో నిమగ్నమవుతారు. జూన్‌లో వ్యవసాయ పనులు ముమ్మరం అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment