‘కృష్ణా’లో దూకిన మిర్చి రైతు
ఐదెకరాల్లో పంట సాగు చేసి అప్పుల పాలు.. దిక్కుతోచక బలవన్మరణం
వెల్దుర్తి (మాచర్ల): కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం దావుపల్లి తండాకు చెందిన రమావత్ లాలూనాయక్(46) అనే మిర్చి రైతు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. లాలూనాయక్ తనకున్న రెండెకరాల సొంత భూమితో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఎకరానికి రూ.80 వేలు పెట్టుబడి పెట్టాడు. మూడెకరాల కౌలుతో కలిపి పెట్టుబడి రూ.4.45 లక్షలు అయింది.
వ్యవసాయ పనుల నిమిత్తం రూ.లక్షన్నరదాకా అప్పు చేశాడు. ఐదు ఎకరాలు బోర్ల కింద సాగు కావడంతో ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున మొత్తం 100 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కూలీలు, అత్యవసర ఖర్చుల కోసం క్వింటాలు రూ.2 వేల చొప్పున 40 క్వింటాళ్లు అమ్మగా రూ.80 వేలు వచ్చింది. మూడేళ్లుగా నష్టాలే మిగులుతుంటే ఈ లెక్కన అప్పులెప్పుడు తీరుతాయని తీవ్రంగా కలత చెందాడు. ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని భావించి ఆదివారం గ్రామ సమీపంలోని కృష్ణా నదిలో దూకాడు. జాలర్లు, చెంచులు లాలూనాయక్‌కు కాపాడేందుకు ప్రయత్నించినా అప్పటికే మృతి చెందాడు.