
ఈ-సిగరెట్ అంతే డేంజర్..!
మా పాపకి నాలుగేళ్లు. తరచు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతోంది. ఆయుర్వేద మందుల్ని తెలియజేయగలరు.
- పూర్ణిమ, హైదరాబాద్
ఆడవాళ్లలో జననాంగ ప్రాంతంలోనే మూత్రం బయటకు వచ్చే మార్గం ఉంటుంది. పైగా చిన్నపిల్లలో ఈ సమస్య ఎక్కువ. అక్కడ పరిశుభ్రత లోపిస్తే, ఈ వికారం కలుగుతుంది. దీనిని ఆయుర్వేదంలో ‘మూత్రదాహం లేదా మూత్రనాళపాకం’ అంటారు. ఈ వ్యాధిలో మూత్రం మాటిమాటికీ రావడం, స్వల్పంగా రావడం, మంట మొదలైన లక్షణాలుంటాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గేవరకూ ఆహారంలో పులుపు, కారం తక్కువగా తినాలి. నీళ్లు. బార్లీ నీళ్లు, ఇతర ద్రవపదార్థాలు ఎక్కువగా తాగాలి.
ఔషధం: చంద్రప్రభావటి మాత్రలు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి; చందనాసవ లేదా అరవిందాసవ ద్రావకం రెండు చెంచాల మందుకి రెండు చెంచాల నీళ్లు కలిపి మూడుపూటలా తాగించాలి.
గమనిక: ఈ సమస్య తగ్గిపోయిన తర్వాత, అదే మందుల్ని సగం మోతాదులో ఒక నెలపాటు వాడితే మూత్రాశయానికి వ్యాధి క్షమత్వ శక్తి పెంపొందుతుంది.
ఆయుర్వేదం రీత్యా ‘తేనె’ ప్రాశస్త్యాన్ని వివరించండి.
- రేణుక ఉపాధ్యాయుల, బెంగళూరు
ఆయుర్వేదంలో తేనె గురించి చాలా సుదీర్ఘంగా వివరించారు. ఇవి కొన్ని ముఖ్యాంశాలు మాత్రమే. మకరందాన్ని అందించే పుష్పాన్ని బట్టి, దాన్ని సేకరించే తేనెటీగలలో గల రకాన్ని బట్టి గూడా తేనె గుణ ధర్మాలు మారుతుంటాయి. సంస్కృతంలో తేనెను ‘మధు’ లేక ‘క్షౌద్రం’ అంటారు. స్వచ్ఛమైన తేనెలో మధుర కషాయ రసాలు (తీపి, వగరు) మిళితమై ఉంటాయి. దీన్ని సేవించిన కొద్ది నిమిషాలకే నీరసం తగ్గిపోతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుతుంది. అందుకే నవజాత శిశువులకు కొద్దిగా తేనెను, ఆవునెయ్యితో కలిపి ఇస్తారు. గురు, రూక్ష, కషాయ గుణాలుండటం వల్ల తేనెను చాలా స్వల్ప ప్రమాణంలోనే సేవించాలి.
కంటికి మంచిది. శరీరంలోని కొవ్వుని కరిగిస్తుంది. కఫాన్ని హరిస్తుంది. వాంతులు, నీళ్ల విరేచనాలు, దగ్గు, ఆయాసాలను నయం చేస్తుంది. దప్పిక, తేపులు తగ్గుతాయి. రక్తస్రావాన్ని అరికడుతుంది. విషహరం. గాయాలు తగ్గడానికీ, ఇన్‌ఫెక్షన్లు తగ్గటానికి తేనెను కడుపులోకి సేవించడమే కాకుండా, బయట పూతగా కూడా వాడవచ్చు.
గమనిక: తేనెను అధికమాత్రలో సేవిస్తే అజీర్ణం కల్గించి, ప్రమాదాలకు దారితీస్తుంది. తేనెను వేడిచేయకూడదు. మధుమేహ రోగులకు ‘తీపి’ పదార్థాలు తినడంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరమో, అవి తేనెకూ వర్తిస్తాయి. తేనె సేకరించిన తర్వాత ఒక సంవత్సరం పిమ్మట వాడటం అత్యుత్తమమని శాస్త్రోక్తం.
నా వయసు 45 ఏళ్లు. విపరీతంగా సిగరెట్లు తాగుతాను. ఎంత ప్రయత్నించినా చైన్‌స్మోకింగ్ మానడం సాధ్యం కావడం లేదు. స్నేహితులు ఈ-సిగరెట్‌ను ప్రయత్నించమని చెబుతున్నారు. ఈ-సిగరెట్ (ఎలక్ట్రానిక్ సిగరెట్) ఉపయోగించడం ద్వారా సిగరెట్ మానేయవచ్చా? ఇది సురక్షితమేనా? - దేవరాజు, హైదరాబాద్
ఎలక్ట్రానిక్ సిగరెట్లు (ఈ-సిగరెట్స్) అన్నీ ఒకేలా పని చేస్తాయి. అందులో ఒక బ్యాటరీ ఉంటుంది. దాని కాట్రిడ్జ్ (మందు నింపే బోలు ప్రదేశం)లో నికోటిన్ ఉంటుంది. మామూలు సిగరెట్‌కూ, ఈ-సిగరెట్‌కూ తేడా ఒక్కటే. ఈ-సిగరెట్‌లో పొగాకు ఉండదు. అంతే. అయితే కేవలం పొగాకు మాత్రమే గాక... సాధారణ సిగరెట్‌లో ప్రమాదకరమైన రసాయనాలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండి, అవన్నీ ఆరోగ్యానికి చేటు చేస్తాయని నిరూపితమైంది. అదే పరిణామంలో కాకపోయినా ఈ-సిగరెట్‌లోనూ దాదాపు సాధారణ సిగరెట్‌లో ఉండే ప్రమాదకరమైన రసాయనాల్లో కొన్నైనా ఉంటాయి. నికోటిన్ అనే పదార్థం మామూలు సిగరెట్లు, ఈ-సిగరెట్లు... ఈ రెండింటిలోనూ ఉంటుంది. తనకు బానిస అయ్యేలా చేసుకోవడానికి నికోటిన్ ప్రతీతి. మందుల భద్రత విషయంలో ప్రామాణికమైన అమెరికాలోని అత్యున్నత సంస్థ ఎఫ్‌డీఏ విశ్లేషణల ప్రకారం... ఈ-సిగరెట్‌లోనూ గుర్తించగల స్థాయిలో క్యాన్సర్ కారకాలూ, విషపూరిత రసాయనాలూ ఉన్నాయి. ఈ-సిగరెట్‌లో కాట్రిడ్జ్‌లో డీ-ఇథైల్ గ్లైకాల్ అనే విషపూరిత పదార్థం, నైట్రోజమైన్స్ అనే క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. పైగా ఎన్నో రకాల కాలుష్యాలు సైతం ఈ-సిగరెట్ ద్వారా శరీరంలోకి వెళ్తుంటాయి. ఈ పొగను లోపలికి పీల్చినప్పుడు అది మామూలు సిగరెట్లలాగే గొంతు, ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలిక మంట, ఇన్ఫెక్షన్లను (క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్‌ను) కలిగిస్తుంది. ఇలా పొగ పీల్చడం దీర్ఘకాలం పాటు కొనసాగితే అది ఈ-సిగరెట్ పొగ అయినా సరే... కొన్నాళ్ల తర్వాత బ్రాంకైటిస్, ఎంఫసిమా, గుండెజబ్బుల వంటి వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి ఈ-సిగరెట్ మామూలు సిగరెట్ కంటే చాలా సురక్షితమైనదేమీ కాదు.
పైగా ఏ సిగరెట్ అయినప్పటికీ అందులోని పొగ వల్ల సిరలు, ధమనులు చాలా ఎక్కువగా ధ్వంసమవుతాయి. ఈ పరిణామమే ఆ తర్వాత గుండెజబ్బులకు దారితీస్తుంది. ఇక ఈ-సిగరెట్‌లోని పొగలో మామూలు సిగరెట్‌లో పోలిస్తే రసాయనాల సంఖ్య కొంచెం తగ్గితే తగ్గుతుండవచ్చు. అంతమాత్రాన అది మామూలు సిగరెట్ కంటే సురక్షితం అని కచ్చితంగా చెప్పడానికి ఆస్కారం లేదు. దీర్ఘకాలంలో మామూలు సిగరెట్‌తో వచ్చే దాదాపు అన్ని రకాల దుష్పరిణామాలూ ఈ-సిగరెట్‌తోనూ వస్తాయి. ఈ-సిగరెట్‌లోనూ ఉండేది నికోటినే కాబట్టి దానికి బానిసై మళ్లీ మీరు ఈ-సిగరెట్‌కు అలవాటు పడతారు. మీరు సిగరెట్ వదిలేయదలిస్తే... ఒక్కసారిగా వదిలేయడం. మానేయగానే కాస్త చిరాకు, కోపం, నిస్పృహ, అస్థిమితంగా ఉండటం వంటి కొన్ని తాత్కాలిక లక్షణాలు కనిపించినా, దీర్ఘకాలంలో సిగరెట్ మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ.
మా పాప వయసు ఏడేళ్లు. కాస్త వర్షం వచ్చే వాతావరణం ఉంటే చాలు జలుబు ఎక్కువగా వస్తుంది. ఇలాంటి వాతావరణంలో రాత్రుళ్లు ఊపిరి సరిగ్గా ఆడటం లేదని చెబుతూ ఇబ్బంది పడుతోంది. మా పాప సమస్యకు సరైన పరిష్కారం సూచించండి. - శ్రీరేఖ, మార్కాపురం
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు ఉన్న కండిషన్‌ను రైనైటిస్‌గా చెప్పవచ్చు. రైనైటిస్ అనేది ముక్కు లోపలి పొర (నేసల్ మ్యూకోజా) ఇన్‌ఫ్లమేషన్ వల్ల వస్తుంది. ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, కొద్దిమందిలో ముక్కు లోపల దురద, విపరీతమైన తుమ్ములు వంటి ఇతర లక్షణాలు కూడా రైనైటిస్‌లో కనిపిస్తాయి. ఇటీవల ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. కొద్దిమందిలో ఇది సైనసైటిస్, ఆస్తమాతో పాటు కనిపించవచ్చు. కొంతమందిలో ఎప్పుడూ (పెరిన్నియల్‌గా) కనిపించే ఈ సమస్య మరికొందరిలో అప్పుడప్పుడు (సీజనల్) గా కనిపిస్తుంటుంది. ఇది అలర్జీ వల్లనే కాకుండా ఇన్ఫెక్షన్స్‌కు సంబంధం లేని ఇతర సమస్యలు (నాన్‌ఇన్ఫెక్షియస్ కారణాల వల్ల కూడా) రావచ్చు. అలర్జెన్స్ వల్లనే కాకుండా చల్లటి గాలి, ఎక్సర్‌సైజ్, వాతావరణంలో మార్పులు, కాలుష్యాలు, ఉద్వేగాలకు లోనుకావడం (ఎమోషనల్ డిస్టర్బెన్సెస్) వల్ల కూడా ఇది వస్తుంది. కొన్ని సందర్భాల్లో హార్మోన్‌ల సమతౌల్యతలో లోపాల వల్ల కూడా రావచ్చు. ఇక మీ పాప విషయంలో మీరు చెప్పిన అంశాలను బట్టి చూస్తుంటే ఇది ఇడియోపథిక్ అలర్జిక్ రైనైటిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇలాంటి సమస్యలో చాలాసార్లు కారణం తెలుసుకోవడం కష్టం అయినప్పటికీ- కంప్లీట్ హీమోగ్రామ్, ఇమ్యునోగ్లోబ్లులిన్ (ఐజీఈ) లెవెల్స్, సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అలర్జెన్స్ పరీక్ష వల్ల కూడా కొంతవరకు కారణాలు తెలుసుకోవచ్చు. దీనికి చికిత్సగా ముక్కులో వేయాల్సిన చుక్కల మందు (సెలైన్ నేసల్ డ్రాప్స్), యాంటీహిస్టమైన్ గ్రూపు మందులు వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే నేసల్ స్టెరాయిడ్స్‌తో చాలావరకు ఉపశమనం ఉంటుంది. ఇక సమస్యను నివారించడం కోసం రైనైటిస్‌ను ప్రేరేపించే ఇతర అంశాలు అంటే... ఫేస్‌పౌడర్, పెయింట్ వంటి ఘాటైన వాసనలు ఉండే పదార్థాలు, పెంపుడు జంతువుల ఒంటి మీద వెంట్రుకలు, దుమ్మూ ధూళి, కాలుష్యాల వంటి వాటికి పాపను దూరంగా ఉంచాలి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని లేదా ఈఎన్‌టీ నిపుణుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి.