మృతిచెందిన అక్బర్‌ఘెరీ (ఫైల్), వాజిద్ (ఫైల్)
చిలకలగూడ : చిలకలగూడ పాత పోలీస్‌స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి పురాతన భవనం కూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా ఈ ఘటనలో ఎలుకల మందు పెట్టబోయి ఒకరు ప్రాణాలు కోల్పోగా, సిగరెట్ కోసం వెళ్లి మరొకరు ప్రాణాలు కాపాడుకున్నారు. వివరాల్లోకి వెళితే..కూలిపోయిన భవనంలో కొనసాగుతున్న అక్బర్ చికెన్ షాపులో భవానీనగర్‌కు చెందిన మహ్మద్‌వాజిద్ (29) చిలకలగూడకు చెందిన రెహమాన్ పని చేసేవారు.
సోమవారం రాత్రి ఇద్దరు కలిసి షాపును శుభ్రం చేశారు. యజమాని అదేశాల మేరకు వాజిద్ ఎలుకల మందు పెట్టేందుకు లోపలకు వెళ్లగా,అక్బర్ దుకాణం ఎదుట నిల్చున్నాడు. రహమాన్ సిగరెట్ కోసం బయటకు వెళ్లాడు. అదే సమయంలో భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న అక్బర్, వాజిద్ మృతిచెందగా, సిగరెట్ కోసం వెళ్లిన రెహమాన్ ప్రాణాలతో భయటపడ్డాడు. కాగా అంతకు కొన్ని నిమిషాల ముందే అదే రహదారిలో పలహారంబండి ఊరేగింపు వెళ్లిన తర్వాత ఈ ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది.