
ఊపిరిని పీల్చేసే పొగ!
సూయిసైడల్ సిగరెట్
సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారిలో ఆత్మహత్య చేసుకోవాలనే వాంఛ (సూయిసైడల్ టెండెన్సీస్) విపరీతంగా పెరిగిపోతాయని పేర్కొంటున్నారు అమెరికాకు చెందిన పరిశోధకులు. యూఎస్‌లో ఆత్మహత్యల తీరుతెన్నులపై పరిశోధన చేస్తున్న కొందరు నిపుణుల అధ్యయనాల మేరకు సిగరెట్ అలవాటును తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల తర్వాత పొగతాగే అలవాటు గణనీయంగా తగ్గిందనీ, దాంతో ఆత్మహత్యల శాతం కూడా 15 శాతం తగ్గిందని వారు వివరించారు.
అయితే దీనికి ఆత్మహత్యలకూ సిగరెట్ అలవాటుకూ ఎలా ముడిపెడతారన్న ప్రశ్నలకు వాళ్లు సమాధానం ఇస్తూ... పొగతాగే అలవాటును తగ్గించడానికి విధాన చర్యలు తీసుకోకుండా, సిగరెట్లపై టాక్సులు తగ్గించిన కొన్నిరాష్ట్రాలలో ఆత్మహత్యల శాతం 6 శాతం పెరిగిన దృష్టాంతాలను వారు ఉటంకిస్తూ... డ్రగ్స్ అలవాటు ఉన్నవారిలో ఆత్మహత్య చేసుకోవాలనే వాంఛ పెరిగినట్లే... నికోటిన్‌కు బానిసలైన వారిలోనూ యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పెరుగుతాయనీ, డిప్రెషన్ ఉన్నవారికి ఆత్మహత్యావాంఛ ఒక లక్షణమని ఈ పరిశోధకులు ‘నికోటిక్ అండ్ టొబాకో రీసెర్చ్’ అనే జర్నల్‌లో పేర్కొన్నారు.