సిగరెట్టు తాగొద్దన్నందుకు..
మామను హత్య చేసిన అల్లుడు
బెంగళూరు (బనశంకరి) : ఇంటిలో సిగిరెట్ తాగొద్దని చెప్పిన పాపానికి మామను అల్లుడు హత్య చేసిన సంఘటన యశవంతపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. బీకే.నగర 17 వక్రాస్‌లో నివాసముంటున్న నాగరాజ్ (65) టైలర్ . ఇతడి కుమార్తెను సత్యనారాయణకు ఇచ్చి ఏడేళ్ల క్రితం వివాహం చేశాడు. దంపతులిద్దరు మామ నాగరాజ్ ఇంటిలోనే ఉంటున్నారు. అనారోగ్యంతో ఉన్న సత్యనారాయణ ఇంటి వద్దనే ఉంటున్నారు. భార్య గార్మెంట్స్‌లో పనిచేస్తోంది. ఆదివారం రాత్రి సత్యనారాయణ ఇంటిలో సిగిరెట్ తాగుతుండగా గమనించిన మామ నాగరాజ్ సిగిరెట్ తాగొద్దని అల్లుడికి హితవు పలికారు.
దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఇదే విషయమై సోమవారం సత్యనారాయణ భార్యతో గొడవ పడింది. అనంతరం భార్య విధులకు వెళ్లగా కుమార్తె కూడా పాఠశాలకు వెళ్లింది. దీంతో మరోసారి మామ, అల్లుడు ఘర్షణపడ్డారు. తీవ్ర ఆగ్రహానికి గురైన సత్యనారాయణ చాకుతో మామ నటరాజ్‌పై దాడి చేశాడు. విషయం గమనించి స్థానికులు నాగరాజును హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. పోలీసులు నిందితుడని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.