కత్తిపోట్లకు దారితీసిన సిగరెట్ లొల్లి | Youngsters quarrelled for Cigarette and attack with knife | Sakshi
Sakshi News home page

కత్తిపోట్లకు దారితీసిన సిగరెట్ లొల్లి

Published Tue, May 12 2015 11:18 PM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM

కత్తిపోట్లకు దారితీసిన సిగరెట్ లొల్లి

కత్తిపోట్లకు దారితీసిన సిగరెట్ లొల్లి

హైదరాబాద్: వైన్స్ సిట్టింగ్ రూమ్‌లో సిగరేట్ విషయమై ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన యువకుడు మరో యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. కాగా.. నిందితుడు వైన్స్ ఎదురుగా ఉన్న మటన్ షాప్‌కు వెళ్లి కత్తి తీసుకొచ్చి దాడి చేయడం గమనార్హం. ఇన్‌స్పెక్టర్ ఎన్.లక్ష్మీనారాయణ కథనం ప్రకారం....తలాబ్‌కట్టా ప్రాంతానికి చెందిన అబ్దుల్ నవీద్ (28), తన స్నేహితుడు షరీఫ్‌తో కలిసి మంగళవారం సాయంత్రం గౌలిపురా మార్కెట్ ప్రాంతంలోని మాత వైన్స్‌లో మద్యం తాగేందుకు వచ్చాడు. అదే సమయంలో సుల్తాన్‌షాహి ప్రాంతానికి చెందిన కొందరు యువకులు మద్యం తాగడానికి అదే వైన్స్‌కు వచ్చారు.

అంతా కలిసి సిట్టింగ్ రూమ్‌లో మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు నవీద్‌ను సిగరేట్ అడిగాడు. సిగరేట్ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే చిత్తుగా తాగి ఉన్న ఆ యువకుడు ఆగ్రహంతో వైన్స్ ఎదురుగా ఉన్న మటన్ షాపు వద్దకు పరుగెత్తికెళ్లాడు. మటన్ వ్యాపారి వద్ద ఉన్న కత్తిని లాక్కొచ్చి నవీద్‌పై దాడి చేశాడు. మెడ భాగంలో పొడిచేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో నవీద్ అడ్డుకోవడంతో ఎడమ చేతిపై పొడిచాడు. బాధితుడు, నిందితుడు పెనుగులాడుకుంటూ బయటికి వచ్చారు. బయట ఉన్న జనాన్ని చూసి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇది గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement