హెజ్బొల్లా ప్రకటన
100 రాకెట్ల ప్రయోగం ఆరంభం మాత్రమేనని వ్యాఖ్య
ఫలితం అనుభవిస్తారు: నెతన్యాహూ
నహారియా (ఇజ్రాయెల్): ఇజ్రాయెల్‌పై ఇక యుద్ధమేనని హెజ్బొల్లా ప్రకటించింది! విజయం సాధించేదాకా పోరు కొనసాగుతుందని పేర్కొంది. అన్నట్టుగానే ఇజ్రాయెల్‌పై భారీ ప్రతీకార దాడులకు దిగింది. ఆదివారం వేకువ నుంచే 100కు పైగా రాకెట్లను ఇజ్రాయెల్‌లోని సుదూర లక్ష్యాలపైకి ప్రయోగించినట్టు హెజ్బొల్లా ఉప నాయకుడు నయీమ్ కస్సెమ్ ప్రకటించారు. ‘మేమూ మనుషులమే.
మాకెంత బాధ కలిగించారో మీరూ అంతే స్థాయిలో బాధపడతారు’’ అని హెచ్చరించారు. శుక్రవారం బీరుట్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్ ఇబ్రహీం అకీల్ సహా 45 మంది చనిపోవడం తెలిసిందే. ‘‘మేమేంటో యుద్ధక్షేత్రంలో రుజువు చేసుకుంటాం. మీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాం. మీరు అనుకున్న లక్ష్యాలను సాధించలేరు’ అని ఆదివారం అకీల్ అంత్యక్రియల సందర్భంగా ఇజ్రాయెల్‌ను నయీమ్ హెచ్చరించారు.
ఇజ్రాయెల్ ఉత్తర భాగంలోని ప్రజలు వలసపోక తప్పదని హెచ్చరించారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతం ముందస్తు సైరన్లతో మారుమోగింది. వేలాదిగా జనం బాంబు షెల్టర్లలోకి పరుగులు తీశారు. దాడుల్లో నలుగురు గాయపడ్డారని ఇజ్రాయెల్ పేర్కొంది. హెజ్బొల్లా రాకెట్లు ఇంతకు ముందెన్నడూ ఇంత దూరం వరకు రాలేదంది.
హైఫాకు దగ్గర్లోని రమత్ డేవిడ్ ఎయిర్‌బేస్‌పైకి ఫాది 1, ఫాది 2 క్షిపణులను ప్రయోగించినట్లు హెజ్బొల్లా ప్రకటించుకుంది. హెజ్బొల్లా ఈ రకం ఆయుధాలను ప్రయోగించడం ఇదే మొదటిసారి. హెజ్బొల్లా యుద్ధ ప్రకటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. ‘‘వాళ్లిప్పటికీ గుణపాఠం నేర్చుకున్నట్టు లేదు. త్వరలోనే నేర్చుకుంటారు’’ అని వ్యాఖ్యానించారు.
అల్ జజీరా కార్యాలయం మూసివేత
ఇలా ఉండగా, ఇజ్రాయెల్ బలగాలు ఆదివారం ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్ ప్రాంతం రమల్లాలో ఉన్న అల్ జజీరా శాటిలైట్ న్యూస్ నెట్‌వర్క్ కార్యాలయాలపై దాడులు జరిపాయి. బలగాలు తమ కార్యాలయాల్లోకి ప్రవేశించడాన్ని ఆ చానెల్ అరబిక్ విభాగం ప్రత్యక్ష ప్రసారం చేసింది. అల్ జజీరా కార్యాలయాలను 45రోజులపాటు మూసివేయాలని హుకుం జారీ చేసింది. అక్కడి సిబ్బందిని తక్షణమే ఖాళీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. హమాస్, హెజ్బొల్లాలకు అధికార ప్రతినిధిగా అల్ జజీరా మారిపోయిందని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment