పాక్.. మరో దుస్సాహసం
పాక్.. మరో దుస్సాహసం
Published Wed, Nov 16 2016 3:49 PM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM
భారతదేశంతో సరిహద్దుల వెంబడి పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. సరిహద్దుల వెంబడి సైనిక విన్యాసాలు చేస్తోంది. తమ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలు ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నాయన్న విషయాన్ని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ సమీక్షిస్తున్నారు. పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలోని భావల్‌పూర్ సమీపంలో సరిహద్దును ఆనుకుని ఈ విన్యాసాలు చేస్తున్నారు. వీటికి పాక్ ప్రధాని ముఖ్య అతిథిగా హాజరైనట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ కూడా హాజరయ్యారు. హెలికాప్టర్ గన్‌షిప్‌లు, పదాతి దళాలు కూడా ఇందులో పాల్గొటున్నాయి.
ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏదైనా అవాంఛిత పరిస్థితి వస్తే తమ సైన్యం దాన్ని ఎదుర్కోడానికి ఎంతవరకు సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఈ సైనిక విన్యాసాలు సూచిస్తాయని పాక్ భద్రతా అధికారులు చెబుతున్నారు. తమ సహనాన్ని బలహీనతగా భారతదేశం భావించకూడదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంతకుముందు వ్యాఖ్యానించారు. తమపై దాడి జరిగితే కాపాడుకోగల సామర్థ్యం ఉందన్నారు. అయితే.. భారత దాడుల్లో తమ సైనికులు ఏడుగురు చనిపోయారని మాత్రం పాక్ ఇటీవలే అంగీకరించింది.
Advertisement