చోరీ సొత్తు, నిందితుల వివరాలు తెలుపుతున్న ఎస్సై సురేష్
ఆమె ఆ ఇంటి పెద్దకోడలు..ఏ దుర్భుద్ధి పుట్టిందో ఏమో.. అత్తగారింట్లోనే చోరీకి ప్లాన్ వేసింది. దీనికి తనకు పరిచయమున్న వ్యక్తి సహాయాన్ని కోరింది. తన అత్తగారు ఊరెళ్లారనే సమాచారం తెలుసుకుని పక్కా ప్లానింగ్‌తో అతడిని రంగంలోకి దించింది. ఇంటి తాళాలు అతడికి ఇచ్చింది. ఇంకేముంది ఇంట్లో ఉన్న వెండి, బంగారం, ఇతర వస్తువులను చోరీ చేసేశారు... కట్ చేస్తే.. తొమ్మిది నెలల అనంతరం చోరీకి పాల్పడిన నిందితులు పోలీసులకు చిక్కారు. ఈ చోరీకి ప్లాన్ వేసింది కోడలేనని తెలిసి అత్తింటివారు అవాక్కయ్యారు.
రాయవరం (మండపేట):ఓ చోరీ కేసును తొమ్మిది నెలల అనంతరం పోలీసులు చేధించారు. రాజమహేంద్రవరంలో పరిచయమైన వ్యక్తులతో తమ ఇంట్లోని వస్తువులను, స్వయానా ఇంటి కోడలే చోరీ చేయించినట్టు తెలుసుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ప్రస్తుతం తొమ్మిదో నెల నిండు గర్భిణిగా ఉన్న కోడలితో సహా మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన చందంగా ఉన్న ఈ చోరీ ఘటన వెనుక ఉన్న వాస్తవాలను పోలీసులు గురువారం రాయవరంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
రాయవరంలోని శివాలయం సమీపంలో నూలు నాగభూషణం, పరంజ్యోతి దంపతుల ఇంటిలో 2017 జూన్ 27వ తేదీ రాత్రి చోరీ జరిగింది. ఆ రోజు పరంజ్యోతి చిన్న కుమారుడు ఏసురాజుతో కలిసి కాతేరులోని మనవరాలి బర్త్‌డే ఫంక్షన్‌కు వెళ్లారు. పరంజ్యోతి పెద్దకుమారుడు వెంకటేశ్వరరావు, అతడి భార్య వీరలక్ష్మి గ్రామంలోనే వేరే ఇంట్లో నివసిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాళ్ల మండలం మాలవానితిప్పకు చెందిన ఉద్దర్రాజు మహేష్ 2011లో రాజమహేంద్రవరంలోని ఓ హోటల్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేసేవాడు. ఆ సమయంలో రామచంద్రపురంలో నివసించే వీరలక్ష్మితో అతడికి పరిచయం ఏర్పడింది. 2013లో వీరలక్ష్మి రాయవరం గ్రామానికి చెందిన నూలు వెంకటేశ్వరరావును ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి వీరలక్ష్మి మహేష్‌లు ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉండేవారు.
అత్తగారు ఊరెళుతుందని తెలిసి..
అత్తగారు నాలుగు రోజులు ఊరిలో ఉండడం లేదన్న విషయాన్ని పూర్వపు స్నేహితుడైన ఉద్దర్రాజు మహేష్‌కు వీరలక్ష్మి తెలిపింది. ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు, ఇతర విలువైన వస్తువులు దొంగిలిస్తే చెరిసగం పంచుకుందామంటూ పథకం వేసింది. మహేష్ తన స్నేహితుడైన కె.గంగవరం మండలం అద్దంపల్లికి చెందిన వెన్నా నాగరాజును వెంటబెట్టుకుని రాయవరం వచ్చాడు. అప్పటికే పూర్తి సమాచారాన్ని వీరలక్ష్మి మహేష్‌కు ఇవ్వడంతో సులువుగానే ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళాలను సైతం అతడికి ఇవ్వడంతో ఇంట్లో ఉన్న 2.350 కేజీల వెండి వస్తువులు, 26 గ్రాముల బంగారు వస్తువులు, 21 అంగుళాల ఎల్‌ఈడీ టీవీ, హోమ్ థియేటర్‌ను చోరీ చేశారు. చోరీ ఘటనపై గతేడాది జూన్ 28న ఏఎస్సై కేవీవీ సత్యనారాయణ కేసు నమోదు చేశారు.
అవాక్కయిన పోలీసులు, కుటుంబ సభ్యులు..
మండలంలోని మాచవరం వంతెన వద్ద అనుమానాస్పదంగా ఉన్న మహేష్, నాగరాజులను పోలీసులు పట్టుకున్నారు. వీరిని విచారించగా 2017 జూన్ 27 రాత్రి నూలు వీరలక్ష్మి సహాయంతో చేసిన చోరీ విషయాన్ని బయట పెట్టారు. దీంతో వీరలక్ష్మిని కూడా అరెస్ట్ చేసినట్టు ఎస్సై వెలుగుల సురేష్ తెలిపారు. స్వయానా ఇంటి కోడలే తన పూర్వపు స్నేహితుడితో అత్తగారింట్లో చోరీ చేయించిన విషయం వెలుగు చూడడంతో పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. అనపర్తి సీఐ పాలా శ్రీనివాస్ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి అనపర్తి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తున్నట్టు ఎస్సై తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏఎస్సై కేవీవీ సత్యనారాయణ, సిబ్బంది పి.రాజు, వి.చినరాజు, వి.శ్యామల, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment