
అత్త ఆరళ్లపై వివాహిత నిరసన
ఆరిలోవ(విశాఖ తూర్పు): అత్త ఇంట్లోకి రానీయకపోవడంతో ఓ కోడలు నిరసనకు దిగింది. వివాహమై రెండేళ్లు గడిచినా గడప తొక్కనీయకపోవడంతో ఒంటరి పోరాటం చేస్తోంది. బాధితురాలు రాధ తెలిపిన వివరాలు ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం తాలాడ గ్రామానికి చెందిన రాధకు విశాఖలో మూడో వార్డు వివేకానందనగర్ ఆరో వీధికి చెందిన కనకల సురేష్‌తో 2015లో వివాహమైంది.
సురేష్ బీఎస్‌ఎఫ్ ఉద్యోగి. వివాహ సమయంలో రూ.10 లక్షలు కట్నంతో పాటు ఇతర కానుకలు ఇచ్చారు. వివాహమైన ఏడాదిలో రాధ ఆషాఢానికి కన్నవారి ఇంటికి వెళ్లి తిరిగి అత్తంటికి వచ్చింది. కొద్ది రోజులకు రాధ తల్లికి అనారోగ్యం చేసినట్లు కబురు వచ్చింది. అయినా అత్త కనకల అప్పలకొండ ఆమెను పంపించలేదు. దీంతో భర్త సురేష్ సహాయంతో రాధ కన్నవారి ఇంటికి వెళ్లింది. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న అత్త.. కోడలు ఎప్పుడు ఇంటికి వచ్చినా బయటకు పంపించేస్తుంది.
కొద్ది నెలల కిందట అనారోగ్యంతో రాధ తల్లి మరణించింది. దీంతో కన్నవారి ఇంట్లో కూడా ఆమెను చూసుకొనేవారు కరువయ్యారు. అసోంలో బీఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్న సురేష్ ఇటీవల ఇంటికి వచ్చాడన్న విషయం తెలుసుకొన్న రాధ శనివారం తన మేనమామను తీసుకొని వచ్చింది. ఆమెను మళ్లీ అత్త ఇంట్లోకి రానీయలేదు. దీంతో రాధ సోమవారం మధ్యాహ్నం ఐదుగురు బంధువులను తీసుకొని వచ్చింది. అయినా అత్త కనికరించలేదు. ఆమె తీసుకొచ్చిన బ్యాగును బయటకు విసిరేసి, రాధను గేటు బయటకు నెట్టేసింది. సురేష్ బయటకు వెళ్లిపోయాడు.
దీంతో రాధ బంధువులు తిరిగి ఊరెళ్లిపోయారు. ఆమె మాత్రం ఇంటి ముందే బ్యాగు పట్టుకొని గేటు వద్ద ఒంటరిగా నిరసన తెలుపుతుంది. స్థానికులు స్పందించి రాత్రి భోజనం పెట్టారు. ఓ మహిళ తన ఇంట్లో పడుకోవడానికి చోటిచ్చింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన భర్త ఉద్యోగానికి ఎక్కడ ప్రమాదం వస్తుందోనని ఆమె భయపడుతోంది. అయినా ఆ అత్తకు జాలి కలగలేదు. ఓ పక్క కన్నవారింట్లో తల్లిని కోల్పోయింది.
మరో పక్క మెట్టింట్లో అత్త బయటకు గెంటేసింది. దీంతో రాధ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇదేమని అడిగిన స్థానికులపై అప్పలకొండ దుర్భాషలాడుతోంది. దీంతో ఆమె పరిస్థితిని చూస్తున్న స్థానికులు జాలి చూపడం తప్ప, ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.