విశాఖలో హైటెన్షన్‌.. ప్రధాని పర్యటన.. ఉక్కు కార్మికుల ఆందోళన ఉధృతం | Visakha Steel Plant Workers Protest In Wake Of Pm Modi Visit | Sakshi
Sakshi News home page

విశాఖలో హైటెన్షన్‌.. ప్రధాని పర్యటన.. ఉక్కు కార్మికుల ఆందోళన ఉధృతం

Published Sun, Nov 24 2024 10:56 AM | Last Updated on Sun, Nov 24 2024 12:03 PM

Visakha Steel Plant Workers Protest In Wake Of Pm Modi Visit

సాక్షి, విశాఖపట్నం: నగరంలో ఈ నెల 29న ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కార్మికులు ఆందోళన ఉధృతం చేశారు. ఆదివారం.. పాత గాజువాక కూడలి నుంచి కొత్త గాజువాక వరకు కార్మికులు నిరసన చేపట్టారు. ప్రధాని స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేయాలని ఉక్కు కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీక­రణను విరమించుకోవడంతోపాటు ప్లాంట్‌ను సెయిల్‌ (స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌)లో విలీనం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి డిమాండ్‌ చేసింది. విశాఖ వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ప్రకటన చేయాలని కోరుతూ తీర్మానించింది. ద్వారకానగర్‌ పౌర గ్రంథాలయంలో నిన్న(శనివారం) అఖిలపక్ష రాజ­కీయ పార్టీల రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరి­­గింది. 

వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం 1,380 రోజులుగా కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు పోరాటం చేయడం గొప్ప విషయమన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని రాజకీయ కోణంలో చూడరాదని, 5 కోట్ల ఆంధ్రుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలన్నారు. టీడీపీ, జనసేనకు చెందిన 18 మంది ఎంపీల మద్దతు ఉపసంహరిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నారు.

కేంద్రానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటిస్తే ఆయనకు పాలాభిషేకం చేస్తానన్నారు. కర్ణాటకలో స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం రూ.15వేల కోట్లు సాయం అందించిందని, మరో రూ.15 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల జీతాలు, హెచ్‌ఆర్‌ఏ తగ్గింపు, వీఆర్‌ఎస్‌ సర్వే, ఉద్యోగులు తమంతట తాము మానేసే విధంగా ప్లాంట్‌ను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. 2,200 ఎకరాల స్టీల్‌ప్లాంట్‌ భూమి రూ.2 లక్షల కోట్ల విలువ ఉంటుందని, దానిని పల్లీలకు అమ్మేస్తారా అని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌ అప్పుల్లో ఉంది కానీ, నష్టాల్లో లేదని గుర్తించాలన్నారు. గతంలో ఒకే ఏడాది 950 కోట్లు లాభం ఆర్జించిందన్నారు. సొంత గనులు కేటాయించాలనే డిమాండ్‌ తన చిన్నప్పటి­నుంచే ఉందని, కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు చేపట్టే ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. 

పరిరక్షణ కమిటీ చైర్మన్లు ఆదినారాయణ, అయోధ్యరామ్, మంత్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ.. జనవరి 27 నాటికి ఉక్కు ప్రైవేటీకరణ పోరాట ఉద్యమం ప్రారంభించి నాలుగేళ్లు పూర్తవుతుందన్నారు. విశాఖ వస్తున్న ప్రధాని మోదీ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించాలని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, సెయిల్‌లో విలీనం చేస్తామని ప్రకటించాలని తీర్మానిస్తున్నట్టు తెలిపారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. మోదీ రాక సందర్భంగా బైక్‌ ర్యాలీలు, నిరాహార దీక్షలు వంటి కార్యక్రమాలతో ఈ నెల 28న ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ చేప­డుతున్నట్టు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement