సాక్షి, విశాఖపట్నం: కాంట్రాక్టు కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరసనకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మహా పాదయాత్ర చేపట్టారు. స్టీల్‌ప్లాంట్ నుంచి వడ్లపూడి, కణితి, శ్రీనగర్, పాత గాజువాక, పెద గంట్యాడ వరకు పాదయాత్ర నిర్వహించారు.
యాజమాన్యం నిర్ణయం వల్ల నాలుగు వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును పూర్తిస్థాయిలో నడపాలి. నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను చంద్రబాబు పవన్ నిలబెట్టుకోవాలి. స్టీల్ ప్లాంట్‌ను వెంటనే సెయిల్‌లో విలీనం చేయాలి. ప్లాంట్‌కు కావాల్సిన ముడి సరుకు ఇవ్వాలి. మూడు బ్లాస్ట్ ఫర్నిస్‌ను పూర్తిస్థాయిలో నడపాలి’’ అని కార్మికులు కోరుతున్నారు.
కాగా, ప్లాంట్‌ను కాపాడతామని గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ప్లాంట్ నిర్వీర్యం అవుతుంటే చేష్టలుడిగి చూస్తోంది. స్ట్రాటజిక్ సేల్ పేరిట ప్లాంట్‌ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం వేస్తున్న అడుగులకు రాష్ట్ర ప్రభుత్వం మడుగులొత్తుతోంది.
నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ రచ్చరచ్చ కావడంతో ఉక్కు యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయం తాత్కాలికమేనని, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు జరగొచ్చనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.
దీని వెనక కూటమి ప్రభుత్వం కుయుక్తి ఉందని తెలుస్తోంది. ఒకే సారి తొలగిస్తే ఉద్యమాలు ఉధృతమవుతాయని.. విడతల వారీగా తొలగించాలని సూచించినట్లు సమాచారం. ఒకవైపు కార్మిక సంఘాలు, కార్మికులను మభ్యపెడుతూ.. మరోవైపు ప్రైవేటీకరణ చర్యలను ముమ్మరం చేసిన కేంద్ర ప్రభుత్వానికి అడ్డు చెప్పకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ప్రస్తుత పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి.
ఇదీ చదవండి: తిరుమలలో మరోసారి చిరుత కలకలం
Comments
Please login to add a commentAdd a comment