సాక్షి, తిరుపతి: చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారిమెట్టు వద్ద చిరుత పులి కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో చిరుత రావడంతో కుక్కలు అరుస్తూ వెంబడించాయి. చిరుతపులి వాటిపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు దీపక్ అప్రమత్తమయ్యాడు. కంట్రోల్ రూమ్‌లోకి వెళ్లి తాళాలు వేసుకున్నాడు.
శ్రీనివాస మంగాపురం నుంచి శనివారం ఉదయం 5 గంటలకు భక్తులను శ్రీవారిమెట్టుకు వదిలారు. అదే సమయంలో గార్డు దీపక్ గది నుంచి బయటకు వచ్చి టీటీడీ సెక్యూరిటీ, అటవీ శాఖ అధికారులకు చిరుత గురించి సమాచారమిచ్చాడు. తర్వాత కాలి నడక భక్తులను గుంపులు, గుంపులుగా వదులుతున్నారు.
మరోవైపు, చిరుత సంచారంతో తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల ప్రజలు కొన్నిరోజుల నుంచి భయాందోళనకు గురవుతున్నారు. బుర్రిలంకలోని నర్సరీ, పరిసరాల్లో అమర్చిన ట్రాప్, సీసీ కెమెరాల్లో చిరుతపులి కదలికలు నమోదు కాలేదని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా డీఎఫ్‌ఓ ప్రసాదరావు తెలిపారు.
శనివారం రాజమహేంద్రవరంలోని ఫారెస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు తెలిపిన అనుమానాస్పద ప్రదేశాల్లో సిబ్బంది వెళ్లి గమనించగా, అవి కుక్కల పాదముద్రలుగా గుర్తించామన్నారు. దివాన్‌చెరువు అటవీ ప్రాంతంలో ట్రాప్, సీసీ కెమెరాల్లో చిరుతపులి కదలికలు గుర్తించలేదన్నారు.
బుర్రిలంక సమీపంలోని గోదావరి లంకల్లో జింకలు ఉంటాయి కాబట్టి అటువైపు చిరుతపులి వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. ఆదివారం నుంచి గోదావరి లంకల్లో సిబ్బంది బృందాలుగా ఏర్పడి గమనిస్తారన్నారు. కడియపులంక సర్పంచ్ పాటంశెట్టి రాంజీ, గ్రామస్తులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని వివరించారు.
ఇదీ చదవండి: బ్రహ్మూత్సవాలకు వెళాయే
Comments
Please login to add a commentAdd a comment