
చితాభస్మ కలశం - ప్రతీకాత్మక చిత్రం
కోడలు ఇంటికొచ్చేది ఇంటి దీపం వెలిగించడానికి... కోడలు కళను తెస్తుందని, సిరిని తెస్తుందని భావిస్తారు. కోడలు కాలు పెట్టిన వేళా విశేషం అని ఏదైనా మంచి జరిగితే చెప్పుకుంటారు. భర్తకు భార్యగా పిల్లలకు తల్లిగా ఉండే కోడలు అత్తామామలకు తల కొరివి పెట్టాల్సి వస్తే? ఇలాంటి ఆచారం ఎక్కడా లేదు. కాని ఆ ఊరిలో ఆ ఇంట్లో ఉంది. గత ఏడెనిమిది తరాలుగా అలాగే జరుగుతోంది.
హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రి చనిపోతే పెద్దకొడుకు, తల్లి చనిపోతే చిన్న కొడుకు తలకొరివి పెడతారు. కొడుకులు లేని చోట అన్నదమ్ముల కొడుకులు కొరివి పెడుతుంటారు. కాని ‘ఆకుల’ వారి కుటుంబంలో మాత్రం ‘కోడళ్లే’ అత్తామామలకు తలకొరివి పెడుతారు. ఇది ఏడెనిమిది తరాలుగా వస్తున్న సంప్రదాయం. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి గ్రామంలో గౌడ కులానికి చెందిన ‘ఆకుల’ వారి వంశవృక్షంలో 24 కుటుంబాలు ఉన్నాయి. వారి ఇళ్లలో తండ్రి చనిపోతే పెద్ద కొడుకుకు బదులు పెద్ద కోడలు, తల్లి చనిపోతే చిన్న కొడుక్కు బదులు చిన్న కోడలు తలకొరివి పెడతారు. అంతిమసంస్కారాలతో పాటు శ్రాద్ధకర్మలు కూడా కోడళ్లే చేయాల్సి ఉంటుంది. ఆ కార్యక్రమాలు చేసే చోటుకి కొడుకులను అనుమతించరు. తండ్రి చనిపోయాడని బాధపడే కొడుకులు తండ్రి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అందరిలాగే కార్యక్రమంలో పాల్గొంటారు తప్ప అంతిమ సంస్కారాలు మాత్రం చేసే అవకాశం ఉండదు.
ఈ ఆచారం ఎక్కడిది?
ఆకుల వారి వంశంలో ఏడెనిమిది తరాల క్రితం తండ్రి చనిపోయినపుడు కొడుకు కొరివి పెట్టాడు. అనుకోకుండా కొడుకు చనిపోయాడు. వయసులో ఉన్న కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం ఆందోళనకు గురైంది. తండ్రికి కొరివి పెట్టిన కొంతకాలానికే కొడుకు చనిపోవడాన్ని ఏదో కీడుగా భావించిన కుటుంబ సభ్యులు తరువాత ఎవరు చనిపోయినా కొడుకులతో అంతిమ సంస్కారం, శ్రాద్ధకర్మలు చేయించకూడదని నిర్ణయించుకున్నారట. అప్పటినుంచి వారి ఇళ్లలో ఎవరు చనిపోయినా కోడళ్లే కొరివి పెట్టే పద్ధ్దతి కొనసాగుతోంది.
అదృష్టంగా భావిస్తారు...
ఇల్లన్నాక అత్తాకోడళ్ల మధ్య ఏవో చిన్న చిన్న పేచీలు ఉండనే ఉంటాయి. కాని ఆకుల వారి కుటుంబంలో అత్తలు కోడళ్లని బాగా చూసుకుంటారనే పేరు ఉంది. కోడళ్లకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే అత్తామామలు చనిపోతే అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సింది వారే కదా. అలా అని కోడళ్లు అత్తామామలను చిన్నచూపు చూడరు. ఎంతో అభిమానంగా చూసుకుంటారు. వారికి చివరి కర్మలు నిర్వహించాల్సి రావడం తమ అదృష్టంగా భావిస్తారు. ఒకవేళ పురుష సంతానం లేక కూతుళ్లే ఉన్నట్టయితే ఆకుల వారి కుటుంబంలో అన్నదమ్ముల కోడళ్లు అంతిమ సంస్కారం నిర్వహిస్తారు.
ఎక్కడా కనిపించని కోడలు కొరివి పెట్టే సంప్రదాయం ఆ కుటుంబంలో నిరంతరంగా కొనసాగుతోంది. వారి ఇళ్లలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల యాత్ర వెళుతుంటే గ్రామస్తులంతా ఇప్పటికీ ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు.
మా అత్త చితికి నేనే అగ్గిపెట్టిన...
నాకు ఇప్పుడు తొంబై ఏండ్లు ఉన్నయి. యాబై ఏండ్ల కిందట మా అత్త సచ్చిపోయింది. అప్పుడు నేను మా అత్తకు అగ్గిపెట్టిన. మా ఇండ్లళ్ల ఏడెనిమిది తరాల సంది గిట్లనే నడుస్తుంది. కోడండ్లే కొడుకుల లెక్క అన్ని చేస్తరు. అత్త, మామలకు అగ్గిపెట్టుడు అదృష్టమే. ఎవల ఇండ్లల్ల అయినా కొడుకులు పెడుతరు. మా ఇండ్లల్ల మాత్రమే కోడండ్లు అగ్గిపెడుతరు.
– ఆకుల లింగవ్వ
మా మామ చనిపోతే నేనే చేసిన...
మా మామ చనిపోయినపుడు అన్నీ నా చేతుల మీదుగానే చేయించిండ్రు. ఎనకట అగ్గివట్టిన కొడుకు చనిపోయిండ్రని కోడండ్లతోని చేయించుడు మొదలుపెట్టిండ్రు. అప్పటి నుంచి అదే సంప్రదాయం నడుస్తుంది. మేం అట్లనే నడుసుకుంటున్నం. ముందు ముందు గూడ మా పిల్లలు అట్లనే నడుసుకుంటరు. చావు దగ్గరి నుంచి దినాలు, మాసికాలు, యాడాది దినం కూడా కోడండ్ల చేతుల మీదుగనే నడుస్తయి.
– ఆకుల దేవేంద్రవ్వ
అత్త, మామ ఇద్దరికీ నేనే అగ్గివట్టిన...
మా అత్త సచ్చిపోయినపుడు, మా మామ సచ్చిపోయినపుడు నేనే అగ్గివట్టిన. కోడలు సేవ చేసుడే కాదు. అగ్గివట్టుడు, కర్మ చేసుడు అదృష్టం అనుకుంటం. కొడుకులు ఏ పని ముట్టద్దు. అన్ని పనులు కోడండ్ల చేతులతోనే చేయిస్తం. మా ఇండ్లల్ల కోడండ్లకు మంచి గౌరవం ఉంటది. చాన మంది మేనళ్లను చేసుకున్నం. మా ఇంట్ల మూడు తరాలు మేనోళ్లే ఉన్నరు.
– ఆకుల పెద్ద గంగవ్వ
మా మామకు నేనే చేసిన...
నాకు పెళ్లయిన కొత్తల కోడండ్లు అగ్గిపెడుతరని చూసి ఆశ్చర్యమనిపించింది. ఎక్కడా లేని సంప్రదాయం ఈడనే చూసిన. మొదట్ల ఇదేం సంప్రదాయమో అనుకున్న. కొడుకుతో కోడలు సమానం అన్న భావన నాకు అర్థమైంది.
– ఆకుల అనసూయ
– సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment