సుజిత బీటెక్ విద్యార్థిని. మూడో సంవత్సరానికి 10 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. దాంతో మానసికంగా చాలా ఒత్తిడికి లోనైంది. దాన్నుంచి తప్పించుకోవడానికి చేతికి అందింది తినడం అలవాటు చేసుకుంది. క్రమంగా బరువు పెరిగింది. వద్దనుకున్నా తినడం ఆపుకోలేక పోతోంది. దాంతో మరింత బరువు పెరుగుతోంది. జీరోసైజ్‌లో ఉండే తాను లావుగా మారడం పట్ల గిల్టీగా ఫీలవుతోంది.
ఎవరితోనూ మాట్లాడకుండా తన గదికే పరిమితమై బాధపడుతోంది. కూతురి సమస్యను తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు. సైకాలజీ కౌన్సెలర్‌ని కలిశారు. సుజిత తల్లిదండ్రులు చెప్పింది విన్నాక, సుజితతో మాట్లాడాక.. నెగటివ్ ఎమోష్స నుంచి తప్పించుకోవడానికి ఎక్కువ తినడం చిన్నప్పటినుంచీ ఆమెకున్న అలవాటని అర్థమైంది.
తిండిపై కంట్రోల్ కోల్పోయాననే విషయం తనను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని, దాన్ని తగ్గించుకునేందుకు మరింత తింటోందని ఆమె మాటల ద్వారా తెలిసింది. క్లినికల్ ఇంటర్వ్యూ, సైకలాజికల్ టెస్ట్స్, సైకో డయాగ్నసిస్ అనంతరం ఆమె బింజ్ ఈటింగ్ డిజార్డర్ (బెడ్)తో బాధపడుతోందని నిర్ధారణైంది. అతిగాతినేఈ వ్యాధి సుజితలా చాలామంది జీవితాలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది.
ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. దీన్ని సకాలంలో గుర్తించి చికిత్సను అందించడం అవసరం. అలా గుర్తించి సైకోథెరపీ తీసుకున్న 20 సెషన్లలో తన రుగ్మత నుంచి సుజిత బయటపడింది.
లైఫ్ స్టైల్ మార్పులు, సైకోథెరపీతో చెక్
అతిగా తినే వ్యాధికి సైకోథెరపీ అవసరమైనా ఎవరికి వారు తమను తాము నియంత్రించుకోవడం, లైఫ్ స్టయిల్లో మార్పులు చేసుకోవడం ద్వారా కొంతవరకు మెరుగుపరచుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం
రక్తంలో చక్కెర స్థాయిని నిలకడగా ఉంచడానికి, బింజ్ చేయాలనే కోరికను తగ్గించడానికి స్నాక్స్, భోజనం విషయంలో ఒక షెడ్యూల్‌ను సిద్ధం చేసుకుని ఫాలో అవ్వడం. భోజన సమయంలో శ్రద్ధను మరల్చే వాటిని నివారించడం, ప్రతి బైట్‌నూ ఆస్వాదించడం, ఆకలి తగ్గడం, పొట్ట నిండిన సంకేతాలపై దృష్టి పెట్టడం. బింజ్ ఈటింగ్‌ను ట్రిగ్గర్ చేసే పరిస్థితులు, ఎమోష్స, ఆహారాలను గుర్తించి.. వాటిని నివారించడానికి మార్గాలను సిద్ధం చేసుకోవడం.
ప్రతిరోజూ వ్యాయామం చేయడం ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక స్థితిని మెరుగుపరస్తుంది, పాజిటివ్ బాడీ ఇమేజ్‌ను ప్రమోట్ చేస్తుంది. సమస్యను అర్థం చేసుకుని సహాయం అందించగల స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవడం. స్వీయ విమర్శ స్థానంలో తనను తాను అంగీకరించుకోవడం. పైవన్నీ చేశాక కూడా ఎలాంటి ఫలితం కనిపించకపోతే ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ను సంప్రదించండి.
ఆహారం, తిండికి సంబంధమున్న నెగటివ్ ఆలోచనలను, ప్రవర్తనలను గుర్తించడంలో, మార్చడంలో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన నియంత్రణను ప్రోత్సహిస్తుంది. ఇంటర్ పర్సనల్ రిలేష్సను మెరుగుపరచడం, భావోద్వేగ ఒత్తిడిని తగ్గించడంలో ఇంటర్ పర్సనల్ థెరపీ సహాయపడుతుంది.
అతిగా తినే వ్యాధితో ఎదురయ్యే యాంగ్జయిటీ, డిప్రెషన్ లాంటి రుగ్మతలను తగ్గించడానికి మందులు కూడా అవసరం కావచ్చు. · వ్యక్తి అవసరాలను, అభిరుచులను గుర్తించి ఆరోగ్యకరమైన తిండి అలవాట్లను తయారుచేయడంలో న్యూట్రిషనిస్ట్ సహాయపడతారు.
రసాయన, మానసిక, సామాజిక కారకాలు...
ఈ వ్యాధికి కచ్చితమైన కారణమేమిటో ఇంకా తెలియకపోయినప్పటికీ దాని అభివృద్ధికి దోహదపడే ఆనువంశిక, రసాయన, మానసిక, సామాజిక కారకాలున్నాయి. అతిగా తినే వ్యాధి రావడంలో కుటుంబ చరిత్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.మెదడులో ఆకలి, రివార్డ్‌ను నియంత్రించే రసాయనాల అసమతుల్యత కూడా ఈ వ్యాధికి దారితీయవచ్చు.
నిరాశ, ఆందోళన, లో సెల్ఫ్ ఎస్టీమ్, ట్రామా లాంటి మానసిక సమస్యలు కూడా కారణమవుతాయి. తీవ్ర డైటింగ్ లేదా ఆహారంపై నియంత్రణకు తిరుగుబాటుగా కూడా బింజ్ ఈటింగ్‌కు దారితీయవచ్చు. జీరోసైజ్ ఉంటేనే అందమనే సోషల్ ప్రెజర్, ప్రాసెస్డ్ ఫుడ్ అందుబాటులో ఉండటం కూడా అతిగా తినే ప్రమాదాన్ని పెంచుతుంది.
గుర్తించడం సులభమే...
అతిగా తినే వ్యాధిని ఎవరికి వారు గుర్తించలేకపోయినా కుటుంబ సభ్యులు సులువుగా గుర్తించవచ్చు. ఈ రుగ్మత లక్షణాలు... తక్కువ వ్యవధిలో ఎక్కువ పరిమాణంలో ఆహారం తినడాన్ని నియంత్రించుకో లేకపోవడం. భారీగా తినడానికి సిగ్గుపడి ఎవరికీ తెలియకుండా దాచుకుని తినడం.
కడుపు నిండిందని తెలిసినా తినడం ఆపలేకపోవడం. తినే పదార్థాన్ని ఆస్వాదించకుండా అసాధారణవేగంతో తినడం. అతిగా తింటున్న విషయం గుర్తించి తనను తానే అసహ్యించుకోవడం. ఆహారం, తిండిపైనే మనసు నిలపడం వల్ల పనిలో ఏకాగ్రత కోల్పోవడం, మానవ సంబంధాలు నిర్వహించడంలో ఇబ్బంది పడటం.
Comments
Please login to add a commentAdd a comment